చేరువలోనే విపణి
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

చేరువలోనే విపణి

తీపి మొక్కజొన్న రైతుకు ఊరట

తాండూరులోనే ఉత్పత్తుల విక్రయాలు

విపణిలో మొక్కజొన్న కంకులు

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో తీపి మొక్కజొన్న సాగు చేసే రైతులకు ఊరట లభించింది. ఈ ఏడాది తాండూరులో విపణి ఏర్పాటు కావడంతో దూరప్రాంతానికి వెళ్లే ఇబ్బందులు తప్పాయి. చాలా ఏళ్ల నుంచి హైదరాబద్‌ బోయిన్‌పల్లి మార్కెట్‌కు తరలించే వారు. ఉదయం 4గంటల నుంచే విక్రయాలకు సంబంధించిన బీట్లు జరగడంతో రైతులు తెల్లవార్లు వాహనంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చేది. తాజాగా స్థానికంగా విక్రయాలు జరగడంతో రైతులకు ప్రయోజనం చేకూరింది. పొలంలో తెంపిన కంకులను నేరుగా విపణికి తరలించడంతో సమయం ఆదా అవుతోంది.

తగ్గిన వాహనాల అద్దె: ఉత్పత్తులను హైదరాబాద్‌ తరలించాలంటే చిన్నలారీ అద్దె రూ.3,500 నుంచి రూ.4000 అయ్యేది. ప్రస్తుతం తాండూరు విపణికి వెళ్లే వాహనం అద్దె రూ.1,200 నుంచి రూ.1,700 లోపే ఉంటోంది. రైతులు మొక్కజొన్న కంకులను తరలించేందుకు చిన్నలారీలతో పనిలేకుండా ట్రాక్టర్లు, పెద్ద ఆటోలను వినియోగిస్తున్నారు. కర్ణాటక సేడం, చిత్తాపూరు, మల్కేడ్‌, చించోళి పట్టణాలకు చెందిన వ్యాపారులతో పాటు కొడంగల్‌, పరిగి, తాండూరు పట్టణ ప్రాంతాల్లోని వ్యాపారులు కొనుగోలుకు వస్తున్నారు.

 

10వేల ఎకరాలకు పైగా సాగు..: జిల్లా వ్యాప్తంగా 10వేల ఎకరాల్లో తీపిమొక్కజొన్న సాగు చేస్తున్నారు. విత్తన రకాలను బట్టి 75 నుంచి 80 రోజుల్లోనే దిగుబడి వస్తుంది. నీటి పారకం ఉన్న వారు ఆసక్తి చూపుతున్నారు. ఏ కాలంలో నైనా సాగు చేయవచ్ఛు గతేడాది కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమాహాళ్లు, పాఠశాలలు, కళాశాలలు, మాల్స్‌, ఇతర వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. 50 కిలోల కంకుల బస్తా కేవలం రూ.200 నుంచి రూ.500కే అమ్మారు. దీంతో రైతులు నష్టం పోయారు. కొన్ని నెలల నుంచి అన్నిరకాల వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బయటికి రాకపోకలు నిర్వహించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మళ్లీ డిమాండ్‌ ఏర్పడింది. నాణ్యంగా ఉన్న కిలో కంకులు రూ.15 నుంచి రూ.20 చొప్పున అమ్ముతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు క్వింటాలు లెక్కన విక్రయించారు

అధికారులు దృష్టి సారించాలి: స్థానికంగా జరుగుతున్న విక్రయాలపై వ్యవసాయ విపణి అధికారులు దృష్టి సారించాలి. నిబంధనల మేరకు నాలుగు శాతం కమీషన్‌కు బదులు 10 శాతం వసూలు చేస్తున్నారు. ప్రతి 50 కిలోల బస్తాలో ఒక కిలో చొప్పున తరుగును తీస్తున్నారు. అధికారిక తక్‌పట్టీకి బదులు తెల్లకాగితంపై తక్‌పట్టీలను ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయ విపణికి వచ్చే ఆదాయం రాకుండా పోతోంది.


నిబంధనలు విస్మరించొద్దు

విఠల్‌నాయక్‌, తాండూరు వ్యవసాయ విపణి ఛైర్మన్‌

తాండూరులోని తీపి మొక్కజొన్నల విక్రయ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. నిబంధనల విస్మరించి వ్యాపారం చేయోద్దని సూచిస్తాం. పరిస్థితిలో మార్పు రాకుంటే ఏజంట్‌ లైసెన్సును రద్దు చేస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని