మొదలైన నిమజ్జన సందడి
eenadu telugu news
Published : 16/09/2021 02:10 IST

మొదలైన నిమజ్జన సందడి

ట్యాంకుబండ్‌పై క్రేన్‌లో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్న మట్టి ప్రతిమ.

పీవోపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది అనుమతించడం లేదు

ఈనాడు, హైదరాబాద్‌: గణపతి నిమజ్జనాలు, భక్తుల రాకపోకలతో బుధవారం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సందడి వాతావరణం నెలకొంది. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న చిన్న ప్రతిమలతో జనాలు సాగర్‌ పరిసరాలకు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాల్లో తీసుకొచ్చారు. వారిని జీహెచ్‌ఎంసీ అధికారులు పీవీమార్గ్‌లోని నిమజ్జన కేంద్రాల వద్దకు పంపించారు. క్రేన్ల సాయంతో అధికారులు పెద్ద విగ్రహాలకు నిమజ్జనం నిర్వహించగా.. చిన్న విగ్రహాలకు సిబ్బంది ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిమజ్జనం చేపట్టారు. ఇతర ప్రాంతాల్లోని 32 చెరువులు, 25 కోనేరుల వద్ద సైతం నిమజ్జనాలు జోరుగా సాగాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా కేంద్రాల్లో మూడు విడతలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలను బల్దియా పారిశుద్ధ్య, దోమల నివారణ విభాగం సిబ్బంది తొలగిస్తున్నారు.

ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు.. : ఆదివారం పెద్దఎత్తున జరగబోయే నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌మార్గ్‌లను సిద్ధం చేస్తున్నారు. బుధవారం ఎన్టీఆర్‌ మార్గ్‌లో మూడు, ట్యాంక్‌బండ్‌పై రెండు క్రేన్లను పెట్టారు. మరిన్ని యంత్రాలను ఏర్పాటు చేస్తామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

భక్తుల ఆగ్రహం : హుస్సేన్‌సాగర్‌, కోనేరుల వద్ద బల్దియా ఆధ్వర్యంలోని దోమల నివారణ విభాగం సిబ్బంది నిమజ్జన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు తీసుకొచ్చిన విగ్రహాలను సిబ్బంది చేతుల్లోకి తీసుకోవడం, వాటిని నీటిలో ముంచి వెంటనే తీసి ట్రక్కుల్లోకి ఎక్కించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో బల్దియా సిబ్బంది నిమజ్జనం చేసి డబ్బు అడుగుతుండటం కనిపించింది.

సాగర్‌లో నిమజ్జనానికి ముందు గణపతికి మొక్కుతున్న మహిళ


ఈసారికి సాగర్‌లోనే చేస్తాం!

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఖైరతాబాద్‌ గణేశ్‌ను ఈసారి మాత్రం హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని కమిటీ తీర్మానం చేసిందని.. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఇది వరకు ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి 4వ నంబరు క్రేన్‌ను కేటాయించేవారు. ఈసారి అదే పద్ధతిలో నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి 70 అడుగులు మట్టి ప్రతిమను ఏర్పాటు చేసి, ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేస్తామన్నారు. బుధవారం ఖైరతాబాద్‌ మహాగణపతి వద్ద కమిటీ సభ్యులు మహేందర్‌బాబు, ప్రసాద్‌, జ్ఞానేశ్వర్‌, రాజు, రమేష్‌చారి, సుధాకర్‌, రాము, సత్యనారాయణ, రమేశ్‌, ఎన్‌.శివ. మధుకర్‌యాదవ్‌లతో కలిసి మహేశ్‌ యాదవ్‌ మాట్లాడారు. నిమజ్జనంపై హైకోర్టు సూచనల్ని కచ్చితంగా పాటిస్తామన్నారు. కాకపోతే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని, పూజలు మొదలైన తరువాత తీర్పు రావడంతో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొందన్నారు. మహాగణపతి దర్శనం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని మహేష్‌ యాదవ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని