నగరపాలక సంస్థ పీఆర్వోపై విచారణ ముమ్మరం
eenadu telugu news
Published : 19/09/2021 02:10 IST

నగరపాలక సంస్థ పీఆర్వోపై విచారణ ముమ్మరం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : గవర్నరుపేటలోని 639 చదరపు గజాల్లో పాత డాబా విక్రయ లావాదేవీల్లో మోసానికి పాల్పడిన నగరపాలక సంస్థ పీఆర్వో బొమ్మళ్ల శ్రీనివాసరావుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో శ్రీనివాసరావు తమను రూ.30 లక్షల మేర మోసం చేసినట్లు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పెరుమాళ్ల కాశీరావు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. నిందితుడైన బొమ్మళ్ల శ్రీనివాసరావు.. దేవదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కొంత కాలం పీఆర్‌వోగా పనిచేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వన్‌టౌన్‌ పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఇక్కడి స్టేషన్‌లో పంచాయతీ చేశారని సీఐపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి, అంతర్గతంగా విచారణ నిర్వహించారు. విమర్శలు రాకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడానికి భవనీపురం సీఐ మురళీకృష్ణకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

స్థలం ఎన్‌వోసీపై నెలకొన్న వివాదమే కారణమా?

డాబా విక్రయ వ్యవహారం, దాని తదనంతర పరిస్థితులపై పోలీసులు లోతుగా ఆరా తీశారు. జక్కంపూడిలో ఓ దేవాదాయ స్థలానికి ఎన్‌వోసీ కావాల్సి వచ్చింది. దీనికోసం ప్రయత్నించగా దేవాదాయశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మంత్రికి సన్నిహితంగా తిరిగే ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వివాదం పెరిగి పెద్దదై గవర్నర్‌పేటలోని స్థల విక్రయం విషయంలో జరిగిన మోసం గుప్పుమంది. స్పెషల్‌ బ్రాంచ్‌ విచారణలో ఇది బట్టబయలైనట్లు సమాచారం.

విధుల నుంచి తొలగింపు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థలో ఒప్పంద పద్ధతిపై పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారి(పీఆర్‌వో)గా పనిచేస్తున్న బొమ్మళ్ల శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించినట్లు కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ శనివారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్రీనివాసరావు ప్రైవేటు వ్యవహారాల్లో తలదూర్చడంతోపాటు, మరిన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. వీటిపై కమిషనర్‌కు పలు ఫిర్యాదులు అందాయి. తాజాగా నగరంలోని ఓ విలువైన స్థలం క్రయ, విక్రయాలకు సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించి రూ.30 లక్షలకు మోసం చేసినట్లు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని