Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కర్ణాటక మద్యం స్వాధీనంనలుగురి అరెస్టు

స్వాధీనం చేసుకున్న మద్యం, వాహనాలతో పోలీసు అధికారులు

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: కర్ణాటక మద్యాన్ని అక్రమ రవాణా చేసి నగరంలో రహస్యంగా నిల్వ చేస్తున్న ముఠా గుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు. చిత్తూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి నిందితులను చూపి వివరాలను వెల్లడించారు. మంగళవారం చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండో పట్టణ సీఐ యుగంధర్‌ బృందం సమాచారం ఉన్న పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో తేనబండ రాజీవ్‌నగర్‌ కాలనీలోని జటాలమ్మ గుడి సమీపంలోని చెట్ల పొదల వద్ద కార్లు ఉన్నాయని, కొందరు అనుమానాస్పదంగా కనిపించార న్నారు. దాడి చేసి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. చిత్తూరుకు చెందిన జ్యోతీశ్వరన్‌(39) అలియాస్‌ జ్యోతి, ఐరాలకు చెందిన ప్రదీప్‌(25) అలియాస్‌ బొక్కోడు, కురబలకోటకు చెందిన చామంచి మల్లికార్జున(33), కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన మోహన్‌(28)ను అదుపులోకి తీసుకున్నానమన్నారు. చిత్తూరుకు చెందిన జగదీష్‌ అలియాస్‌ జగ్గా, హమీద్‌ అలియాస్‌ చామంతి పరారయ్యారని చెప్పారు. అక్కడ ఉన్న 70 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని విచారించగా.. కర్ణాటకలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించనున్నట్లు తేలిందన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5 లక్షల విలువైన మద్యం, రూ.40 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అధికారులు, సిబ్బందిని అభినందించి వారికి నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, రెండో పట్టణ సీఐ యుగంధర్‌, ఎస్సై మల్లికార్జున పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని