అవినీతి అధికారిపై వేటు
eenadu telugu news
Published : 23/09/2021 04:21 IST

అవినీతి అధికారిపై వేటు

రూ.4 కోట్ల ప్రజాధనం స్వాధీనానికి ఆదేశం
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీకి చెందిన మార్కెట్లు, కాంప్లెక్సుల అద్దె వసూలు చేస్తూ.. నిధులను పక్కదారి పట్టించిన అధికారి యు.గోవింద్‌రాజ్‌పై ఎట్టకేలకు బల్దియా యంత్రాగం వేటు వేసింది. సికింద్రాబాద్‌ జోన్‌లోని బేగంపేట సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి దాదాపు పదేళ్లపాటు తన పరిధిలోని మార్కెట్లు, కాంప్లెక్సుల అద్దెను బల్దియా ఖాతాలో జమ చేయలేదు. ఆయన అవినీతి వ్యవహరంపై ‘ఈనాడు’ గతేడాది చివర్లో కథనం ప్రచురించింది. సర్కిల్‌ ఉపకమిషనర్‌ స్పందించి విచారణ చేపట్టారు. రూ.4.01 కోట్లు మాయమైనట్లు స్పష్టం చేసి నివేదికను కేంద్ర కార్యాలయానికి పంపారు. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలనీ కోరారు. అయితే, కేంద్ర కార్యాలయంలో గోవింద్‌ విచారణ నివేదికను వేర్వేరు స్థాయిల్లో తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయి. ఆయా సందర్భాలపై ‘ఈనాడు’ మరో రెండు కథనాలను ప్రచురించింది. రూ.20 లక్షలు లంచం తీసుకుని ఉన్నతాధికారులు గోవింద్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే ఇటీవలి వార్తా కథనంతో పురపాలక శాఖ స్పందించింది. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో.. పరిపాలన విభాగం బుధవారం బాధ్యుడిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, దారి మళ్లిన నిధులను రికవరీ చేయాలని సర్కిల్‌ ఉపకమిషనర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అసిస్టెంట్‌ ఎస్టేట్స్‌ అధికారి తాజ్‌మోహన్‌రెడ్డికీ కేంద్ర కార్యాలయం మెమో జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని