ప్రియురాలిని హతమార్చి.. ప్రియుడి ఆత్మహత్య?

ప్రధానాంశాలు

Published : 30/07/2021 05:45 IST

ప్రియురాలిని హతమార్చి.. ప్రియుడి ఆత్మహత్య?

ఆమె మెడపై బ్లేడ్‌తో కోసిన గాయం
మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో దారుణం

మాదాపూర్‌, బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: ఓ హోటల్‌లోని బాత్రూం టబ్‌లో ప్రేమికురాలు గొంతుకు బ్లేడ్‌ గాయమై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. గదిలో ప్రేమికుడు ఆమె చున్నీతో ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలొదిలాడు. ఆమెను హతమార్చి... అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క చాలా ఏళ్లుగా వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించడం లేదు. వికారాబాద్‌ జిల్లా కోస్గి మండలం హకీంపేట్‌ గ్రామానికి చెందిన గుడిసె రాములు(25), బొంరాస్‌పేట మండలంలోని లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి(25) ఒకే పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. ఇంటర్‌ వరకు చదువుకున్న ఆమె హైదరాబాద్‌లో ఉంటూ ఎస్సై, కానిస్టేబుల్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా, రాములు కూడా నగరంలోనే కారు డ్రైవరుగా ఉపాధి పొందుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఒక రోజుకు గదిని అద్దెకు తీసుకొన్నారు. గురువారం మధ్యాహ్నం సిబ్బంది వెళ్లి ఖాళీ చేసే సమయం అయిందని తెలియజేయగా.. మరో రోజు ఉంటామని చెప్పారు. తర్వాత పలుమార్లు తలుపు తట్టినా లోపలి నుంచి అలికిడి లేకపోవడం, సాయంత్రమైనా బయటకు రాకపోవడంతో అనుమానమొచ్చి హోటల్‌ సిబ్బంది మారు తాళంతో తలుపు తెరిచారు. సంతోషి.. బాత్రూంలోని టబ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. గొంతుపై బ్లేడ్‌తో కోసిన ఆనవాళ్లున్నాయి. రాములు టీ-షర్ట్‌పై రక్తపు మరకలు కనిపించాయి. సంతోషిని చంపిన తరవాత అతడు ఆమె చున్నీతోనే ఫ్యానుకు ఉరేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము ఖాళీ చేయాలని చెప్పిన సమయంలోనే ఇద్దరూ గొడవ పడుతూ కనిపించారని హోటల్‌ సిబ్బంది పోలీసులకు వివరించారు. పూర్తి వివరాల కోసం మాదాపూర్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన