మహిళలకే అగ్రపీఠం
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

మహిళలకే అగ్రపీఠం

ఎంపీపీ అభ్యర్థులకు చేరిన బి.ఫారాలు

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: జిల్లాలో మెజారిటీ మండలాల్లో ఎంపీపీ పదవులకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మెజార్టీ స్థానాల్లో మహిళలకే అవకాశాలు దక్కాయి. వీరికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతకంతో జారీ చేసిన బి.ఫారాలను గురువారం అందజేశారు. కొన్ని మండలాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు చేయలేదు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరిని తేల్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఖాళీ బి.ఫారాలను ఆయా ఎమ్మెల్యేలకు అందజేశారు. శుక్రవారం వ్యవహారం కొలిక్కి తీసుకొచ్చి బి.ఫారాలు అందజేసే అవకాశం ఉంది. కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో శుక్రవారం పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం కనిపించడం లేదు. నాగలాపురంలో సింధు, జాయిస్‌కు చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా ఒప్పందం జరిగింది. ముందుగా ఎవరు పదవి చేపట్టేది శుక్రవారం తేలనుంది. తవణంపల్లె మండలంలో గీత, ప్రతాప్‌రెడ్డి రెండున్నరేళ్లు పదవిలో ఉండేలా సర్దుబాటు చేశారు. వాల్మీకిపురంలో సందిగ్ధత నెలకొంది. నగరి, మదనపల్లె, పలమనేరు నియోజకవర్గాల్లో పేర్లు చాలా వరకు వెల్లడికాలేదు. రామచంద్రాపురం మండల అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి, జీడీనెల్లూరు, తంబళ్లపల్లె, పుంగనూరు, పూతలపట్టు, చంద్రగిరి, కుప్పం, పీలేరు, చిత్తూరు, పలమనేరు తదితర మండలాల్లో ఇప్పటికే బి.ఫారాలు అందాయి. మిగిలిన మండలాల్లో అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. వరదయ్యపాళెంలో క్యాంపు రాజకీయానికి తెర లేపిన దామోదరరెడ్డి వైఖరిని నిరసిస్తూ దయాకరరెడ్డి ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని