అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య ఆరు వరుసలు
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య ఆరు వరుసలు

●●● విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం ●●●

ఇప్పటికే నివేదిక అందజేసిన ఎన్‌హెచ్‌ఏఐ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో కీలకమైన కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16లో అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం (దివాన్‌చెరువు) వరకు ప్రస్తుతమున్న నాలుగు వరుసలను ఆరుగా విస్తరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ జాతీయ రహదారి మన రాష్ట్రంలో 1,070 కి.మీ.మేర వెళ్తుండగా.. ఇప్పటివరకూ 610 కి.మీ. ఆరు వరుసలుగా ఉంది. మిగిలినది నాలుగు వరుసలే. తాజాగా ఇందులో విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు వరకు 160 కి.మీ. మేర ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) అంగీకరించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.

పార్లమెంటులో ప్రస్తావనతో..

ఈ భాగం విస్తరణ ఇటీవల పార్లమెంటులో ప్రస్తావనకు రావడంతో.. దీనిపై నివేదిక ఇవ్వాలని మోర్త్‌ అధికారులు, మన రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. దీంతో అనకాపల్లి నుంచి అన్నవరం వరకు ప్రస్తుతం రోజుకు సగటున 43 వేలకుపైగా వాహనాలు తిరుగుతాయని, అన్నవరం-దివాన్‌చెరువు మధ్య 38,680 వాహనాలు వెళ్తాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నివేదించారు. ‘అన్నవరం-దివాన్‌చెరువు మధ్య ట్రాఫిక్‌ ఎక్కువవుతోంది. కాకినాడ రేవుకు ఎన్‌హెచ్‌-16 నుంచి కనెక్టివిటీ పెంచడం, ఖమ్మం-దేవరపల్లి మధ్య ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పూర్తయితే.. అనకాపల్లి వైపు ట్రాఫిక్‌ మరింత పెరుగుతుంది. దీంతో అనకాపల్లి-దివాన్‌చెరువు మధ్య ఆరు వరుసలు అవసరం...’ అని పేర్కొన్నారు. రోజుకు 40వేలకు పైగా వాహనాలు వెళ్తే ఆరు వరుసలు చేస్తారని, ఇక్కడ ఈ మేరకు ట్రాఫిక్‌ ఉండటంతో విస్తరణ చేపడతారని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం టీవోటీలో..

ఎన్‌హెచ్‌-16లో అనకాపల్లి-అన్నవరం-దివాన్‌చెరువు-సిద్ధాంతం-గుండుగొలను మధ్య 280 కి.మీ. మేర టోల్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీవోటీ) కింద సేఫ్‌వే కన్‌స్ట్రక్షన్స్‌ 2019లో టెండరు దక్కించుకుంది. 30 ఏళ్లపాటు ఈ రహదారి నిర్వహణ, ఇందులో ముఖ్యమైన పనులు, టోల్‌ వసూలు.. అంతా ఆ సంస్థే చూడనుంది. అనకాపల్లి నుంచి దివాన్‌చెరువు వరకు విస్తరణ చేపట్టినా టీవోటీకి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని