కార్పొరేషన్‌ ఖజానాకు చిల్లు
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

కార్పొరేషన్‌ ఖజానాకు చిల్లు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

ఎస్సీ ఉపప్రణాళిక నిధులతో 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో విజయవాడ గరంలో అభివృద్ధి పనులు చేసుకునేందుకు సీడీఎంఏ అనుమతించింది. రూ.18.83 కోట్లతో 159 పనులను మూడు సర్కిళ్లలో నగరపాలక సంస్థ చేపట్టింది. దీనికి సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. వాటిని రాబట్టేందుకు శ్రద్ధ చూపాల్సిన అధికారులు అందుకు భిన్నంగా ఆ మొత్తం నిధులను కార్పొరేషన్‌ ఖజానా నుంచి ఖర్చుచేసేందుకు సిద్ధమయ్యాయి. దీనికి తాజాగా కౌన్సిల్‌ ఆమోదం కూడా పొందారు.


నగరంలో వర్షపునీటి డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.462 కోట్లు మంజూరు చేసింది. వాటితో మూడు నియోజకవర్గాల పరిధిలో 444 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలి. ప్రజారోగ్య విభాగం పర్యవేక్షణంలో 271 కిలోమీటర్ల పరిధిలో పనులు పూర్తయ్యాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారు సంస్థ మిగిలిన పనులు ఆపేసింది. ఇంకా 173 కిలోమీటర్లు పూర్తి కావాలి. పనులు ఆలస్యం అవుతున్నాయనే సాకుతో మహానాడు రోడ్డు నుంచి ఆటోనగర్‌ రోడ్డు వరకు రెండు వైపులా వర్షపునీటి డ్రెయిన్ల పనులు సొంతంగా చేపట్టేందుకు నగరపాలక సంస్థ నిర్ణయించింది. అందుకు రూ.1.99 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది.

గరపాలక సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులు సమకూరుతాయి. ప్రభుత్వాలు అమలు చేసే పలు పథకాల కింద కూడా నిధులు కూడా ఇవ్వాలి. వాటితో నగరంలో పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుంది. ఆయా నిధులను సకాలంలో రాబట్టుకునేందుకు పాలకులు, అధికారులు యత్నించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అవసరాన్ని బట్టి లేఖలు రావాలి. ప్రభుత్వ పెద్దలు, అధికారులతో చర్చించాలి. వీటిపై అంతగా ఆసక్తి చూపని నగరపాలక సంస్థ.. తన ఖజానాను మాత్రం ఖాళీ చేసేందుకు సిద్ధమవడం గమనార్హం. నగరంలో అనేక రహదార్ల పాడైపోయాయి. వాటికి మరమ్మతులు, పునరుద్ధరించేందుకు నిధులు అవసరం. ఆ పనులు చేసేందుకే నగరపాలక సంస్థ ఆపసోపాలు పడుతోంది.  ఇక రిటైనింగ్‌ వాల్స్‌, సైడ్‌ డ్రెయిన్లు, కల్వర్టులు, భవనాలు పనులు చేపట్టాల్సి ఉంటుంది. దీనిపై కౌన్సిల్‌కు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. వాటిని చేపట్టాలన్నా, పూర్తి చేయాలన్నా నిధులు కావాలి. ఇక పాలనాపరమైన వ్యవహారాలకు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది వేతనాలకు రూ.కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ స్థితిలో రావాల్సిన నిధులు రాబట్టుకోలేని ఉన్న నగరపాలక సంస్థ.. తన ఖజానాను ఖర్చు చేస్తూ ఆర్థికంగా చేతులు కాల్చుకునేందుకు సిద్ధమవుతోంది.


సంబంధం  లేకపోయినా ఖర్చులు...

పచ్చదనం బాధ్యత ఎవరిది?: రామవరప్పాడు రింగ్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయ రహదారి వెంట పచ్చదనం పెంపులో భాగంగా ఎండిపోయిన, పాడైపోయిన మొక్కల స్థానే 9 కిలోమీటర్ల మేర కొత్తవి నాటేందుకు, వాటి నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. జాతీయ రహదార్ల వెంట పచ్చదనం బాధ్యత గతంలో సీఆర్‌డీఏ (ప్రస్తుతం ఎంఆర్‌డీఏ) చూసేది. ఇక నేషల్‌హైవేస్‌ అథారిటీ ఉంటుంది. వారు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం పచ్చదనం కోసం నగరపాలక సంస్థ రూ.2 కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది.

విద్యాగ్రాంటు వద్దా: నగరపాలక సంస్థకు చెందిన 105 పాఠశాలల్లో 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 850 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అవసరాన్ని బట్టి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉపాధ్యాయులను తీసుకుంటున్నారు. వారి జీతాలను 010 పద్దు కింద ప్రభుత్వం విద్యాగ్రాంటుగా భరిస్తుంది. అదనంగా ప్రస్తుతం 221 మంది విద్యావాలంటీర్లు అవసరమని లెక్కించారు. వారి వేతనాల వ్యయాన్ని విద్యాశాఖ నుంచి రాబట్టుకునేందుకు యత్నించని నగరపాలక సంస్థ, ఖజానా నుంచి రూ.1.24 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది.

ఆర్థిక సంఘం నిధులున్నా...
నగరపాలక సంస్థ సర్కిల్‌-1 పరిధిలో రహదార్ల నిర్మాణాలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అయ్యాయి. వాటిని రాబట్టుకునేందుకు, ఖర్చు చేసేందుకు 2022 మార్చి వరకు గడువు ఉంది. నిధులు రావడంలో జాప్యం, పనులు చేపట్టడంతో ఆలస్యం అనే సాకుతో నగరపాలక సంస్థ ఖజానా నుంచి రూ.5.31 కోట్లు ఖర్చు చేయడానికి పాలకులు నిర్ణయించారు.  

క్రీడలను ప్రోత్సహించాలంటే?

విద్యాధరపురంలో క్రీడాప్రాంగణం నిర్మాణం చేపట్టి, క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ప్రతిపాదన ఏళ్లుగా ఉంది. అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ భరించాల్సి ఉంది. 2020 ఫిబ్రవరిలో నగరానికి మంజూరైన రూ.100 కోట్లలో అక్కడ స్టేడియం నిర్మాణానికి రూ.8 కోట్లు కేటాయించారు. ఆపై వ్యయం రూ.14 కోట్లు అవుతుందని తేల్చారు. మిగిలిన సొమ్ము రాబట్టుకోలేని స్థితితో కార్పొరేషన్‌ ఖజానా నుంచి రూ.6 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వచ్చారు.

పండగ పేరుతో: విజయవాడలో ఇంద్రకీల్రాదిపై జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండగా ప్రకటించారు. 12 రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు 650 మంది సిబ్బంది అవసరమని, వారి వేతనాలకు రూ.33 లక్షలు వ్యయం అవుతుందని లెక్కించారు. దీనిని ప్రభుత్వం, దేవాదాయశాఖ, దుర్గామల్లేశ్వర దేవస్థానం ఖర్చుపెట్టాలి. కానీ వాళ్లు పట్టించుకోని స్థితిలో ఆ మొత్తం వ్యయాన్ని నగరపాలక సంస్థ తన నెత్తిన వేసుకుంది.

గుత్తేదారు పని: నగరపాలక సంస్థ పరిధిలో 34,500 వీధిదీపాలు ఉన్నాయి. వాటి నిర్వహణ బాధ్యత ఓ సంస్థ చూస్తోంది. అందుకు కార్పొరేషన్‌ నెలకు రూ.55 లక్షలు ఆ సంస్థకు చెల్లిస్తోంది. వాస్తవానికి 95 శాతం వీధి దీపాలను ఆ సంస్థే వెలిగించాలి. పరికరాలను కూడా అమర్చాలి. ప్రస్తుతం 15 శాతం వీధిదీపాలు వెలగడం లేదు. పరికరాలు పాడైపోయాయి.  అలక్ష్యం చూపుతున్న సంస్థపై చర్యలు తీసుకోకుండా, రూ.2 కోట్లతో ఎల్‌ఈడీ విద్యుత్తు పరికాలు కొనుగోలు చేసేందుకు పాలకులు నిర్ణయించారు.
ఏవీ ప్రభుత్వ నిధులు?- సింగ్‌నగర్‌లో 12 ఎకరాల్లో రూ.10 కోట్ల ఆర్థిక సంఘం నిధులతో పార్కు అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. రూ.2.03 కోట్లకు పైగా విలువైన పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో మిగిలిన పనులు చేసేందుకు గుత్తేదారు విముఖత చూపారు. చేసేదిలేక రూ.5 కోట్లను ఖజానా నుంచి ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని