అగ్రిగోల్డ్‌ ఉద్యమం స్ఫూర్తిదాయకం
eenadu telugu news
Updated : 16/09/2021 06:53 IST

అగ్రిగోల్డ్‌ ఉద్యమం స్ఫూర్తిదాయకం


ప్రసంగిస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చిత్రంలో సుందరరామరాజు, తిరుపతిరావు, లక్ష్మణరావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్‌, నరసింహారెడ్డి తదితరులు

అలంకార్‌కూడలి (విజయవాడ), న్యూస్‌టుడే : అగ్రిగోల్డ్‌ ఉద్యమం దేశానికే దిక్సూచి కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆకాంక్షించారు. బుధవారం నగరంలోని దాసరి భవన్‌లో అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, బాధితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞతాభివందన సభకు ఆయన హాజరై ప్రసంగించారు. అగ్రిగోల్డ్‌ ఉద్యమం వెనుక పటిష్టమైన నాయకత్వం, పోరాట పటిమ ఉందని, ఇది స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశంలో మొత్తం 27మంది ఆర్థిక నేరస్థులంతా జైళ్లకు పోగా, ప్రస్తుత ప్రధాని మోదీ కాలంలో విదేశాలకు పారిపోతున్నారని విమర్శించారు. వారి మోసపూరిత విధానాలతో ఎంతో మంది అమాయకులు బలవుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు కె.ఎస్‌.లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ... చట్ట సభల్లో మిగిలిన అగ్రి గోల్డ్‌ సమస్యల పరిష్కారం కోసం పోరాడతామన్నారు. సుదీర్ఘమైన ఈ పోరాటం ద్వారా చాలా నేర్చుకున్నామని, నిరంతర ఉద్యమాలతోనే బాధితుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమంమైందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఈ ఉద్యమానికి ముప్పాళ్ల నాగేశ్వరరావు నాయకత్వం ఎంతో దోహదపడిందని, స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. బాధితులకు చివరి రూపాయి వచ్చేంత వరకు ఉద్యమించాలని, దానికి తాము అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, బాధితుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.సుందరరామరాజు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి బి.వి.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు ఇ.వి.నాయుడు, ఏఐటీయూసీ రాష్ట్ర సభ్యుడు కె.రామాంజనేయులు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, వివిధ పార్టీల నాయకులు, అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని