మార్గం మార్చిన మాఫియా
eenadu telugu news
Published : 16/09/2021 04:03 IST

మార్గం మార్చిన మాఫియా

 రేషన్‌ బియ్యం పాలిష్‌ చేసి విక్రయాలు

 తెల్లదనానికి సున్నం పొడి మిశ్రమం

 కొన్ని మిల్లుల్లో అక్రమాలు

ఈనాడు, అమరావతి

జిల్లాలో వరి విస్తారంగా పండడంతో అందరికీ బియ్యం అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నెలవారీగా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం చాలా మంది తినకుండా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కరోనా నేపథ్యంలో నెలకు రెండు సార్లు బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. కార్డుదారుల నుంచి కిలో రూ.8-10లకు దళారులు సేకరిస్తున్నారు. వీరి నుంచి బియ్యం సేకరించిన వ్యాపారులు కొన్ని మిల్లుల కేంద్రంగా నయా దందాకు తెరలేపారు. ఇప్పటివరకు సేకరించిన రేషన్‌ బియ్యాన్ని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుకు తరలించి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా సొమ్ము చేసుకునేవారు. నెలకు రెండుసార్లు పేదలకు బియ్యం ఇస్తుండడంతో పెద్దఎత్తున వస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోర్టులకు సరఫరా చేయడంతో పాటు స్థానికంగా విక్రయాలకు తెరలేపారు. బియ్యాన్ని మరోసారి మర ఆడించి పాలిష్‌ చేసి సన్నబియ్యంలో కలిపేస్తున్నారు. బీపీటీ బియ్యంతో కలిపి విక్రయించడం లేదా రేషన్‌ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి నేరుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో పెద్దఎత్తున లాభాలు ఉండడంతో బరితెగించిన వ్యాపారులు కొందరు యథేచ్ఛగా బియ్యం కల్తీ చేసి జేబులు నింపేసుకుంటున్నారు.

సరికొత్త దందా...

రేషన్‌ బియ్యం సేకరించిన వ్యాపారులు మిల్లుకు చేరేసరికి కిలోకు రూ.15 వరకు వెచ్చిస్తున్నారు. మిల్లులో పాలిష్‌ చేసి రంగురంగుల సంచుల్లో నింపి సన్నబియ్యం అని వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో బియ్యం తెల్లగా ఉండడానికి ప్యాకింగ్‌కు ముందు రాశిలో గుప్పెడు సున్నం పౌడరును కూడా కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన బియ్యాన్ని ప్రైవేటు వసతిగృహాలు, ప్రజల రాకపోకలు ఎక్కువ సాగించే కూడళ్లలోని హోటళ్లు, కొందరు క్యాటరింగ్‌ కేంద్రాల నిర్వాహకులకు తక్కువ ధర ఆశ చూపి అంటగడుతున్నారు. కిలో రూ.35 నుంచి రూ.38 మధ్య విక్రయిస్తున్నారు. జిల్లాలో వసతిగృహాల్లో అన్ని విభాగాల విద్యార్థులు కలిపి 1.15లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఇందులో కొన్ని వసతిగృహాలకు కూడా కల్తీ బియ్యం సరఫరా అవుతున్నాయి. పెద్ద సభలు, సమావేశాలు, ఫంక్షన్ల నిర్వహణ సమయంలో ఈ బియ్యాన్ని వండి వడ్డిస్తున్నారు. పాలిష్‌ ఎక్కువగా చేయడంతో అన్నం తెల్లగా ఉండి వేడిగా ఉన్నప్పుడు తింటుంటే ఎవరికీ అనుమానం రావడం లేదు. హోటల్‌ యజమానులు ఎవరైనా బియ్యం సరిగా లేవని విక్రయదారులను ప్రశ్నిస్తే నీటిలోపం వల్ల అలా జరిగి ఉండవచ్చని బుకాయిస్తున్నారు. కిలోకు అన్ని ఖర్చులు పోనూ సగటున రూ.15 మిగులు ఉండడంతో ఎంత కష్టమైనా వ్యాపారం మాత్రం ఆగకుండా అందరినీ సంతృప్తి పరుస్తున్నారు. ఇది ఎక్కువగా డెల్టా ప్రాంతంలోని మిల్లుల్లో జరుగుతున్నట్లు గుర్తించారు. అధికారుల దాడుల్లో రేషన్‌బియ్యం పట్టుబడితే నేతలు జోక్యం చేసుకుని పట్టుబడిన పరిమాణంలో ఎంతోకొంత చూపి మిగిలినవి వదిలేయాలని హుకుం జారీ చేస్తున్నారు. నేతల అండదండలతో రేషన్‌బియ్యం సన్నబియ్యంగా మార్చి విక్రయించే వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ సరిహద్దులోని పల్నాడు నియోజకవర్గంలో 350 బస్తాల రేషన్‌ బియ్యాన్ని యంత్రాంగం స్వాధీనం చేసుకుంటే ప్రజాప్రతినిధి సంబంధిత అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి 50 బస్తాలు మాత్రమే దొరికినట్లు చూపి మిగిలినవి వదిలిపెట్టాలని సూచించడంతో చేసేదిలేక అధికారులు మిన్నకుండిపోయారు. డెల్టాలో ఇటీవల ఒక పట్టణంలో 850 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. తీర ప్రాంత నేత ఒకరు, ప్రజాప్రతినిధి ఒకరు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి మూడోవంతు మాత్రమే పట్టుబడినట్లు చూపేలా చక్రం తిప్పారు. మిగిలిన బియ్యాన్ని అక్కడి నుంచి దారి మళ్లించడం గమనార్హం. ఒక అధికారికి పెద్దఎత్తున ముడుపులు ముట్టజెప్పడంతో అయన అందరి మీద కస్సుబుస్సులాడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తీరప్రాంతంలో రేషన్‌ బియ్యం మాఫియాకు ఒక నేత అండగా ఉంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో అధికారులు తనిఖీలకు వెళితే జిల్లాలో ఎక్కడా జరగలేదా? అంటూ యంత్రాంగంపై బెదిరింపు ధోరణిలో వాదనకు దిగుతున్నారు. డెల్టాలో రైస్‌మిల్లులు ఎక్కువగా ఉన్న పట్టణంలో కొన్ని మిల్లులు కేవలం రేషన్‌బియ్యం వ్యాపారంపై ఆధారపడి పని చేస్తున్నాయి. బియ్యాన్ని కల్తీ చేయడంతోపాటు సున్నం పౌడరు కలిపి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఇక్కడి నుంచి పోర్టులకు తరలించి సొమ్ము చేసుకున్న వ్యాపారులు స్థానిక విక్రయాల పేరుతో దండుకోవడం గమనార్హం.

ఆరా తీస్తే అక్రమాలు వెలుగులోకి...

డెల్టా ప్రాంతంలో కొన్ని రైస్‌ మిల్లులకు సంబంధించి గత ఆరునెలల లావాదేవీలు పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? సీఎంఆర్‌ కింద ఇచ్చిన బియ్యం ఎంత? ప్రైవేటుగా విక్రయాలు చేసిన బియ్యం వివరాలు ఆరా తీస్తే విస్తుపోయే అంశాలు తేటతెల్లం కానున్నాయి. కొందరు మిల్లు యజమానులు మరో ట్రేడింగ్‌ లైసెన్సు తీసుకుని అక్రమమార్గంలో బియ్యం రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా విభాగాల అధికారులు సంబంధిత దస్త్రాలు పరిశీలిస్తే అక్రమార్కుల బండారం బయటపడనుంది. డెల్టాలో బియ్యం వ్యాపారంలో కీలకపాత్ర పోషిస్తున్న తీరప్రాంతానికి చెందిన వ్యాపారి ఒకరు అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని