న్యూజిలాండ్‌లో ఉద్యోగమంటూ రూ.10.80 లక్షలు స్వాహా
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

న్యూజిలాండ్‌లో ఉద్యోగమంటూ రూ.10.80 లక్షలు స్వాహా

నారాయణగూడ, న్యూస్‌టుడే: న్యూజిలాండ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.10.80 లక్షలు దండుకున్నాడో సైబర్‌ నేరగాడు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ సివిల్‌ ఇంజినీర్‌(60) కొన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్నారు. నౌకరీ డాట్‌ కామ్‌ తదితర వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే ఆయనకో వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘మీ అర్జీని పరిశీలించానని, మీ అపారమైన అనుభవాన్ని గుర్తించి న్యూజిలాండ్‌లోని తమ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు వీసా, ఇతరత్రా ఫీజుల కింద రూ.10 లక్షలు చెల్లిస్తే.. వెంటనే నియామక పత్రం పంపిస్తాం’ అని నమ్మబలికాడు. దీన్ని విశ్వసించిన అతడు.. సదరు వ్యక్తి సూచించిన ఖాతాకు రూ.10 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేశారు. అనంతరం తాను మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

పెళ్లి చేసుకుందామని రూ.7 లక్షలు.. విదేశాల్లో ఉంటాను. త్వరలోనే వస్తా.. పెళ్లి చేసుకుంటా.. అని నమ్మించి రూ.7 లక్షలు ఊడ్చేశాడో సైబర్‌ కేటుగాడు. బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన ఓ మహిళకు సామాజిక మాధ్యమాల ద్వారా 2017లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఏడాది పాటు వారిద్దరూ ఇద్దరు చాటింగ్‌ చేసుకున్నారు. త్వరలోనే భారత్‌కు వస్తున్నా.. రాగానే పెళ్లి చేసుకుందామని అతడు చెప్పాడు. అంతకు ముందు ఇక్కడో చిన్న వ్యాపారం పెట్టాను. నీ వంతుగా సాయమందిస్తే వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చునన్నాడు. దీంతో ఆ మహిళ రూ.8.50 లక్షలు అతడు చెప్పిన ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసింది. ఆ తర్వాత తాను మోసపోయాయని గ్రహించింది. ఆ మోసగాడిపై ఒత్తిడి పెంచడంతో రూ.1.50 లక్షలు తిరిగి పంపించాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో.. బాధితురాలు 2021 జులై 31న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని