ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి రూ.41.96కోట్లు
eenadu telugu news
Published : 21/09/2021 02:55 IST

ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి రూ.41.96కోట్లు

మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

కృష్ణలంక, న్యూస్‌టుడే: జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.41.96 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ చెప్పారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ భవనంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.సుహాసిని, డీపీవో జ్యోతి, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలు రానున్న ఐదేళ్లలో మౌలిక సదుపాయాలతో అభివృద్ధిలోకి వస్తాయన్నారు. జిల్లాలోని 278 సబ్‌ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి రూ.3.35 లక్షల జీతాల చెల్లింపు కోసం రూ.9.31 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. బ్లాక్‌, మండల ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.80.96 లక్షలు కేటాయిస్తూ రూ.10.52 కోట్లు అవసరం అవుతాయని కలెక్టర్‌ అంచనా వేశారు. 783 ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక వ్యాధుల నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహించేందుకు రూ.4.22 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రాథమికంగా 13 మండలాల పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆ పీహెచ్‌సీల్లో రూ.5లక్షల విలువైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే పరికరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో రూ.48.85 లక్షలతో 22 అర్బన్‌ హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు అభివృద్ధి చేసేందుకు రూ.10.74 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వాటిల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఒక్కోదానికి రూ.7.5 లక్షలు కేటాయించామని, దీనికోసం రూ.1.65 కోట్లు ఖర్చవుతుందన్నారు. రూ.5లక్షలతో 22 స్పెషలిస్ట్‌ క్లినిక్‌లను కూడా అర్బన్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. కొవిడ్‌ మూడో దశపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కరోనా, డెంగీ, మలేరియా జ్వరాలకు ప్రాధాన్యతనిచ్చి అందుకు తగ్గట్లుగా పరీక్షలు జరిపే పరికరాలను కూడా అందుబాటులోనికి తీసుకు వస్తామన్నారు. జిల్లాలోని 63 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో 41 సెంటర్లను నేషనల్‌ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి పరుస్తామన్నారు. మిగిలిన 22 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కూడా వైద్య నిపుణుల సేవలందించేందుకు ప్రజలకు అందుబాటులోనికి వస్తాయన్నారు. విజయవాడ రూరల్‌ మండలం ఎంపీడీవో సునీత, వైశ్య మహిళా మండలి ప్రతినిధి రష్మి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని