వదిలించుకునే ఉద్దేశంతో అంతమొందించాడు..!
eenadu telugu news
Published : 16/09/2021 02:10 IST

వదిలించుకునే ఉద్దేశంతో అంతమొందించాడు..!

మహిళ హత్య కేసులో నిందితుడి రిమాండ్‌

తూప్రాన్‌, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం భార్యకు తెలియడంతో అందుకు కారణమైన ఆమెను వదిలించుకోవాలని ఒత్తిడి తేవడంతో ప్రణాళిక ప్రకారం ప్రియురాలిని అంతమొందించాడో ఓ వ్యక్తి. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ బుధవారం తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా బేగంపేటకు చెందిన కొప్పు పద్మకు గజ్వేల్‌ మండలం కోరబోయిన నర్సింలుతో వివాహం అయింది. వారికి 18 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలున్నారు. నర్సింలుకు పద్మ రెండో భార్య కావడంతో ఆమె తల్లిగారు ఊరైన బేగంపేటలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రాయపోల్‌ మండలానికి చెందిన పిట్ల నర్సింలుకు చిన్న లారీ ఉండగా దానిపై కూలి పని చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడగా మూడేళ్లుగా కొనసాగుతోంది. విషయం పిట్ల నర్సింలు భార్యకు తెలియడంతో పద్మను వదిలించుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో పద్మకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో నర్సింలు భార్యాపిల్లలతో కలిసి కొంతకాలంగా మేడ్చల్‌ ఉంటున్నారు. అయినా పద్మ నర్సింలుకు ఫోన్‌ చేసి దగ్గరయ్యే ప్రయత్నం చేయగా ఆమెను ఎలాగైనా వదిలించుకునే ఉద్దేశంతో చంపాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఈ నెల 2న ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి రోజంతా మద్యం తాగడంతో పాటు పలు విషయాలు చర్చించుకున్నారు. సాయంత్రం నర్సంపల్లి శివారులో పథకం ప్రకారం పద్మ తలపై కర్రతో కొట్టి చేసి హతమార్చి ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత కుళ్లిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నర్సింలు హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో బుధవారం తూప్రాన్‌లో తిరుగుతున్న నర్సింలు పట్టుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ స్వామిగౌడ్‌, ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ ఉన్నారు.


ఆలయాల్లో చోరీలు.. నిందితుడి అరెస్టు

దుబ్బాక, న్యూస్‌టుడే: గుళ్లలో దొంగతనాలు చేసేందుకు అలవాటు పడిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దుబ్బాక పట్టణం 18వ వార్డులో సెప్టెంబరు 11న రాత్రి నీలకంఠేశ్వర, వీరాంజనేయస్వామి దేవాలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని మంగళవారం అరెస్ట్‌ చేసినట్టు దుబ్బాక సీఐ ఎస్‌.హరికృష్ణగౌడ్‌ తెలిపారు. దుబ్బాక వలయాధికారి కార్యాలయంలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ఎండీ రఫీ అలియాస్‌ రఫీక్‌ గతంలో అనేక సార్లు దొంగతనాలు చేశాడు. జైలుకు వెళ్లాడు. సెప్టెంబరు 6న బెయిలుపై బయటకొచ్చాడు. మళ్లీ గత శనివారం రెండు గుళ్లలో హుండీలు పగులగొట్టి సొమ్ము ఎత్తుకెళ్లాడు. నిఘా నేత్రాల సాయంతో నిందితుడిని పసిగట్టి తీవ్రంగా గాలించారు. దుబ్బాక నుంచి మల్లయ్యపలిక్లి వెళ్ళే దారిలో తన వ్యవసాయక్షేత్రంలో మంగళవారం రాత్రి రఫీ దొరికాడు. దొంగలించిన సొమ్ములో కొంత స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని