అర్ధరాత్రి వేళ.. రౌడీషీటర్‌ దారుణ హత్య
eenadu telugu news
Updated : 18/07/2021 09:53 IST

అర్ధరాత్రి వేళ.. రౌడీషీటర్‌ దారుణ హత్య

ముస్తాక్‌ ఉద్దీన్‌

చాదర్‌ఘాట్‌(క్రైం), న్యూస్‌టుడే: వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న  రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఇతర రౌడీషీటర్ల చేతుల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన చాదర్‌ఘాట్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. టౌలీచౌకి  హుమాయున్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ముస్తాక్‌ ఉద్దీన్‌(33) రౌడీషీటర్‌. అతడికి ఓల్డ్‌మలక్‌పేటలో సొంత ఇల్లు ఉండడంతో తరచూ వస్తుంటాడు. శుక్రవారం అర్ధరాత్రి ఓల్డ్‌మలక్‌పేటలోని అబూబాకర్‌ మసీదు వద్దకు వచ్చాడు. సోదరులైన అయూబిన్‌ అలీ, మహమూద్‌ మరో నలుగురు యువకులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. అది కాస్త ముదరడంతో ఆగ్రహానికి గురైన వారంతా సయ్యద్‌ ముస్తాక్‌ ఉద్దీన్‌ను కత్తులతో పొడిచారు.రాళ్లతోనూ దాడికి పాల్పడ్డారు. ముస్తాక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అతడి మృతదేహాన్ని  ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

అతనిపై 33 కేసులు..
సయ్యద్‌ ముస్తాక్‌ ఉద్దీన్‌పై చాదర్‌ఘాట్‌ ఠాణా పరిధిలో 26 కేసులు, నగరంలోని ఇతర ఠాణా పరిధిలోనూ మరో 7 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అయూబ్‌ బిన్‌ అలీ, మహమూద్‌లను ఇప్పటికే అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. వారిద్దరిపై కూడా రౌడీషీట్లు ఉన్నట్లు తెలిసింది. పరారైన మిగతా నలుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానికంగా లభించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. రౌడీషీటర్ల మధ్య తలెత్తిన వివాదంగా కారణంగానే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అయితే, పాతకక్షల నేపథ్యంలో ముందస్తు పథకంతో అతడిని హతమార్చారా?అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని