ఎన్నికల విధి వక్రించింది..
close

ప్రధానాంశాలు

Updated : 10/04/2021 05:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికల విధి వక్రించింది..

ఉపాధ్యాయుడి ఉసురు తీసింది
ఆరోగ్యం బాగోలేదన్నా పట్టించుకోని అధికారులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: తనకు జ్వరం వస్తోందని ప్రాధేయపడినా ఆ ఉపాధ్యాయుడిని ఎన్నికల విధుల నుంచి తప్పించలేదు. కనీసం రిజర్వులో కూడా ఉంచకుండా అలాగే విధులు నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. తీవ్ర జ్వరంతోనే ఎన్నికల విధులు ముగించుకొని వచ్చినా.. ఊపిరి మాత్రం నిలబడలేదు. బాధితులు, తోటి ఉపాధ్యాయుల వివరాల మేరకు.. శింగనమల మండలం వెస్ట్‌ నరసాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో  స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం)గా పనిచేస్తున్న బండారు దేవపుత్ర(48) తాడిపత్రి మండలం భోగాపురం పోలింగ్‌ కేంద్రం-6కు పరిషత్‌ ఎన్నికలకు ప్రిసైడింగ్‌ అధికారిగా (పీఓ) నియమించారు. ఈ నెల 7న తాడిపత్రిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద పడిగాపులు కాశారు. సామగ్రి తీసుకొనే ముందు తనకు జ్వరంగా ఉందని, రిజర్వులో ఉన్న వారిని కేటాయించాలని అధికారులను కోరారు. ఎంతగా బతిమిలాడినా.. విధుల నుంచి మినహాయించలేదని తనకు ఫోన్‌ ద్వారా తెలిపారని ఆయన సతీమణి పద్మజ విలపించారు. ఈ నెల 8న రాత్రి పోలింగ్‌ ముగించుకొని బ్యాలెట్‌ పెట్టెలను అనంతపురం జేఎన్‌టీయూలో అప్పగించేందుకు వారికి కేటాయించిన బస్సులో బయలు దేరారు. మార్గమధ్యంలో బస్సులోనే దేవపుత్ర అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. తోటి ఉద్యోగులు 108కు ఫోన్‌ చేశారు. భార్య పద్మజ కూడా ఉపాధ్యాయిని. బుక్కరాయసముద్రంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తూ భర్తకు ఫోన్‌ చేశారు. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, వెంటనే ఆసుపత్రి వద్దకు రావాలని చెప్పడంతో అనంతపురం సర్వజన ఆసుపత్రికి వెళ్లారు. 108 వాహనం రాకపోవడంతో బ్యాలెట్‌ బాక్సులు, సిబ్బందితో సహా బస్సు ఆసుపత్రి వద్దకు వచ్చింది. అక్కడ దించనివ్వకుండా పోలీసు ఎస్కార్ట్‌ వారు అభ్యంతరం తెలిపారు. నేరుగా బస్సును బ్యాలెట్‌ పెట్టెలు భద్రపరిచే జేఎన్‌టీయూకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రి వద్దనే తన భర్తను దించి ఉంటే.. బతికేవాడని భార్య పద్మజ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నికల అధికారులు విధుల నుంచి మినహాయింపు ఇవ్వకుండా, పోలీసు ఎస్కార్టు కనికరం లేకుండా వ్యవహరించారని ఆమె వాపోయారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన