నాలాల లెక్క.. ఇక పక్కా
eenadu telugu news
Published : 27/10/2021 02:46 IST

నాలాల లెక్క.. ఇక పక్కా

రాజధాని నాలాలన్నీ మాస్టర్‌ప్లాన్‌లోకి

ఆక్రమణలకు అడ్డుకట్ట అభివృద్ధికి ఊతం

నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: వరద నాలాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో మంత్రి కేటీఆర్‌ వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్‌ఎన్‌డీపీ) ప్రారంభించారు. భారీగా నిధులు వెచ్చించేందుకు అనుమతిచ్చారు. ఇప్పుడు నాలాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేందుకు పురపాలకశాఖ నడుం బిగించింది. మొదటి దశలో జోన్‌కు ఒకటి చొప్పున ఆరు ప్రధాన నాలాలను మాస్టర్‌ప్లాన్‌ (బృహత్తర ప్రణాళిక)లో చేర్చాలని తాజాగా ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం పూర్తయితే తుది ప్రకటన వెలువడనుంది. ప్రక్రియను అలాగే కొనసాగించి నగరవ్యాప్తంగా ఉన్న అన్ని నాలాలను బృహత్తర ప్రణాళికలో చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ఓయంట్స్‌ నివేదిక ఆధారంగా..

2000 సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌ దిగువనున్న జనావాసాలు నీట మునిగాయి. అనంతరం ప్రభుత్వం కిర్లోస్కర్‌ కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించింది. అప్పటికి జీహెచ్‌ఎంసీ ఏర్పాటు కాలేదు. ఎంసీహెచ్‌ (మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌) ఆధ్వర్యంలో నిపుణులు నాలాలను పరిశీలించారు. 2003లో నివేదిక సమర్పించారు. విస్తరణతో నగరం కాంక్రీటు వనంలా మారుతోందని, నీరు నిలిచేందుకు జాగా లేకపోవడంతో కురిసిన ప్రతి చినుకు వీధులను, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోందని అధ్యయనం తేల్చింది. వరదనీరు నాలాల్లో వెళ్లి మూసీలో కలవాలంటే యుద్ధ ప్రాతిపదికన నాలాలను విస్తరించాలని చెప్పింది.

కిర్లోస్కర్‌ నివేదిక ప్రధాన నాలాలనే ప్రస్తావించడంతో, మిగిలిన చిన్నపాటి నాలాలపైనా సమాచారం ఇవ్వాలని అప్పటి బల్దియా అధికారులు 2006లో కమిటీని కోరారు. 2007లో శివారు మున్సిపాలిటీలను కలుపుకొని జీహెచ్‌ఎంసీ ఏర్పాటైంది. మళ్లీ భారీ వర్షాలు వచ్చాయి. గతంలోని కిర్లోస్కర్‌ కమిటీ సిఫార్సులకు కొనసాగింపుగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులు ఓయంట్స్‌ కన్సల్టెన్సీని ఆదేశించారు. సదరు సంస్థ గ్రేటర్‌ పరిధి మొత్తాన్ని జల్లెడ పట్టింది. సర్వే ఆఫ్‌ ఇండియా పటాలు, అందులోని నాలాల వ్యవస్థ, గొలుసు కట్టు చెరువులు, వాటిని అనుసంధానం చేసే నాలాలు, వరద నాలాల వాస్తవ రూపాన్ని నివేదికగా రూపొందించింది. సహజ సిద్ధంగా ఆయా నాలాలు ఎంత పొడవు, వెడల్పుతో ఉండేవో తేల్చింది. ఆ లెక్కల ప్రాతిపదికన ఇప్పుడు జీహెచ్‌ఎంసీ నాలాల లెక్కను సరిచేస్తోంది. అంతే వెడల్పు, పొడవుతో నాలాలకు డ్రాయింగ్‌లు రూపొందించి, వాటిని మాస్టర్‌ప్లాన్‌లో చేర్చనుంది.

లాభాలు ఏంటంటే..

ప్రభుత్వం వరద నాలాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కానీ నేటి మాస్టర్‌ ప్లాన్‌లో వాటి లెక్క పూర్తిగా లేదు. దానివల్ల ఆక్రమణలను తొలగించడం సాధ్యపడట్లేదు.

మాస్టర్‌ప్లాన్‌లో ఓయంట్స్‌ కమిటీ చెప్పిన కొలతలతో నాలాలను చేర్చితే అవి అధికారికంగా అభివృద్ధి ప్రణాళికలో చేరినట్లవుతుంది. వాటిపై నిర్మాణాలు రాకుండా అడ్డుకోవచ్ఛు

మాస్టర్‌ప్లాన్‌లో నాలాలు ఉన్నప్పుడు బఫర్‌ జోన్లో భవన నిర్మాణం చేపట్టేందుకు అనుమతి రాదు. అక్రమంగా నిర్మిస్తే.. కూల్చివేసేందుకు చట్టబద్ధమైన సమస్యలు తలెత్తవు.

విస్తరణ పనులు చేపట్టేందుకు తలెత్తే అడ్డంకులను సులువుగా అధిగమించవచ్ఛు నాలాలు వివాదాల్లేని ప్రభుత్వ ఆస్తులుగా బృహత్తర ప్రణాళికలో ఇమిడిపోతాయి.

రూ.858కోట్లతో పనులు..

నాలాల విస్తరణ కోసం రాష్ట్ర సర్కారు రూ.858 కోట్లు వెచ్చించేందుకు అనుమతి ఇచ్చింది. ఎస్‌ఎన్‌డీపీ ఆధ్వర్యంలో రూ.170 కోట్ల విలువైన పనులకు ఇంజినీర్లు టెండర్లు పిలిచారు. ఆక్రమణలు తొలగించి, నిరాశ్రయులకు పరిహారంగా రెండు పడక గదుల ఇళ్లను ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఆమేరకు మంత్రి కేటీఆర్‌ తగిన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేస్తున్నారు.

మొదటి దశలో చేరనున్న నాలాలు ఇవే..

పెద్దచెరువు నుంచి నల్లచెరువు, అక్కడి నుంచి మూసీ వరకు
హుస్సేన్‌సాగర్‌ వరద నాలా
బుల్కాపూర్‌ నాలా
ముర్కి నాలా
సున్నంచెరువు నుంచి మైసమ్మ తటాకం
గోపిచెరువు నుంచి చాకలివానిచెరువు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని