మందులివ్వండి... మహాప్రభో..!
eenadu telugu news
Updated : 22/10/2021 06:29 IST

మందులివ్వండి... మహాప్రభో..!

తల్లడిల్లుతున్న క్యాన్సర్‌ రోగులు

ఈనాడు, అమరావతి

పక్క పట్టికలో పేర్కొన్నవి కీమోథెరపీ ఔషధాలు. ఇవి గుంటూరు జీజీహెచ్‌ నాట్కో కేన్సర్‌ ఆస్పత్రిలో లేవు. గత కొద్ది రోజులుగా వాటిని బయట కొనుగోలు చేసుకోవాలని రోగులకు చెబుతున్నారు. ఇవి ఖరీదైనవి కావడంతో అంత ఆర్థిక స్థోమత లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔషధాలు స్పెషలైజ్డ్‌ మెడికల్‌ షాపుల్లోనే దొరుకుతాయి. బయట ఎక్కడా లేవు. నిర్దేశిత సమయానికి ఆ మందులు వేసుకోకపోతే తిరిగి కేన్సర్‌ ముదురుతోందని, నీరసం వస్తోందని, నొప్పులు భరించలేకపోతున్నామని రోగులు ‘ఈనాడు-ఈటీవీ’కి ఏకరువు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం వారు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కేన్సర్‌ విభాగం వైద్యులు కీమోథెరఫి డ్రగ్స్‌ సరఫరా చేయాలని సూపరింటెండెంట్‌కు ప్రతిపాదనలు పంపారు.

నిర్దేశిత బడ్జెట్‌ అయిపోయిందని...

రాష్ట్రంలో క్యాన్సర్‌ వైద్యానికి జీజీహెచ్‌లో సదుపాయాలు ఉండడంతో ఆయా జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో నిర్దేశిత మందుల బడ్జెట్‌ అయిపోయిందని, అదనపు బడ్జెట్‌ కోరితే తప్ప ఉచిత మందులు రావని వైద్యులు అంటున్నారు. డాక్సోరుబిసిన్‌ 10ఎంజీ, 5 ఎంఎల్‌ ఇంజెక్షన్లు, పాస్లిటాక్సెల్‌ ఇంజెక్షన్‌ 30 ఎంజీ, 5 ఎంఎల్‌ ఇంజెక్షన్లు లేక కొందరు రోగులకు రేడియేషన్‌ ఇచ్చి సరిపుచ్చుతున్నామని చెబుతున్నారు. ఇవి బయట తెచ్చుకోవాలని చెబుతున్నారని రోగులు తెలిపారు. ఇప్పటికే కొన్నిమందులు సీడీఎస్‌లో లేకపోతే వాటిని బయట కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.కోటి దాకా బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రికి ఎవరూ మందులు సరఫరా చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అందువల్లే వాటిని బయట తెచ్చుకోవాలని కోరుతున్నామని వైద్యులు అంటున్నారు. నిత్యం 20-30 మంది కొత్త రోగులు, పాలో అప్‌ కోసం మరో 50-60 మంది వస్తుంటారు. మొత్తంగా క్యాన్సర్‌ బ్లాక్‌ ఎప్పుడు చూసినా రోగులతో కిటకిటలాడుతుంది. ఇవే మందులు అనంతపురం, కర్నూలు, కాకినాడ, విశాఖపట్నం ఆస్పత్రుల్లోనూ ఉన్నాయి. కనీసం వాటిని డైవర్షన్‌ పెట్టించి ఇచ్చినా జీజీహెచ్‌కు సమస్య తీరేది.


పిల్లల్ని వదిలి ఉంటున్నాం  

జెస్సీకుమార్‌, బాధితుడు, విజయవాడ

నెల నుంచి మందుల కోసం ఆస్పత్రిలోనే భార్య శిరీషతో కలిసి ఉంటున్నా. ఇంటి వద్ద చిన్న పిల్లలు ఉన్నారు. ఇంటికి వెళ్తే మందులు వస్తే అయిపోతాయేమోనన్న భయం వెంటాడుతోంది. పెయింట్‌ కార్మికుడిని. కీమో మందులు బయట తెచ్చుకోవాలని రాసిచ్చారు. మాకు ఆర్థిక స్థోమత లేదని చెప్పాం. అవి వచ్చే దాకా వేచి చూడాలన్నారు. రోజుకు రూ.300-400 మందులకు వెచ్చిస్తున్నాం.


బయట నుంచి తెచ్చుకోమంటున్నారు... 

తిప్పిరెడ్డి ఈశ్వరి, పోచంపల్లి, కృష్ణాజిల్లా


గర్భసంచి తీసేశారు. దాని నివారణకు మందులు వాడుతుండగానే మెడ వెనుక భాగంలో కేన్సర్‌ కణాలు ఉన్నట్లు గుర్తించి దానికి వైద్యం ప్రారంభించారు. కానీ వాటి నివారణకు అవసరమైన మందులు లేవు. బయట నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. వంద కి.మీ దూరం నుంచి మందుల కోసం రెండుసార్లు వచ్చినా సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌ నుంచి మందులు రాలేదని వెనక్కు పంపారు. మందులు లేకుండా క్యాన్సర్‌ నివారణ అసాధ్యం.


మందుల కొరత నిజమే

మందుల కొరత ఉన్న మాట వాస్తవం. ఉన్నంత వరకు ఇచ్చి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాం. రెండు రోజుల క్రితం స్వయంగా రోగులు వచ్చి మందులు అడిగారు. వెంటనే ఈ విషయం డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం. ఇతర జిల్లాల నుంచి డైవర్షన్‌ పెట్టి సర్దుబాటు చేస్తామన్నారు. ఇతర జిల్లాల నుంచి రోగుల తాకిడి ఉంది. ఇప్పటికే కోటా మేరకు మందులు వాడేశాం. అదనపు బడ్జెట్‌ కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం.


ఇంజెక్షన్లు ఇవ్వటం లేదు 

ఆరేపల్లి మధుసూదనరావు, గుంటూరు

మాది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. తల్లితో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా. 10 రోజుల నుంచి ఇంజెక్షన్లు లేవు. దీంతో రేడియేషన్‌ ఇవ్వడం లేదు. కీమోథెరపీ చేయడం లేదు. మందులు వేసుకోకుండా అవి చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో మందులు సరఫరా చేయాలి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని