రూ.2 కోట్ల విలువైన మెపిడ్రిన్‌ పట్టివేత
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

రూ.2 కోట్ల విలువైన మెపిడ్రిన్‌ పట్టివేత

వివరాలు వెల్లడిస్తున్న  అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రయ్య

ఈనాడు, హైదరాబాద్‌, పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు బట్టబయలు చేశారు. పేట్‌బషీరాబాద్‌లోని మేడ్చల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రయ్య వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి న్యూబాలాజీనగర్‌ ఎస్వీ సెలక్షన్‌ అపార్ట్‌మెంట్‌లో గంజాయి, తెల్లపౌడర్‌ విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ సహదేవ్‌ సారథ్యంలో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన చిటుకూరి ప్రశాంత్‌రెడ్డి(24) వద్ద అయిదు గ్రాముల మత్తుపదార్థం స్వాధీనం చేసుకొన్నారు. అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు స్నేహితుడి సూచనతో అడ్డదారి ఎంచుకొన్నాడు. కన్నారెడ్డి అనే వ్యక్తి నుంచి పౌడరు తీసుకున్నాడు.  ప్రతిరోజూ అపార్ట్‌మెంట్‌ వద్దకు 15 నుంచి 20 మంది వరకూ వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం చేరవేశారు.  దాడి చేసిన అధికారులు అక్కడ ఖరీదైన మెపిడ్రిన్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పెద్దమొత్తంలో మత్తుపదార్థం కావాలంటూ ప్రశాంత్‌రెడ్డి ద్వారా కన్నారెడ్డికి ఫోన్‌ చేయించారు. నాగార్జునసాగర్‌ రోడ్డులోని బొంగులూరుగేట్‌ వద్ద హోటల్‌లో ఉన్న అతణ్ని అదుపులోకి తీసుకొని 921 గ్రాముల మెపిడ్రిన్‌ స్వాధీనం చేసుకొన్నారు. మత్తు ప్యాకెట్లను తనకు నాగర్‌కర్నూలు జిల్లా బావాజీపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణగౌడ్‌ అందజేసినట్లు కన్నారెడ్డి తెలిపాడు. ఇతడి ద్వారా మరికొంత సరకు కావాలంటూ రామకృష్ణగౌడ్‌కు ఫోన్‌ చేయించారు. అతడు కారులో సరకు తీసుకొని నాగర్‌కర్నూలు పౌర సరఫరాల గోదాము వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ మాటువేసిన అధికారులు అదుపులోకి తీసుకొని 4 కిలోల మెపిడ్రిన్‌ స్వాధీనం చేసుకొన్నారు. అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా బావాజీపల్లి గ్రామానికి చెందిన బండారు హనుమంతరెడ్డి, సురేష్‌రెడ్డి అలియాస్‌ ఎస్‌.కే.రెడ్డి సరఫరా చేసినట్లు తెలిపారు. పట్టుబడిన 4.921 గ్రాముల మెపిడ్రిన్‌ విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. అరెస్టయిన ప్రశాంత్‌రెడ్డి, కన్నారెడ్డి, రామకృష్ణగౌడ్‌ను రిమాండ్‌కు తరలించారు. హనుమంతరెడ్డి, సురేష్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని