వరద... కదల్లేక వాహనాల రొద
eenadu telugu news
Published : 28/09/2021 04:38 IST

వరద... కదల్లేక వాహనాల రొద


కూకట్‌పల్లిలో నిలిచిన ట్రాఫిక్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలతో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకూ నగరం నలుమూలలూ ట్రాఫిక్‌ స్తంభించింది. కూకట్‌పల్లి-ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌-మలక్‌పేట.. చార్మినార్‌-గచ్చిబౌలి మార్గాలతో పాటు ప్రధాన ప్రాంతాల్లోని రహదారులపై సాయంత్రం కుండపోత వర్షం కురవడం.. వాహదారులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. జూబ్లీహిల్స్‌-మాదాపూర్‌ మధ్యలో రెండు కిలోమీటర్ల వరకూ వందల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు మాదాపూర్‌ కేబుల్‌ వంతెనపైకి ట్రాఫిక్‌ మళ్లించారు.

* ఖైరతాబాద్‌ రైల్వేగేట్‌ వద్ద మూడు అడుగుల వరకూ వర్షం నీరు ప్రహిస్తుండటంతో అబిడ్స్‌ నుంచి వస్తున్న వాహనాలు లక్డీకాపూల్‌ వద్ద ఆగిపోయాయి. పంజాగుట్ట నుంచి ఆబిడ్స్‌ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్‌ ఫ్లైవోవర్‌పైకి మళ్లించినా ఫలితం కనిపించలేదు.

* మాసబ్‌ట్యాంక్‌, మహావీర్‌ ఆసుపత్రి, పీటీఐ బిల్డింగ్‌ రహదారిపై వాననీటి ప్రవాహం అధికంగా ఉండడంతో టోలీచౌకీ, మెహిదీపట్నం నుంచి వస్తున్న వాహనాలు మాసాబ్‌ట్యాంక్‌ ఫ్లైవోవర్‌ పైనుంచి అతికష్టం మీద కిందకు వచ్చాయి.

* బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌1/10, 1/12 రహదారులు నీటితో నిండి మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌ బంజారాహిల్స్‌, పంజాగుట్ట వరకూ వాహనాలు నిలిచిపోయాయి.

* బేగంపేట-సికింద్రాబాద్‌- హబ్సిగూడ-తార్నాక-ఉప్పల్‌ మార్గంలో ప్యారడైజ్‌, పాట్నీసెంటర్‌ కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి 8గంటల వరకూ వాహనాల రాకపోకలు నత్తనడకన కొనసాగాయి.

* చార్మినార్‌, మదీనా, చత్రినాక, ఫలక్‌నుమా రహదారులపై వర్షం నీరు ప్రవహిస్తుండడంతో సాయంత్రం 6గంటల నుంచి ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ పోలీసులు శ్రమించి నీటి నిల్వ ప్రాంతాలను వేగంగా ఖాళీ చేయించారు.

* చాంద్రాయణగుట్ట, కాటేదాన్‌, ఆరాంఘర్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్‌-బెంగుళూరు రహదారి, బహదూర్‌పురా, శివరాంపల్లి, ఆరాంఘర్‌ మార్గంలో బస్సులు, కార్లు ఆగిపోయాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని