తీగ లాగక.. చీకటి తొలగక
eenadu telugu news
Published : 21/10/2021 01:57 IST

తీగ లాగక.. చీకటి తొలగక

● అస్తవ్యస్తంగా వీధి దీపాల నిర్వహణ

● కేబుళ్ల కొరతంటోన్న జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌

ఉప్పరిపల్లిలో చీకటిగా ఉన్న ఓ వీధి

రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఉప్పరిపల్లిలోని అమర్‌ స్కూల్‌ దారిలో వీధి దీపాల సమస్య ఉంది. పక్కనున్న మరో వీధిలో లైటు కూడా లేదు. దీనిపై జనవరిలో స్థానికులు మైజీహెచ్‌ఎంసీ ద్వారా ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు 3 కొత్త స్తంభాలు అవసరమని తేల్చారు. అప్పట్నుంచి సమస్య అపరిష్కృతమే. స్థానికులు తరచూ అధికారులను సంప్రదిస్తుండగా.. గతంలో కొవిడ్‌ సమస్య ఉందని, ఇప్పుడు కేబుల్‌ వైరు లేనందున పనులు చేపట్టలేమని ఇంజినీర్లు సమాధానం చెబుతున్నారు. నగరంలో వీధి దీపాల నిర్వహణ ఎలా ఉందనేందుకు నిదర్శనం ఇది. అవసరమైన ప్రాంతాల్లో విద్యుద్దీపాలను ఏర్పాటు చేయలేకపోతున్నారు. పాడైన దీపాలను సమయానికి బాగు చేయట్లేదు. నగరంలోని మెజార్టీ కాలనీలు, శివారు ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి.

50 శాతానికిపైగా అపరిష్కృతం

మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌యాప్‌, కాల్‌సెంటర్‌ ఫోన్‌ నంబరుకు(040 2111 1111) వస్తున్న వీధి దీపాల సమస్యలు 50 శాతానికిపైగా పరిష్కారం కావడం లేదు. 24గంటల్లో స్పందించాల్సి ఉండగా, అలా జరగట్లేదు. కమిషనర్‌ నుంచి విభాగాధిపతులు, జోనల్‌ కమిషనర్లు, ఉపకమిషనర్ల వరకు ఎవరూ సమీక్ష చేయట్లేదు. అదే అదనుగా అధికారులు సమస్యను పరిష్కరించకుండానే, యాప్‌లో ఫిర్యాదులను మూసేస్తున్నారు.

కనిపించని డ్యాష్‌బోర్ఢు.

వీధి దీపాల నిర్వహణను జీహెచ్‌ఎంసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈఈఎస్‌ఎల్‌కు అప్పగించింది. ఒప్పందం ప్రకారం.. నగరంలోని ప్రతి లైటు డ్యాష్‌బోర్డుతో అనుసంధానమై ఉండాలి. సగటున 98శాతం వీధిదీపాలు వెలిగితేనే ఆ నెలకు సంబంధించిన రుసుమును ఈఈఎస్‌ఎల్‌కు చెల్లించాలి. మొదట్లో ఇది 100 శాతం పారదర్శకంగా అమలైంది. రెండేళ్లుగా పని చేయట్లేదు. వీధి దీపాల నిర్వహణను ఈఈఎస్‌ఎల్‌ నుంచి కొందరు నేతలు చేజిక్కించుకుని, అవినీతిమయంగా మార్చారన్న విమర్శలొస్తున్నాయి.

సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని

*● పీవీఎక్స్‌ప్రేస్‌వే పిల్లర్‌ నంబరు 150 వద్ద ర్యాంపుల నిర్మాణం కోసం అధికారులు లైట్లు తొలగించి ఏడాదవుతున్నా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించట్లేదు. అక్కడున్న యూ టర్న్‌ వద్ద రోడ్డు దాటేవారు ప్రమాదాలకు గురవుతున్నారు.

*● మియాపూర్‌ జనప్రియ వెస్ట్‌సిటీ రోడ్డుపై చీకట్లు కమ్ముకుని మహిళలు, వృద్ధులు అటుగా నడవలేకపోతున్నారు. ఓయూ ప్రధాన రహదారిపైనా చీకట్లే.

*● నానక్‌రామ్‌గూడ, షేక్‌పేట, మెహిదీపట్నం, పాతబస్తీలోని చాలా కాలనీల్లో చీకట్లు కమ్ముకున్నాయి.

*● మాసబ్‌ట్యాంక్‌ నుంచి మెహిదీపట్నం వరకు, బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రధాన రహదారిపై చాలా వీధి దీపాలు మరమ్మతులకు గురయ్యాయి.


2021 జనవరి నాటికి నగరంలోని వీధి దీపాలు: 4,41,963Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని