ఛార్జింగ్‌ స్టేషన్లకు... స్థలాలు ఖరారు
eenadu telugu news
Published : 27/10/2021 03:42 IST

ఛార్జింగ్‌ స్టేషన్లకు... స్థలాలు ఖరారు

నాలుగైదు నెలల్లో ఏర్పాటు
ఈనాడు, అమరావతి

జిల్లాలో విద్యుత్తు ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. దీనికి సంబంధించి గత మూడు రోజులుగా విజయవాడ నగరంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిపాదిత స్థలాలను బృందం పరిశీలించింది. నెడ్‌క్యాప్‌, ప్రైవేటు ఏజెన్సీ, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల బృందం స్థలాలను ఎంపిక చేసింది. వీటికి సంబంధించి తుది ఆమోదం లభించగానే ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఇవి వాస్తవ రూపం దాల్చడానికి మరో నాలుగైదు నెలలు పడతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి తొలి దశలో 25 వరకు స్థలాలు ఖరారయ్యాయి. మిగిలిన దశలలో ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేయనున్నారు.

ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వం అహ్మదాబాద్‌కు చెందిన ఏజెన్సీకి అప్పగించింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలను ఈ ఏజెన్సీ చూస్తుంది. ఇప్పటికే తమ స్థలాల్లో పాయింట్ల ఏర్పాటుకు ప్రధానంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు వ్యక్తులు ముందుకు వచ్చారు. ఈ స్థలాలను పరిశీలించి అనువైనవిగా బృందం తేల్చింది. ఖరారైన స్థలాల్లో ప్రభుత్వ విభాగాలకు సంబంధించినవి.. అప్‌కాస్ట్‌, పర్యటక శాఖ, కనకదుర్గ ఆలయం, ఆర్టీసీ పాత బస్టాండు, గన్నవరంలోని ఆర్టీవో కార్యాలయం, విజయవాడలోని రవాణా శాఖ ఉపకమిషనర్‌ కార్యాలయం, మల్లవల్లి పారిశ్రామికవాడలోని ఏపీఐఐసీ కార్యాలయం, వీఎంసీ పరిధిలోని గాంధీ మున్సిపల్‌ పాఠశాల, సింగ్‌నగర్‌ సమీపంలోని కనకదుర్గనగర్‌, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రం, విద్యుత్తు శాఖకు సంబంధించి సింగ్‌నగర్‌, ఆటోనగర్‌, పెనమలూరు ఉపకేంద్రాలు, గూడవల్లిలోని గ్రామ సచివాలయం, ఆటోనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, సిద్ధార్థ మెడికల్‌ కళాశాల స్థలాలకు ఆమోదం లభించింది. మాహానాడు రోడ్డు, గోశాలలోని ప్రైవేటు స్థలాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇవి తక్కువ విస్తీర్ణాన్ని మాత్రమే నిర్దేశించడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం 150 చ.అడుగుల మేర స్థలం చూపిస్తే చాలు స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇందులో రెండు ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు అవుతాయి. 30 కి.వా నుంచి 50 కి.వా సామర్థ్యం ఉన్నవి రానున్నాయి. ఖరారైన స్థలాలకు సంబంధించి నెడ్‌క్యాప్‌, స్థల యజమాని, ఏజెన్సీ మధ్య ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందం పదేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఇక్కడ వినియోగించుకునే ప్రతి యూనిట్‌ విద్యుత్తుకు సంబంధించి స్థల యజమానికి ఏజెన్సీ రూ.2 చెల్లిస్తుంది. సిబ్బంది ఎవరూ లేకుండానే ఈ స్టేషన్‌ పని చేస్తుంది. ఛార్జింగ్‌ కోసం వాడుకున్న విద్యుత్తు తాలూకు డబ్బును ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో విద్యుత్తు వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో మరిన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్సులు, పెట్రోలు బంకుల యజమానులతో కూడా చర్చలు జరిపి వారిని కూడా ఒప్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. తర్వాతి దశలో జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై స్థలాలను అన్వేషించనున్నారు. దీని వల్ల దూరప్రాంత ప్రయాణాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మూడో దశలో మండల కేంద్రాలు, ప్రధాన పంచాయతీలను పరిగణనలోకి తీసుకుంటారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని