ప్రయాణ ప్రాంగణాలు కళకళ
logo
Published : 22/06/2021 04:13 IST

ప్రయాణ ప్రాంగణాలు కళకళ

మొదలైన దూరప్రాంత సర్వీసులు
ఈనాడు, అమరావతి

కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. దీంతో సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరిగాయి. చాలా కాలం తర్వాత ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలు కళకళలాడాయి. 12 గంటల పాటు ప్రజా రవాణాకు అనుమతి ఇవ్వడంతో దూరప్రాంత సర్వీసుల సంఖ్య మరింత పెరిగింది. కృష్ణా రీజియన్‌ నుంచి తొలి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 78 బస్సులు నడిచాయి. కర్ఫ్యూ కారణంగా జిల్లాలో చిక్కుకుపోయిన వారు ఈ సర్వీసులను ఉపయోగించుకున్నారు. చాలా బస్సుల్లో రద్దీ కనిపించింది. మధ్యాహ్నం వరకు విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండు ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ఇటీవలి కాలంలో ఇంత రద్దీ కనిపించడం ఇదే. ‌్ర దాదాపు నెలన్నర తర్వాత హైదరాబాద్‌కు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు తిప్పింది. సోమవారం కృష్ణా రీజియన్‌ నుంచి 20 సర్వీసులు నడిచాయి. నగరంలోని విజయవాడ, ఆటోనగర్‌ డిపోల నుంచి 12, జిల్లాలోని మిగిలిన ప్రాంతాలైన గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, తిరువూరు, జగ్గయ్యపేట, నూజివీడు డిపోల నుంచి ఏడు తిరిగాయి. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా సగం సీట్లలోనే ప్రయాణికులను అనుమతించారు. హైదరాబాద్‌ సర్వీసుల్లో 90 శాతం సీట్లు నిండాయి.  

హైదరాబాద్‌ తర్వాత అత్యధికంగా విశాఖపట్నం తిరిగాయి. రీజియన్‌ నుంచి 16 సర్వీసులు తిప్పారు. తిరుపతి, కర్నూలు, శ్రీశైలం, కాకినాడ, మంత్రాలయం, పామర్రు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, భద్రాచలం, తదితర మార్గాల్లో నడిచిన బస్సుల్లోనూ ప్రయాణికుల రద్దీ కనిపించింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు మొదటి రోజు ఎక్కువ మంది ఉన్నారు. విజయవాడలో సిటీ బస్సుల సంఖ్య కూడా పెంచారు. సుమారు 175 సిటీ సర్వీసులు నగరంలోని వివిధ ప్రాంతాలకు తిరిగాయి. మొత్తమ్మీద జిల్లాలో 700 బస్సులు సోమవారం నడిచాయి. దాదాపు 65 శాతం సర్వీసులను పునరుద్ధరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని