ఉన్న జలసిరి.. ఎండుతోంది వరి
eenadu telugu news
Published : 05/08/2021 06:06 IST

ఉన్న జలసిరి.. ఎండుతోంది వరి

డెల్టాలో విచిత్ర పరిస్థితి 50వేల ఎకరాలకు దెబ్బ!

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మోపిదేవి

గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు నీటి కాలువలకంటే ముందుగానే ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. గత నెల 2న బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నాటి నుంచి సముద్రంలోకి నీరు వెళుతూనే ఉంది. ఒక దశలో 2.8లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈనెల 3వ తేదీ వరకు సముద్రంలోకి 78 టీఎంసీల నీరు కలిసిపోయింది. దీని విలువ 7.8లక్షల ఎకరాల సాగు నీటితో సమానం. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు జిల్లాలో సాగునీటి కాలువల కింద పంటలు ఎండిపోతున్నాయి. వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బందరు కాలువ, కరవు కాలువ, రైవస్‌ కాలువల కింద చివరి ఆయకట్టు ప్రాంతానికి నీరు అందడం లేదు. రైతులు ముందు చూపుతో వెద సాగు చేసి ఏపుగా పెరిగిన వరి పైరు ఎండిపోతుంటే అన్నదాతల కళ్లలో కన్నీరు ఇంకి పోతోంది. కొన్ని ప్రాంతాల్లో నారుమళ్లను కాపాడుకోలేకపోతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు గానీ, నీటిపారుదల శాఖ అధికారులు గానీ ఈ విచిత్ర పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ప్రధానంగా అవనిగడ్డ, బందరు, పెడన, గుడివాడ తదితర నియోజకవర్గాల పరిధిలో వరి పైరుకు సాగు నీరు అందడం లేదు. కాలువకు నీరు చేరడం లేదు.

ఈ చిత్రాన్ని చూశారా..! గూడూరు మండలం కంకటివ గ్రామానికి చెందిన వాకా శ్రీనివాసరావు పొలమిది. సాగు వ్యయం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో వెద పద్ధతిలో వరి నాటారు. మొత్తం 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశారు. గత 15 రోజులుగా వానలు పడలేదు. కాలువలు ఉన్నా నీరు రావడం లేదు. దీంతో మొత్తం ఎండిపోతోంది. ఎకరా కౌలు రూ.20వేలు. దుక్కి దున్ని విత్తనాల ఖర్చు కలిపి ఎకరాకు రూ.5వేలకు పైగా అయింది. ప్రస్తుతం తడులు లేకపోతే.. ఎకరానికి రూ.25వేలు నష్టపోవాల్సిందే.

● కాలువల పరిస్థితి దారుణంగా ఉండడంతో నీరు పారడం లేదు. పంపిణీ కాలువకు చేరడం లేదు. కాలువలకు వదిలిన నీరు డ్రైన్లు ద్వారా తిరిగి నదిలో కలిసి సముద్రం పాలవుతోంది. చివరి ఆయకట్టు మండలాలకు ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంది. గతంలో కృష్ణా డెల్టా సాగు నీటి కాలువలు రావని వర్షాధార పంటలు వేసేవారు. గత ప్రభుత్వ హయాంలో పట్టిసీమ ఎత్తిపోతల పూర్తి చేసిన తర్వాత గోదావరి జలాలు రావడంతో చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు అందుతోంది. దీంతో అందరూ వరి సాగు చేస్తున్నారు. ● కరవు కాలువ (కేఈబీ) కింద ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రాంతం ఆయకట్టు ఉంది. 1.38లక్షల ఎకరాలు ఉంది. ప్రస్తుతం అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లో దాదాపు 20వేల ఎకరాల్లో వెద పద్ధతిలో సాగు చేసిన వరి పంట ఎండిపోతోంది. ● రైవస్‌ కాలువ బంటుమిల్లి, కృత్తివెన్ను ప్రాంతాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. కానీ నీరు చేరడం లేదు. మధ్యలో చేపలు, రొయ్యల చెరువులకు నీరు తరలిస్తున్నారు. దీంతో కింది ప్రాంతానికి నీరు చేరడం లేదు. ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 20వేల ఎకరాల్లో వరిపైరు ఎండిపోయింది. మరో 20వేల ఎకరాల్లో రెండు మూడు రోజుల్లో వానలు కురిసినా.. సాగు నీరు అందించినా పైరు బతికే అవకాశం ఉంది. రైవస్‌ కాలువ కింద 3.33లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. ● చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో కొంత ఎండిపోయింది. ● ఈ ఏడాది కాలువల నిర్వహణ సక్రమంగా లేదు. తూతూమంత్రంగా పనులు చేశారు. దీంతో నీరు చివరి ఆయకట్టుకు వెళ్లడం లేదు. ఖరీఫ్‌ సాగు సీజన్‌ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే సుంకు దశలో సాగునీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలని రైతులు వాపోతున్నారు. కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కాలువపై వంతెన కూలిపోయింది. దీన్ని బాగు చేయకపోవడంతో కిందకు నీరు వెళ్లడం లేదని రైతులు చెబుతున్నారు.

ఈ ఏడాది సముద్రంలోకి వెళ్లిన నీరు సుమారు ఈ చిత్రాన్ని పరిశీలించారా..! ఇవీ మోపిదేవి మండలంలోని పొలాలు. వెద పద్ధతిలో సాగు చేశారు. పూర్తిగా నీరు లేక ఎండిపోయాయి. చేతికి వచ్చే పరిస్థితి లేదు. సాగు నీటి కాలువలు ఉన్నా నీరు రావడం లేదు. పొలాలు బీటలు వారాయి.


సాగునే నమ్ముకున్నాం..

ప్రతి ఏడాది కష్టంగానే ఉంటున్నా సాగునే నమ్ముకున్నాం. నేను 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. చాలా వరకు ఎండిపోయింది. పరిస్థితి దారుణంగా ఉంది. పుష్కలంగా నీరు ఉన్నా.. పారలేని పరిస్థితి డెల్టా కాలువలకు ఉంది. కాలువలు మరమ్మతులు చేస్తే చివరి ఆయకట్టుకు నీరు అందించవచ్ఛు

-బోడపాటి వెంకటేశ్వరరావు, కౌలు రైతు


కౌలు 20 బస్తాలు ఇవ్వాల్సిందే..

కౌలుకు తీసుకుని 8 ఎకరాలు సాగు చేశా. కౌలు ఎకరానికి 20 బస్తాలు. పండినా పండకపోయినా కౌలు ఇవ్వాల్సిందే. ఇప్పటికే ఎకరానికి 5వేల చొప్పున పెట్టుబడి పెట్టా. రూ.40వేలు నష్టం. మాశ్రమ వృథా అయినట్లే. మళ్లీ ఇప్పుడు సాగు నీరు అందుతుందో లేదో తెలియదు. వర్షాలు వస్తే ఏమైనా సాగు చేసే అవకాశం ఉంటుంది.

-బాదర్ల వెంకటేశ్వరరావు, కౌలు రైతు


మూడు ఎకరాలు ఎండింది

పెద్దకళ్లేపల్లి గ్రామంలో ఉన్న మూడు ఎకరాలు వెద పద్ధతిలో సాగు చేశా. దుక్కులు, విత్తనాలకు కలిపి ఎకరాకు రూ.5వేల ఖర్చు అయింది. కలుపు మందు కూడా వేశా. పూర్తిగా ఎండిపోయింది. అసలు కాలువలకు నీరు రావడం లేదు. కాలువలు బాగు చేయడం లేదు. ప్రకాశం బ్యారేజీ వద్ద 8,500 క్యూసెక్కులు విడుదల చేశామంటున్నారు. ఇక్కడకు వచ్చే సరికి చుక్క నీరు ఉండడం లేదు. పూర్తిగా నష్టపోయా.

-అరజ కిరణ్‌కుమార్‌, రైతు


 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని