Published : 09/05/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో డోస్‌కే ప్రాధాన్యం

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: కొవిడ్‌ టీకా పంపిణీపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ప్రస్తుతం రెండో డోసు వారే కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఇది ఈ నెల 16వ తేదీ వరకు అమలులో ఉంటుంది. 45 ఏళ్లు దాటిన వారికి సైతం మరో వారం రోజులు మొదటి డోసు ఇవ్వడం కష్టమేనని దీనర్థం. మొన్నటి వరకు అందుబాటులో ఉన్న ‘కొవిన్‌’ యాప్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లను ప్రస్తుతం రద్దు చేశారు. ఏప్రిల్‌ 8, ఆ తేదీ కంటే ముందు మొదటి డోసు టీకా వేయించుకున్న వారికే తొలి ప్రాధాన్యం కల్పించనున్నారు. ఈ నెల 10వ తేదీ (సోమవారం) నుంచి రెండో డోస్‌ కోవాగ్జిన్‌ సెషన్‌(వ్యాక్సినేషన్‌ ప్రక్రియ)ను కొనసాగించేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,37,897 మందికి టీకాలు పంపిణీ చేశారు. మొదటి డోస్‌ పొందిన వారు (కోవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి) 1,10,780 మంది ఉన్నారు. వారిలో రెండ డోస్‌ పొందిన వారి సంఖ్య. 27,117. ఇంకా రెండో డోసు కోసం 1,10,780 మంది ఎదురు చూస్తున్నారు. వీరికి ఈ నెల 10వ తేదీ నుంచి దశల వారీగా టీకా అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకే రోజు కాకుండా దఫ దపాలుగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మళ్లీ కొత్తవారికి తొలి డోసు పంపిణీ చేసే విషయమై త్వరలో స్పష్టత వచ్చే వీలుంది.

కార్డులతో నేరుగా కేంద్రాలకే

రెండో డోసు పొందాల్సిన లబ్ధిదారులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్‌కార్డు, ఇతర ఆధారాలతో నేరుగా దగ్గర్లోని కేంద్రాలకు వెళ్లి టీకా పొందే అవకాశం కల్పించారు. టీకా నిల్వలు తక్కువగా ఉండటం వల్ల జిల్లాకు ప్రస్తుతం కేవలం 3500 డోస్‌లే సరఫరా అవుతోంది.

కాస్త ఆలస్యమైనా ఇబ్బంది లేదు..

- డా.నాగేంద్ర ప్రసాద్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి

మొదటి డోస్‌ తరువాత రెండో దఫా పొందేదుకు నిర్దేశించిన రోజుల్లో కాస్త అటు ఇటుగా తేడా వస్తే పెద్దగా నష్టమేమీ ఉండదు. ఉన్న నిల్వల సామర్థ్యం, కేటాయింపు ఆధారంగా ప్రస్తుతం రెండో డోస్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలస్యంపై ఆందోళన చెందక్కర్లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని