వణికిస్తున్న వరద
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

వణికిస్తున్న వరద

ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు విడుదల
తీర ప్రాంత రైతులకు కంటి మీద కునుకు కరవు


గతేడాది వరదలకు పునరావాస కేంద్రానికి పడవలో వెళ్తున్న పల్లెపాలెం వాసులు 

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే కరకట్ట ఆనుకొని మంగళగిరి, దుగ్గిరాల, వేమూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో ఏటా వర్షాకాలంలో ముప్పు ఎదురవుతుంది. కృష్ణా నది సముద్రంలో కలిసే లంకెవానిదిబ్బ వరకు వేల ఎకరాల్లో పంటలు ముంపు బారినపడుతున్నాయి. ఇప్పటికే రైతులు వరి సాగు చేపట్టారు. లంక గ్రామాల్లో కూరగాయల తోటలు వందల ఎకరాల్లో సాగులో ఉన్నాయి. వరద తీవ్రత పెరిగితే తీరని నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాదిలో సంభవించిన వరదకు, పూర్తిగా నష్టపోయామని సాగు చేపట్టిన తొలినాళ్లలోనే వరద వస్తే మరింతగా అప్పుల్లో కూరుకుపోతామని వాపోతున్నారు. 
కరకట్టకు తూట్లు: కరకట్టకు 500 మీటర్లలోపు ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదన్న నిబంధనలు అమలు కావడం లేదు. కొందరు అక్రమార్కులు పొక్లెయిన్‌తో 50 అడుగల లోతు గుంతలు తీసి అక్రమంగా మట్టి విక్రయాలకు పాల్పడ్డారు. వరి, ఆక్వా సాగు నెపంతో ఓ నేత బొబ్బర్లంక సమీపంలో ఏకంగా ఆర్సీ కెనాల్‌ కట్టకు గండి కొట్టించి ఏకంగా తూములు ఏర్పాటు చేయించారు. మరికొందరు కరకట్టకు పైపులు ఏర్పాటు చేశారు. దీంతో వరద నీటి ఉద్ధృతి పెరిగితే త్వరగా గండి పడే ప్రమాదం అధికంగా ఉంది. గతేడాది ప్రకాశం బ్యారేజీ నుంచి 8 లక్షల వరద నీరు విడుదల కావడంతో రాజుకాల్వ ఎత్తిపోతల పథకం వద్ద కరకట్టకు గండిపడింది. వరద ఉద్ధృతికి పిరాట్లంక సమీపంలో బ్యాంకు కెనాల్‌ నుంచి నీరు ఉబికి వచ్చింది. ఇది గమనించిన రైతులు జలవనరుల శాఖ, కరకట్ట పర్యవేక్షణాధికారులకు సమాచారం అందించగా తూతూ మంత్రంగా నివారణ చర్యలు చేపట్టారు. వరద నీరు 9 క్యూసెక్కులు దాటితే ఎక్కడ గండి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

కృష్ణా నదికి ఏటా వచ్చే వరదలతో తీర ప్రాంత రైతులు తీరని నష్టం ఎదురవుతుంది. ఎప్పుడు ఏ సమయంలో ముప్పు పొంచి ఉంటుందోనని కృష్ణా కరకట్ట వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి   1.96 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేశారు. మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఆరు నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైతే లంక గ్రామాల్లో పంటలు నీట మునుగుతాయి. నీటి విడుదల 9 లక్షల క్యూసెక్కులు దాటితే నీటి ఉద్ధృతికి కరకట్ట గండిపడే అవకాశం ఉంటుంది. కరకట్ట మరమ్మతులు చేపట్టకపోవడంతో తీర ప్రాంత వాసులకు వర్షాకాలంలో కంటి మీద కునుకు ఉండటం లేదు. 

పటిష్ఠ చర్యలు  అవసరం
పెనుమూడి వారధి నుంచి గ్రామ శివారు వరకు కరకట్ట అభివృద్ధి చేసి రహదారి నిర్మాణం పూర్తి చేశారు. అక్కడ నుంచి లంకెవానిదిబ్బ వరకు అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో పలుచోట్ల కరకట్ట రహదారి అధ్వానంగా మారడంతోపాటు చాలాచోట్ల కట్ట బలహీనంగా ఉంది. వరద ఉద్ధృతితో గండి పడితే సమీపంలోని గ్రామాలు, పంట పొలాల ముంపునకు గురై అవకాశం ఉంది. గతేడాది వచ్చిన వరదకు పల్లెపాలెం, లంకెవానిదిబ్బ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు 150 కుటుంబాలను తరలించారు. రోజుల పాటు బాధితులు కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరకట్టపై ఏర్పడిన గుంతలు పూడ్పించి తక్షణం పటిష్ఠ చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన నదిలో వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ, కరకట్ట పర్యవేక్షణ అధికారులు బలహీనంగా ప్రాంతాలను పటిష్ఠం చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. పునరావాస శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు రేపల్లె తహశీల్దారు విజయశ్రీ పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని