ఆయుధ భాండాగారం..!
eenadu telugu news
Updated : 27/10/2021 13:04 IST

ఆయుధ భాండాగారం..!

ఏఆర్‌ గ్రౌండ్స్‌లో ఓపెన్‌ హౌస్‌

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

గాల్లో 25 నిమిషాల పాటు నిర్విరామంగా ఎగురుతూ, 1.6 కిలోమీటర్ల దూరం, 2 కిలోమీటర్ల ఎత్తు వరకు రిమోటుతో నడిచే ప్రపంచంలోనే అత్యంత చిన్న డ్రోన్‌... 800 మీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించే స్నైఫర్‌ రైఫిల్‌, నక్కిన ఉగ్రవాదులను కెమెరాలో చూస్తూ, 62 డిగ్రీల ఒంపులో లక్ష్యాన్ని గురి తప్పకుండా కాల్చే కార్నర్‌ షాÆట్‌ రైఫిల్‌... తదితర ఆయుధాలన్నీ ఒకే వేదికపై కొలువుదీరాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖ సత్తా చాటే వివిధ రకాల ఆయుధాలు, విభాగాలు మంగళవారం విజయవాడలోని ఏఆర్‌ గ్రౌండ్స్‌ల్‌ ప్రదర్శన నిర్వహించాయి.  పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌లో ఓపెన్‌ హౌస్‌ ఏర్పాటు చేశారు. అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) రవిశంకర్‌ అయ్యన్నార్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివా సులు  ప్రారంభించారు. పోలీసుశాఖకు చెందిన వివిధ ఆయుధాలు, అవి పనిచేసే తీరును వివరించారు. ఈ కార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతుందని, ప్రజలు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.  

ఆయుధాలను పరిశీలిస్తున్న విద్యార్థులు

ప్రత్యేక ఆకర్షణగా ‘ఆక్టోపస్‌’ కమాండో దళం
ఉగ్రవాదులను తుద ముట్టించే ప్రత్యేక కమాండో దళం ఆక్టోపస్‌. దీని ఆయుధ సంపత్తిని, ఆ విభాగం పనిచేసే విధానాన్ని చక్కగా వివరించారు. కమాండో దళం ఉపయోగించే ఆయుధాలను ప్రత్యేకంగా ప్రదర్శించి, అవి ఏ విధంగా పనిచేస్తాయో తెలియజేశారు.


గ్రవాదులు పెట్టిన బాంబులను కనిపెట్టడానికి ఏపీ ఆక్టోపస్‌ పోలీసులు వాడుతున్న రోబో ఇది. రూ.1.5కోట్ల విలువైన దీన్ని.. బాంబులు ఎక్కడున్నాయో కనిపెట్టి బయటకు తీసుకురావడానికి వాడుతున్నారు.


చేతి వేలంత...
‘బ్లాక్‌ హార్నెటు’ అని పిలిచే మిలటరీ డ్రోన్‌ చేతి వేలంతే ఉంది. భవనాల్లో నక్కిన ఉగ్రవాదులను గుర్తించేందుకు ఉపయోగిస్తుంటారు. భవనంలోకి పంపి చిన్న కెమెరాతో లోపలి పరిసరాలను గమనిస్తారు. ఆ తర్వాత ఉగ్రవాదులను తుదముట్టించేందుకు కమాండోలు రంగంలోకి దిగుతారు.


కార్నర్‌ షాట్‌ మోడల్‌ గన్‌

దీని బ్యారెల్‌ 62 డిగ్రీల వరకు తిప్పుతారు. గోడ అంచుల్లో ఉంచి, 62 డిగ్రీలో కారిడార్లు, గదుల్లో ఎంత మంది ఉన్నారో దీనికి ఉన్న కెమెరా ద్వారా చూడవచ్చు. కేవలం చూడటమే కాదు... తుపాకీ పేల్చి ఉగ్రవాదులను తుదముట్టించవచ్చు. 3.86 కిలోగ్రాముల బరువు ఉంటుంది. 120 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురి తప్పకుండా కాల్చవచ్చు. దీని ధర రూ.6,87,500


స్నైఫర్‌ రైఫిల్స్‌..
కమాండ్‌ దళం ఉపయోగించే మరో కీలకమైన టెలిస్కోపిక్‌ ఆయుధం ఇది. ఇందులో 2 రకాలు ఉన్నాయి. 800 దూరంలో లక్ష్యాన్ని ఛేదించవచ్చు. పీఎస్‌జీ అనే మోడల్‌లో 20 బుల్లెట్లు పడితే.. షార్ప్‌ షూటింగ్‌ గన్‌ అంటారు. ఎస్‌ఎస్‌జీలో 5 బుల్లెట్లు పడతాయి. వీటిలో ఎస్‌ఎస్‌జీ అత్యంత శక్తిమంతమైంది. ఈ రెండు స్నైఫర్‌ రైఫిల్స్‌ను కమాండోలు వినియోగస్తారు. కిలోమీటర్ల దూరంలో ఉండే ఉగ్రవాదుల కదలికలను గుర్తించి తుదముట్టిస్తారు. ఒక్కోసారి ఈ రైఫిల్స్‌కు ఉన్న టెలిస్కోప్‌ ద్వారా నక్కి ఉన్న ఉగ్రవాదులను గమనించటం కష్టమవుతుంది. అలాంటి సందర్భంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం స్పష్టంగా చూడగలిగే ‘స్పాట్లర్‌ స్కోప్‌’ను వినియోగిస్తారు.  

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ విభాగాలు
అగ్నిప్రమాదాలు, భవనాలు కూలిపోవటం, వరదలు వచ్చినప్పుడు అత్యవసర సేవలు అందించే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఏపీ ఎస్డీఆర్‌ఎఫ్‌ విభాగాల పనితీరును ప్రదర్శించే ఉపకరణాలు ఇక్కడ పొందుపరిచారు. భవనాలు కూలినప్పుడు వాటి శిథిలాలను బద్దలు కొట్టే ప్రత్యేకమైన ఉపకరణాలు, వరదల సమయంలో ఉపయోగించే పడవలు, లైఫ్‌ జాకెట్లు ఇవన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి.


తొలిసారి సైబర్‌ క్రైం విభాగం ఏర్పాటు

సైబర్‌క్రైం స్టాల్‌ వద్ద విద్యార్థులు

టీవల సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వీటిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఓపెన్‌ హౌస్‌లో తొలిసారిగా సైబర్‌ క్రైం విభాగం ఏర్పాటు చేశారు. ఓటీపీ ద్వారా జరిగే మోసాలు, అపరిచిత వ్యక్తులు, సైట్ల నుంచి వచ్చే లింక్‌ల ద్వారా ఏ విధంగా మోసపోతారు? తదితర విషయాలను తెలియజేస్తూ ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేశారు. * ట్రాఫిక్‌ విభాగం, పోలీసు జాగిలాల పనితీరు, బాంబు నిర్వీర్య దళం పనిచేసే విధానం, వీఐపీల భద్రతలో ముఖ్యభూమిక పోషించే సిటీ సెక్యూరిటీ వింగ్‌ పనితీరును చక్కగా వివరించారు. జల ఫిరంగులు, టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగంతో గుంపులను ఎలా చెదరకొడతారో ప్రత్యక్షంగా చేసి చూపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని