పోటెత్తుతున్న భారీ వరద
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

పోటెత్తుతున్న భారీ వరద

ఈనాడు, సంగారెడ్డి: మెతుకు సీమపై గలగల పారి పచ్చని పంటలు పండించడమే కాదు తడారిన గొంతుక దప్పిక తీర్చే సింగూరుకు జల (మంజీర) సంబరమొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా గత పదేళ్లలో లేనంతగా వరుసగా రెండు వానా కాలాల్లోనూ భారీగా వరద చేరడం గమనార్హం. ఈ మధ్యకాలంలో పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని మించి వరద రావడం ఇది మూడోసారని అధికారులు వివరిస్తున్నారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు తాగు, సాగునీటికి ఇదే ప్రధాన ఆధారం. సింగూరు కాల్వల ద్వారా అందోలు, పుల్కల్‌ మండల్లాలోని 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా ఇప్పటికే పనులు పూర్తయి పారుతున్నాయి. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని వనదుర్గా ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నహర్‌, ఫతేనహర్‌ కాలువల ద్వారా సాగునీటిని అందిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్‌లోని నిజాంసాగరూ మంజీరా జలాలతోనే నిండుతుంది. అంతే కాదు.. జుక్కల్‌, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాలతో పాటు ఎల్లారెడ్డిలోని మూడు మండలాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరూ అందుతుంది. ఇలా ఉమ్మడి రెండు జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు గత పదేళ్లలో పరిశీలిస్తే వరుసగా రెండో సీజన్‌లోనూ గరిష్ఠంగా వరద రావడం విశేషం.
దిగువకు ఉరకలు...
1997 నుంచి 2021 వరకు అధికారులు అందించిన గణాంకాల మేరకు పరిశీలిస్తే సింగూరు ప్రాజెక్టుకు 1998-99 మధ్యకాలంలోనే అత్యధికంగా వరద వచ్చి చేరింది. ఆ సమయంలో ఏకంగా 176.55 టీఎంసీల మేర జలాలు రావడం విశేషం.
2012-13 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే  సింగూరు ప్రాజెక్టుకు అత్యధికంగా వరద 2016-17లో వచ్చింది. ఆ సమయంలో ఏకంగా     105.97 టీఎంసీలు చేరింది.   ఆ తర్వాత నుంచి మూడేళ్ల పాటు నిరాశే మిగిలింది. 2017-18లో 27.59 టీఎంసీల వరద చేరినా, 2018-19, 2019-20లలో తీవ్ర కరవు పరిస్థితులు సంభవించాయి. ఎగువన వానలు లేకపోవడంతో కేవలం 2.42, 1.81 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 33.60 టీఎంసీల జలాలు సింగూరుకు వచ్చి వనదుర్గా ప్రాజెక్టు మీదుగా దిగువకు ఉరకలు పెడుతున్నాయి. ఇప్పటి వరకు 11 సార్లు వరద వచ్చింది. మూడుసార్లు 100 టీఎంసీలను మించిది.


ఐదు గేట్ల ద్వారా దిగువకు విడుదల  
 

జోగిపేట, న్యూస్‌టుడే: సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో మంగళవారం 6, 9, 11, 14, 15 నంబర్లు గల ఐదు క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు.  ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రలోని ధన్‌గావ్‌, కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని నారాయణఖేడ్‌, జారాబాద్‌, అందోలు నియోజకవర్గాల పరిధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా మంగళవారం రాత్రికి సుమారు లక్ష క్యూసెక్కుల నీరు రావచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీˆలు కాగా ప్రస్తుతం 28.555 టీఎంసీˆల నీరు ఉన్నట్లు తెలిపారు.  
ధన్‌గావ్‌ ప్రాజెక్టు నుంచి దాదాపు 90వేల క్యూసెక్కుల మేర భారీగా వరద వస్తోందని నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్‌ పి.మధుసూదన్‌రెడి తెలిపారు. ఈనెల 27న ఉదయం అధికారులు అందించిన సమాచారం ప్రకారం ప్రాజెక్టులోకి 40,576 క్యూసెక్కుల వరద వస్తుండగా... దిగువకు 50,669 క్యూసెక్కులు వదులుతున్నారు.


జల దిగ్బంధంలోనే వనదుర్గమ్మ ఆలయం
పాపన్నపేట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. గర్భగుడిలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో రాజగోపురంలో ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. వారం రోజుల నుంచి నీటిలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద అధికంగా వస్తుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తుండగా, వనదుర్గా ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దీంతో ఆలయం ముందు వరద ఉద్ధృతి మరింత పెరిగింది. భక్తులు రాజగోపురంలోనే అమ్మవారిని దర్శించుకున్నారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి బందోబస్తు చేపట్టారు. వనదుర్గా ప్రాజెక్టు నుంచి 45,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సింగూరు నుంచి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గంగమ్మకు సారె సమర్పించి..
ఏడుపాయల ఆలయాన్ని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు, ఈవో సార శ్రీనివాస్‌ ఆమెకు స్వాగతం పలికారు. రాజగోపురం వద్దే ఉత్సవ ఆలయం జలదిగ్బంధంలో ఉండడంతో రాజగోపురంలో ఉన్న ఉత్సవవిగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంగమ్మకు పూజలు చేసి సారె సమర్పించి హారతి ఇచ్చారు. వరద ఉద్ధృతిని పరిశీలించి మాట్లాడారు. మంజీర పరివాహక ప్రాంతాల ప్రజలు, ఏడుపాయలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరద ప్రవాహం తగ్గాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. రైబస అధ్యక్షుడు సోములు, మెదక్‌ పురపాలిక ఛైర్మన్‌ చంద్రపాల్‌, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ లావణ్యారెడ్డి, వైస్‌ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని