‘రైతుబంధు చెక్కుల’ కేసులో 23 మంది అరెస్టు

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:06 IST

‘రైతుబంధు చెక్కుల’ కేసులో 23 మంది అరెస్టు

రూ.61.50 లక్షలు కాజేసినట్లు గుర్తింపు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లాలో రైతుబంధు చెక్కులను పక్కదోవ పట్టించి డబ్బులు కాజేసిన కేసులో 23 మంది బ్యాంకు, రెవెన్యూ ఉద్యోగులు, దళారులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వీరికి స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కేసు వివరాలను నల్గొండ అదనపు ఎస్పీ నర్మద.. జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. రైతుబంధు పథకం ప్రారంభించిన 2018-19 ఖరీఫ్‌ సీజన్‌లో లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్కులు అందజేసిన విషయం తెలిసిందే. చనిపోయిన రైతుల పేర్ల మీద జారీ అయిన చెక్కులు, స్వగ్రామాలకు దూరంగా ఉంటున్న వారికి చెందిన చెక్కులను అక్రమంగా చేజిక్కించుకున్న రెవెన్యూ ఉద్యోగులు, దళారులు.. ఓ బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై వాటిని తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. జిల్లాలోని గుర్రంపోడు, నాంపల్లి, గుడిపల్లి, చింతపల్లి, పెద్ద అడిశర్లపల్లి, చండూరు పోలీసు స్టేషన్ల పరిధిలో 547 చెక్కులపై రూ.61.50 లక్షలను వీరు కాజేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన ఉద్యోగుల్లో ఒక డిప్యూటీ తహసీల్దార్‌, ఒక ఆర్‌ఐ, నలుగురు వీఆర్వోలు, నలుగురు వీఆర్‌ఏలు, నాంపల్లి ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగి ఒకరు ఉన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన