మిత్రుడే కాలయముడై..
eenadu telugu news
Published : 06/08/2021 00:46 IST

మిత్రుడే కాలయముడై..

 డబ్బు కోసం హతమార్చి..
 బూర్గుపల్లి ఘటనలో నిందితుడి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ పాలవెల్లి

హవేలి ఘనపూర్‌, న్యూస్‌టుడే: చిరకాలం నిలవాల్సిన స్నేహితంలో డబ్బు చిచ్చుగా మారి మిత్రుడి హత్యకు దారి తీసింది. మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌ మండలం బూర్గుపల్లి గేటు అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం మెదక్‌ గ్రామీణ ఠాణాలో జరిగిన సమావేశంలో డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ పాలవెల్లి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన గడ్డి హనుమంతు (26), వదల్‌పర్తి రాజు మిత్రులు. వారిద్దరు తరచూ తాగడం, గొడవలు పడి మళ్లీ కలుస్తుంటారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారం రోజుల క్రితం వదల్‌పర్తి రాజు అన్న సాయిలు వద్ద హనుమంతు రూ.30 వేలు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో హనుమంతు, రాజుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో కక్ష కట్టిన రాజు, కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్లీ వారిద్దరు కలిసి తిరిగారు. మంగళవారం రాత్రి గ్రామంలో మద్యం తాగారు. మెదక్‌లో డబ్బులు రావాల్సి ఉందని చెప్పి హనుమంతుతో కలిసి నడుచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో బూర్గుపల్లి గేటుకు వచ్చేసరికి అర్ధరాత్రి కావడంతో అక్కడి అటవీ ప్రాంతంలో నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలో ఉన్న హనుమంతు తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు డీఎస్పీ వివరించారు. పొల్కంపేట గ్రామస్థులు చివరిసారి హనుమంతును, రాజుతో కలిసి చూశామని చెప్పడంతో అతడిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని చెప్పారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో హవేలి ఘనపూర్‌ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, సిబ్బంది తాహేర్‌, మహేందర్‌, శ్రీరామ్‌ తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని