రెండో రోజూ అదే స్పందన
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో రోజూ అదే స్పందన

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : కొవిడ్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు జిల్లాలో రెండో రోజూ చక్కని స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగానే తమవంతు సహకారం అందించారు. దుకాణదారులు మధ్యాహ్నం 12 గంటల కల్లా మూసి వేసి తమ సంఘీభావం ప్రకటించారు. కొన్ని చోట్ల దుకాణాల వద్ద కర్ఫ్యూ సడలించిన వేళల్లో మాత్రం రద్దీ తప్పటం లేదు. ప్రధానంగా కిరాణా దుకాణాల వద్ద ఇది ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని నియంత్రిస్తేనే సత్ఫలితాలు సాధించగలమని వ్యాపారులు అంటున్నారు. ప్రజలు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించి కనీస దూరం పాటిస్తేనే నియంత్రించగలమని చెబుతున్నారు. ఇక రైతుబజార్ల వద్ద ఉదయం వేళల్లో రద్దీ కనిపించింది. ఇక్కడ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు. జనం ఒకే చోటకు చేరకుండా మొబైల్‌ రైతుబజార్లను విస్తృతంగా ఏర్పాటు చేసి కాలనీల్లోకి తీసుకువెళితే.. రైతుబజార్లపై ఒత్తిడి తగ్గుతుంది.
మరిన్ని పోలీసు పికెట్లు అవసరం..
పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే కర్ఫ్యూ విజయవంతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరైన కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చే ఒకరిద్దరిని కట్టడి చేస్తే అతి త్వరగా కర్ఫ్యూ ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు. దీని కోసం పోలీసు అధికారులు పలు ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళల్లో మాత్రమే ఎక్కువగా తనిఖీలు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచే తనిఖీలు ముమ్మరం చేస్తే జనంలో కదలిక వస్తుంది. త్వరగా ఇళ్లకు వెళ్లిపోతారు. చాలా చోట్ల ఇది జరగటం లేదు. ప్రధాన రహదారుల్లో ఒకటైన కారల్‌మార్క్స్‌ రోడ్డులో పోలీసు బీట్లు మధ్యాహ్నం వేళ అసలు కనిపించటం లేదు. మహాత్మాగాంధీ రోడ్డులో ఒక వైపు మార్గం మూసి వేశారు. ఒక వైపునే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక్కడా మధ్యాహ్నం వేళల్లో తనిఖీలు తక్కువగా జరుగుతున్నాయి. ప్రజా రవాణా లేకపోవటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
అంతర్గత రహదారుల్లోనూ..
పోలీసులు ఎక్కువగా మహాత్మాగాంధీ రోడ్డు, బెంజిసర్కిల్‌ తదితర ప్రాంతాల్లోనే తనిఖీలు చేపడుతున్నారు. సాయంత్రం వేళ అన్ని చోట్లా జరుగుతున్నా.. అంతర్గత రహదారులను పూర్తిగా విస్మరిస్తున్నారు. గాంధీనగర్‌, గవర్నర్‌పేట, వన్‌టౌన్‌, చిట్టినగర్‌, కాళేశ్వరరావు మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టకపోయినా పోలీసు వాహనాల కదలికలు ఉంటే.. అనవసరంగా తిరిగే యువతను కట్టడి చేయవచ్చు. తద్వారా కర్ఫ్యూను 14 రోజుల పాటు విజయవంతంగా స్వచ్ఛందంగా నిర్వహించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని