కూరగాయల సేకరణకు చొరవ అవసరం: కలెక్టర్‌
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

కూరగాయల సేకరణకు చొరవ అవసరం: కలెక్టర్‌


ఎఫ్‌పీసీ అధ్యక్ష ఉపాధ్యక్షులతో మాట్లాడుతున్న పాలనాధికారిణి

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: రైతు ఉత్పత్తిదారుల కేంద్ర నిర్వహణ కోసం అందరూ సమన్వయంతో సమయానుకూలంగా పనిచేయాలని జిల్లా పాలనాధికారిణి పౌసుమిబసు ఎఫ్‌పీసీ సిబ్బందికి సూచించారు. శనివారం మోమిన్‌పేట అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కూరగాయల కేంద్రాన్ని ఆమె సందర్శించి తూకాలను పరిశీలించి మాట్లాడారు. రాత్రి వేళల్లో సమయం వృథా చేస్తే కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులు, కేంద్ర నిర్వహణలో భాగస్వాములైన మహిళలు వారి ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. కేంద్రంలో కూరగాయలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్న రైతుల నుంచి త్వరగా కూరగాయలను కేంద్రానికి తీసుకు వచ్చేలా సిబ్బంది చొరవ చూపాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కృష్ణన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు లక్ష్మి, ప్రమీల ఎపీఎంలు రాజు, శివయ్య, మధుకర్‌ సీసీలు అడివయ్య, వెంకట్‌ మేనేజర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

విపణి ధరలను రైతులకు వివరించండి

మోమిన్‌పేట: రోజువారీగా విపణిలో కూరగాయలకు లభిస్తున్న ధరలను రైతులకు తెలియజేస్తుండాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి నర్సింలు సిబ్బందికి సూచించారు. శనివారం మోమిన్‌పేట అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కూరగాయల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వివరాలు నమోదు చేసే రికార్డులను పరిశీలించి మాట్లాడారు. రైతులకు కూరగాయల ధరలు తెలిసినప్పుడే విక్రయించేందుకు ముందుకు వస్తారన్నారు. కేంద్రంలో విక్రయిస్తే రైతులకు కలిగే లాభాలు, బహిరంగ విపణిలో అమ్ముకుంటే కలిగే నష్టాలను సెర్ప్‌ సిబ్బందితో కలిసి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శివయ్య సీసీలు వెంకట్‌, అడివయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని