రబీలో మినుము సాగుకు ప్రోత్సాహం
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

రబీలో మినుము సాగుకు ప్రోత్సాహం

గౌతాపూర్‌లో మినుముదంట్లు ఆరబెడుతున్న రైతు

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: రబీలో పుప్పుల సాగును పెంచాలన్న లక్ష్యంతో సర్కారు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తొలిసారిగా మినుములు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి, మద్దతు ధర అందించేందుకు హామీ ఇచ్చింది. ఈ పరిణామంతో జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా మినుముల సాగు పెరిగేందుకు దోహదపడనుంది.

జిల్లా వ్యాప్తంగా రైతులు రబీలో ప్రధానంగా వరి, శనగ, వేరుసెనగ, జొన్న, మొక్కజొన్న, గోధుమలు, కుసుమలను పండిస్తారు. అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం 70వేలకుపైగా ఎకరాల్లో ఉంటోంది. ఈ సీజన్‌లో దీన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా మినుముల సాగు పెంచేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. జిల్లాలో నేలలు అనువుగా ఉండటంతో ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎకరాకు ఆరు కిలోల విత్తనాలు విత్తితే ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడులు చేతికి రానున్నాయి. మూడు నెలల పంట కాలం కావడంతోపాటు పెట్టుబడి ఖర్చులు సైతం రూ.పది వేలలోపు ఉండటంతో కలిసి వస్తుంది. వరితో పోల్చితే మినుము పంటకు నీటి వినియోగం తక్కువగా ఉండటంతో వేసవిలో నీటి కొరత సమస్యను అధిగమించే ఆస్కారముంటుంది. కందుల కంటె అధికంగా క్వింటాకు రూ.6,300 చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్ధమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించడంతో రైతులకు భరోసా లభించనుంది. వాతావరణం అనుకూలిస్తే రబీలో మినుము సాగు లాభదాయకంగా ఉండనుంది. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా సాగు విస్తీర్ణం అధికంగా ఉండనుంది.

జాతీయ స్థాయిలో డిమాండ్‌: గతంలో ఇంటింటికీ మినుముల సాగు సంప్రదాయంగా కొనసాగించేవారు. దిగుబడులు చేతికొచ్చాక కుటుంబ అవసరాలకు సరిపడా నిల్వ చేసుకొని మిగిలిన వాటిని విక్రయించే వారు. క్రమంగా వాణిజ్య పంటలు, ఆదాయం వచ్చే పంటల వైపునకు అన్నదాతలు మొగ్గుచూపడంతో ఏటా సాగు తగ్గుముఖం పడుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి సాధారణ సాగు 1,51,253 ఎకరాలు ఉంటే, 1,90,781 ఎకరాలకు పెరిగింది. పెసలు సాధారణ సాగు విస్తీర్ణం 20,571 ఎకరాలు ఉండగా 15,278 ఎకరాలకు తగ్గింది. మినుముల సాగు విస్తీర్ణం 12,218 ఎకరాలు ఉండగా వాస్తవ సాగు 9,299 ఎకరాలకు చేరడంతో పాతిక శాతం తగ్గింది. ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే పప్పుల సాగు తగ్గుముఖం పట్టడంతో విపణిలో కొరత నెలకొని మినుములకు డిమాండ్‌ ఏర్పడింది. ధరలు సైతం అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ మినుముల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వక హామీ ఇవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నీరు పుష్కలం
ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం ద్వారా జిల్లాలోని డెబ్భై శాతం చెరువులను పునరుద్ధరింపజేసింది. వర్షాకాలంలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, జలాశయాలు జలకల సంతరించుకున్నాయి. భూగర్భ జలమట్టాలు పెరగడంతోపాటు వ్యవసాయ పొలాల్లోని బోరు బావుల్లోనూ నీరు వచ్చి చేరింది. దీంతో రబీ సీజన్‌లో పంటలకు అవసరమైన సాగు నీటికి ఢోకా లేకుండాపోనుంది. మినుము పంటకు తక్కువ తడులతోనే  దిగుబడులు చేతికందనున్నాయి.

తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం
రజిత, వ్యవసాయ అధికారిణి, తాండూరు

వరితో పోలిస్తే మినుము సాగుకు తక్కువ పెట్టుబడే అవుతుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు దిగుబడులు సేకరించడంతో లాభదాయకంగా ఉంటుంది. విపణిలో మినుములకు, పప్పునకు డిమాండ్‌ అధికంగా ఉంది. రైతులు మినుము సాగు చేసి సద్వినియోగం చేసుకోవాలి. విపణిలో డిమాండ్‌ ఉన్న పంటలను పండిస్తే ఆదాయం పొందే వీలుంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని