‘తక్కువ ధరకు బంగారం అమ్ముతామంటే నమ్మొద్దు’
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

‘తక్కువ ధరకు బంగారం అమ్ముతామంటే నమ్మొద్దు’


నిందితుల అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు

బాపట్ల, న్యూస్‌టుడే : మార్కెట్‌ ధర కంటే తక్కువకు బంగారం విక్రయిస్తామంటే ఎవరూ నమ్మొద్దని.. అత్యాశకు పోతే ర్యాప్‌ ముఠాల వలలో చిక్కి మోసపోతారని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన విశ్రాంత సైనికుడు నల్లమోతు కిరణ్‌కు తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని మోసం చేసి రూ.6.10 లక్షలు అపహరించిన ర్యాప్‌ కేసులో ఆరుగురు నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాపట్లలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం పంచాయతీ ఆదినారాయణపురానికి చెందిన కావటి ప్రతాప్‌ ర్యాప్‌ ముఠా తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని అమాయకులకు వల వేసి మోసం చేసి రూ.లక్షలు దోపిడి చేస్తోంది. ఒంగోలు మంగమూరు డొంకకు చెందిన విశ్రాంత సైనికుడు కిరణ్‌కు నందు అనే వ్యక్తి ఓ హోటల్‌ వద్ద పరిచయమై చీరాలకు చెందిన కావటి ప్రతాప్‌ తక్కువ ధరకు బంగారం విక్రయిస్తున్నాడని నమ్మించాడు. గతనెల 27న స్నేహితుడితో కలిసి కిరణ్‌ చీరాల వచ్చి ప్రతాప్‌ను కలిశాడు. ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారం కారులో మురుకుండపాడు- వెదుళ్లపల్లి రహదారికి వారిని తీసుకెళ్లాడు. ప్రతాప్‌ ముఠాకు చెందిన కావటి బుద్ధుడు, ప్రసాద్‌ ద్విచక్రవాహనంపై కారు వద్దకు వచ్చి బంగారం చూపించారు. తనకు బంగారు నగలు వద్దని.. బంగారం బిస్కెట్‌ విక్రయించాలని కిరణ్‌ కోరాడు. బంగారు బిస్కెట్లు తెప్పిస్తున్నామని నమ్మించారు. ఇంతలో కావటి శశిధర్‌, ఇట్టా సాయిచంద్ర, మాదిగాని రామ్‌చంద్రకుమార్‌, పేరిగ కిశోర్‌, కావటి నాగరాజు, గరికె ప్రసాద్‌ పోలీసుల వేషంలో వచ్చి కిరణ్‌ను బెదిరించి రూ.6.10 లక్షలు అపహరించారు. తర్వాత శశిధర్‌ ఇంటికి ర్యాప్‌ ముఠా సభ్యులు వెళ్లి రూ.1.20 లక్షలు పంచుకుని పరారయ్యారు. కొన్ని రోజుల తర్వాత దోపిడి చేసిన మిగిలిన నగదు పంచుకోవాలనుకున్నారు. బాధితుడు కిరణ్‌ వెదుళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ర్యాప్‌ ముఠా మోసం చేసిన వైనంపై ఫిర్యాదు చేయగా ఎస్సై జనార్దన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాపట్ల గ్రామీణ సీఐ కడప శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఎస్సై జనార్దన్‌, పోలీసు సిబ్బంది నిందితుల కోసం గాలిస్తుండగా స్టూవర్టుపురం సమీపంలో ప్రతాప్‌, బుద్ధుడు, ప్రసాద్‌, శశిధర్‌, సాయిచంద్ర, రామ్‌చంద్రకుమార్‌ పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ.3.60 లక్షలు రికవరీ చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో మిగతా నిందితులు కావటి నాగరాజు, గరికే ప్రసాద్‌, వల్లాగి స్వాతి, గరిక మల్లికా పరారీలో ఉన్నారు. వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. బాధితులు మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు సత్వరమే స్పందించి నిందితులను పట్టుకున్నారని పేర్కొన్నారు. ర్యాప్‌ ముఠాను పట్టుకున్న సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. బాపట్ల గ్రామీణ ఎస్సై వెంకటప్రసాద్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని