సకల హంగుల నిలయం.. అక్షరాలయం
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

సకల హంగుల నిలయం.. అక్షరాలయం

●త్వరలో ప్రారంభోత్సవం

సీఎం కేసీఆర్‌ చదివిన పాఠశాలకు మహర్దశ

దుబ్బాకలో అధునాతన భవనం సిద్ధం

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట, న్యూస్‌టుడే, దుబ్బాక

చిత్రంలో కనిపిస్తున్న దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చదువుకున్నారు. ఈ బడిలో చదివినప్పుడే స్థానిక రామసముద్రం చెరువు కట్టపై ప్రకృతిని ఆస్వాదిస్తూ పద్యాలను రాశారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారెంతో మంది ఇప్పుడు ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, న్యాయవాదులుగా స్థిరపడ్డారు.

సీఎం సంకల్పానికి అనుగుణంగా భావితరాల కోసం సకల సౌకర్యాలతో దుబ్బాకలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సకల సౌకర్యాలతో అధునాతన హంగులతో ఇలా తీర్చిదిద్దారు.

2014లో స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుబ్బాక ఉన్నత పాఠశాల పునర్‌ నిర్మించాలని నిర్ణయించి రూ.4.35 కోట్లు కేటాయించారు. 2016లో దుబ్బాక పర్యటనలో భాగంగా తాను చదువుకున్న పాఠశాలను సందర్శించారు. తాను నిర్దేశించుకున్న రూపు తీసుకొచ్చేందుకు పరిశీలించారు. అక్కడి పరిస్థితులను గమనించి పాఠశాల, కళాశాల రెండూ ఒకే సముదాయంలో ఉండేలా నిర్ణయించారు. ఈ మేరకు శంకుస్థాపన చేసి మరో రూ.6.25 కోట్లు మంజూరు చేశారు.

2016లో ప్రారంభమైన పనులు..

నిధులు మంజూరు చేశాక పాఠశాల ఎలా ఉండాలని, ఏ వసతులు కల్పించాలి, తదితర అంశాలతో ప్రణాళిక రూపొందించారు. నమూనా తయారుచేయించారు. ఆయన ఆదేశాల మేరకు 2016 జనవరిలో పాఠశాల పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎకరా విస్తీర్ణంలో పాఠశాల, ఇంటర్‌ వరకు ఒకే భవనంలో విద్యార్థులు చదువుకునేలా సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. అప్పటి వరకు కొనసాగిన బడిని తాత్కాలికంగా పక్కనే ఉన్న ఇంటర్‌ కళాశాలకు మార్చారు. వంతుల వారీగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరు నుంచి పది వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ఇంటర్‌ వారికి పాఠాలు చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ బోధన సాగుతోంది.

రూ.10.50 కోట్లతో..

పాఠశాల, కళాశాల రెండూ ఒకే చోట కొలువుదీరేలా భవనాన్ని జీ+2 తరహాలో మొత్తం రూ.10.50 కోట్లతో నిర్మించారు. మట్టి, జిప్సమ్‌, సిమెంట్‌, రాయిపొడి మిళితంతో తయారుచేసిన ప్రత్యేక ఇటుకలను ఉపయోగించారు. ఇవి వేసవి కాలంలో గదుల్లో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండేందుకు దోహదపడతాయని నిర్మాణదారులు చెప్పారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్‌ సౌకర్యాన్ని సైతం కల్పించారు. అన్ని వసతులతో భవన నిర్మాణాన్ని పూర్తిచేయగా ప్రారంభోత్సవానికి సకలం సిద్ధం చేశారు.


ప్రత్యేకతలు..

విద్యార్థులు కళలపై పట్టు సాధించి.. ఆసక్తి ఉన్నవారు అందులో రాణించేలా ఇప్పటికే ఆరో నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు బోధనాంశాలలో ప్రత్యేకంగా ఒక అంశంగా చేర్చారు. ఇందులో భాగంగా చిత్రాలు గీసేందుకు అవసరమయ్యే సామగ్రి (పెన్నులు, రంగులు) అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు.

ఆర్ట్‌ రూం..

చదువుతో పాటు ఆటలకు సైతం ప్రాధాన్యం పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా ఇందులో విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇండోర్‌, అవుట్‌డోర్‌ ఆటలకు సంబంధించి అన్ని రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచేందుకు రెండు గదులను కేటాయించారుర. పాఠశాలకు ఒకటి, ఇంటర్మీడియట్‌ వారు మరోటి వినియోగించుకోనున్నారు.

ఆడుకునేందుకు..

నాటి దొమ్మాట.. నేటి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 1964-68 విద్యాసంవత్సరాలలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరు నుంచి 9వ తరగతి వరకు అభ్యసించారు. ఆ సమయంలో అద్భుతంగా ఉన్న పాఠశాల క్రమంగా శిథిలావస్థకు చేరుతూ వచ్చింది. తనకు అక్షరాలు నేర్పిన బడి రూపురేఖలు మార్చాలని సీఎం సంకల్పించుకోగా, ఇప్పుడు సరి కొత్తగా తీర్చిదిద్దారు.

గ్రంథాలయాలు..

ఇంటర్‌ చదివే విద్యార్థినులకు బాలికలకు ప్రత్యేకంగా రెండు వేచి ఉండే గదులను ఏర్పాటుచేశారు. ఖాళీ సమయాల్లో వేచి ఉండేందుకు.. ఇతర అవసరాలకు వినియోగిం చుకునేందుకు వీలుగా వాటిని నిర్మించారు.

ఆడపిల్లలకు..

పాఠశాల, కళాశాల విద్యార్థులకు అన్నీ రకాల పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా రెండు గ్రంథాలయాలు కొలువుదీరనున్నాయి. వాటికి రెండు గదులు కేటాయించారు. ఇప్పటికే పాఠశాలకు సంబంధించి 1,100 పుస్తకాలు అందుబాటులో ఉండగా భవిష్యత్తులో మరిన్ని వచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఇక ఇంటర్‌ తర్వాత పోటీ పరీక్షలకు సంబంధించి, కథలు, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలు, ఇతరత్రావి వస్తాయని అధ్యాపకులు చెబుతున్నారు.


54 గదులు.. 9 ప్రయోగశాలలు..

ప్రస్తుతం ఇంటర్‌లో 350 మంది చదువుకుంటున్నారు. కొత్త భవనంలో దాదాపు 600 మందికి సరిపడా వసతులు కల్పించారు. నాలుగు కామన్‌ కోర్సులతో పాటు నాలుగు వొకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించి మొత్తం 16 తరగతి గదులు.. 4 సైన్స్‌, ఒక కంప్యూటర్‌ ల్యాబ్‌ను కేటాయించారు. మొత్తంగా కళాశాలకు 30 గదులు కేటాయించారు. పాఠశాలలో ప్రస్తుతం 309 మంది విద్యార్థులు ఉండగా 600 వరకు పెంచుకునేందుకు వీలుంది. ఒకే సారి 250 మంది వినియోగిచుకునేలా బాలబాలికల కోసం వేర్వేరుగా అధునాతన శౌచాలయాలను నిర్మించారు. మొత్తంగా పాఠశాలకు 24 గదులను కేటాయించారు. ప్రతి అంతస్తులో ఉపాధ్యాయులకు ప్రత్యేక గది, కింది అంతస్తులో ప్రిన్సిపల్‌ ఛాంబర్లను ఏర్పాటుచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని