ఈ-చలాన్‌... బాదుడు ఇలానా?
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

ఈ-చలాన్‌... బాదుడు ఇలానా?

ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పోలీసు  సిబ్బంది
న్యూస్‌టుడే, తంగళ్లపల్లి

ప్రమాదాల నివారణకు తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందరూ విధిగా రహదారి నిబంధనలు పాటించాలని, లేకుంటే ఈ-చలానా ద్వారా జరిమానా తప్పదంటూ పోలీసు అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఫలితంగా తప్పు చేయని వాహనదారులకు జరిమానాలు వెళుతున్నాయి. పార్కింగ్‌ స్థలంలో పెట్టిన వాటికి కూడా ఈ-చలాన్‌ పంపిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

శిరస్త్రాణం లేకుండా వాహనం నడిపినా, రాంగ్‌ రూట్‌లో వెళ్లినా జరిమానా విధించడంలో తప్పులేదు. కానీ రహదారి పక్కన నిలిపి ఉన్న వాహనాలకు, తంగళ్లపల్లిలో కారు ఫొటో తీసి ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న ద్విచక్రవాహనానికి ఆన్‌లైన్‌లో జరిమానా పంపించారు. పోలీసు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణలో విధులు నిర్వహించే సిబ్బందికి అధికారులు ప్రత్యేకంగా లక్ష్యాలు నిర్దేశిస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజూ కనీసం 30 నుంచి 40 కేసులు నమోదు చేయాలని సూచిస్తుండటంతోనే సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. శిర స్త్రాణం లేకపోవడం, రాంగ్‌ రూట్‌, ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించడం, అధిక వేగం, తదితర అంశాలన్నింటిలోనూ విధిగా కేసులు ఉండాలని చెప్పడంతో నిరంతరం ఫొటోలు తీయడంపైనే దృష్టి సారిస్తున్నారు.

శిరస్త్రాణం లేకుండా ప్రయాణిస్తున్న పోలీసు

చలాన్లపై మోజు...
జిల్లా కేంద్రంతోపాటు, పట్టణ పరిసర గ్రామాల్లో రోజు రోజుకు ట్రాఫిక్‌ పెరుగుతోంది. రహదారుల పక్కన ఇష్టారీతిన దుకాణాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. కొన్ని కూడళ్లలో రద్దీని నియంత్రించలేక పోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. వీటిని పరిష్కరించేందుకు పోలీసు సిబ్బంది కనీస ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు వైపు ఫొటోలు తీసి కేవలం ఈ-చలాన్‌ ద్వారా జరిమానా విధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తంగళ్లపల్లిలోని ఈ కారును చూపించి హైదరాబాద్‌లో ఉన్న ద్విచక్ర వాహనదారునికి జరిమానా వేసిన చలాన్‌

కారు ఫొటో... ద్విచక్రవాహనానికి జరిమానా
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ కొందరు సిబ్బంది తమకు ఇచ్చిన లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేసుకోవాలన్న ఆలోచనతో ఇష్టారీతిన ఫొటోలు కొడుతూ ఆన్‌లైన్‌లో జరిమానాలు విధిస్తున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తాడూరు అడ్డరోడ్డు వద్ద సిబ్బంది ఓ కారు ఫొటో తీసి హైదరాబాద్‌లో ఉన్న ద్విచక్రవాహనానికి జరిమానా విధించారు. దీన్ని బట్టి పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఊహించవచ్చు. రోజూ సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. సిబ్బంది మాత్రం వారికి ఇష్టం వచ్చిన వాటి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో జరిమానాలు విధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆన్‌లైన్‌ విధానం కావడం చరవాణి నంబరు అనుసంధానం లేకపోవడంతో జరిమానా పడిన సంగతి కూడా వాహనదారుడికి తెలియడం లేదు.

 


పోలీసులకు నిబంధనలు వర్తించవా?

ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించాలని ప్రచారం చేస్తున్నప్పటికి కొందరు ధరించడం లేదు. వారికి జరిమానాలు విధిస్తున్నారు. కానీ అదే పోలీసులు శిరస్త్రాణం ధరించకుండా తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడు కనించడం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసు సిబ్బందికి మాత్రం జరిమానాలు ఎందుకు విధించడం లేదని పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు


పొరపాట్లు జరగకుండా చర్యలు
- ఉపేందర్‌, గ్రామీణం సీఐ

కారుకు బదులు ద్విచక్రవాహనానికి జరిమానా విధించిన విషయం మా దృష్టికి రాలేదు. కొందరు వ్యక్తులు నంబరు ప్లేట్‌లోని కొన్ని అక్షరాలను మార్చడంతో ఒకరికి బదులు వేరొక వ్యక్తికి జరిమానా వెళుతుంది. ఆగి ఉన్న వాహనాలకు ఎలాంటి జరిమానాలు వేయరాదు. తనిఖీ చేసిన సమయంలో ధ్రువపత్రాలు సక్రమంగా లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ-చలాన్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని