అర్జీలు సత్వరం పరిష్కరించండి
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

అర్జీలు సత్వరం పరిష్కరించండి

అర్జీదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ చంద్‌

కృష్ణలంక, న్యూస్‌టుడే: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సత్వరమే పరిష్కారాన్ని చూపించాలని ఆయా శాఖల అధికారులకు సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ సూచించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం 16అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. వీటిలో రెవెన్యూ 7, పోలీస్‌శాఖ 3, హెల్త్‌ 2, ఇతర శాఖలకు చెందిన 4 ఉన్నాయని చెప్పారు. అందిన వినతుల్లో కొన్నింటిపై అక్కడికక్కడే సంబంధిత తహసీల్దార్లకు ఫోన్‌ చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఏవో ఎస్‌.శ్రీనివాసరెడ్డి, డీఎల్పీవో కేపీ చంద్రశేఖర్‌, సీడీపీవో ఎస్‌.సువర్ణ, ఆర్టీసీ డిపో మేనేజర్‌ కె.బసవయ్య, పలు శాఖల అధికారులు   పాల్గొన్నారు.  
అక్రమ నిర్మాణాన్ని  తొలగించండి
యనమలకుదురు వద్ద ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి, గోడ నిర్మించి స్టీల్‌స్టోర్‌ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దానిని తొలగించాలని తాడిగడపకు చెందిన రెహమాన్‌ వినతిపత్రం అందజేశారు. దీనిపై సబ్‌కలెక్టర్‌ స్పందిస్తూ గోడను తక్షణమే తొలగించాలని తాడిగడప మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.
ధ్రువపత్రాలకు, టీసీలకు  డబ్బులు అడుగుతున్నారు..
తమ కుమార్తె నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిందని, సర్టిఫికెట్లు అడుగుతుంటే రూ.30 వేలు ఫీజు కట్టి తీసుకెళ్లాలని, కళాశాల వారు ఒత్తిడి చేస్తున్నారని పోరంకికి చెందిన ఎన్‌.వినయ్‌ కుమార్‌ వాపోయారు. తాము గతంలోనే రూ.10 వేలు కట్టినట్లు చెప్పారు. మరో కుమార్తె పోరంకిలోని ఓ ప్రవేటు పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిందని, పాఠశాల ఫీజు నిమిత్తం రూ.5 వేలు కట్టామని, అదనంగా రూ.42 వేలు కట్టి టీసీ తీసుకెళ్లాలని యాజమాన్యం చెబుతోందని పేర్కొన్నారు. సబ్‌కలెక్టర్‌ స్పందిస్తూ ఈ విషయంపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని డీఈవోను ఆదేశించారు.  
ఎస్సీ నిధుల వినియోగంపై  నివేదికలు పంపండి: జేసీ
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఎస్సీ నిధుల వినియోగంపై అధికారులు వెంటనే నివేదికలు పంపాలని జేసీ మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె జేసీ అభివృద్ధి ఎల్‌.శివశంకర్‌, జేసీ హౌసింగ్‌ శ్రీవాస్‌నుపూర్‌ అజయ్‌కుమార్‌, జేసీ ఆసరా మోహన్‌కుమార్‌లతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం మూడు రోజుల్లో జిల్లా పర్యటనకు వస్తుందని, ఎస్సీలకు కేటాయించిన నిధుల వినియోగంపై ఆరాతీస్తారు కాబట్టి అధికారులు త్వరితగతిన నివేదికలు తయారు చేసి అందజేయాలన్నారు. ఏదైనాశాఖకు బడ్జెట్‌ కేటాయింపు లేకపోతే నిల్‌ రిపోర్టు పంపాలన్నారు శివశంకర్‌ మాట్లాడుతూ సచివాలయాల్లో  బయోమెట్రిక్‌ హాజరు పెంచే విధంగా మండల అధికారులు పర్యవేక్షించాలనీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులనుంచి ఎకనాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలని సూచించారు.
పోలీసు స్పందనకు 25 ఫిర్యాదులు
విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : నగరంలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనకు 25 ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 25 ఫిర్యాదుల్లో అత్యధికంగా నగదు లావాదేవీలకు సంబంధించినవని పోలీసులు తెలిపారు. నగదు లావాదేవీలు 8, సివిల్‌ 6, కుటుంబ కలహాలు 2, మోసాలు 1, కేసుల త్వరిత దర్యాప్తుపై 3, దొంగతనంపై 1, ఇతర ఫిర్యాదులు 4 వచ్చాయి. వీటిని తక్షణం పరిష్కరించాలని సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులకు సీపీ ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని