Updated : 22/04/2021 05:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతం అవనివ్వొద్దు!

నేడు ధరిత్రి దినోత్సవం

● ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌ లేదా సీసా సగటు జీవిత కాలం 1000 సంవత్సరాలపై మాటే

● లీటర్‌ పెట్రోలు, డీజిల్‌ వినియోగం ద్వారా తయారవుతున్న విష వాయువులు 2.30 కిలోలు

పచ్చటి పొల్లాలో వెలిసిన విలాసవంతమైన భవనాలు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: అభివృద్ధి పేరుతో మానవుని జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పులు పుడమి తల్లి రక్షణకు పెద్ద సవాలుగా మారాయి. మితిమీరి వాడుతున్న వాహనాలు, కాలుష్యాలను వెదజల్లే పరిశ్రమలు, సుఖం కోసం వినియోగిస్తున్న ఏసీ, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు.. ఇష్టానుసారంగా వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, సహజ వనరుల దోపిడీ ద్వారా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇవన్నీ భూగోళాన్ని వేడెక్కించడంతోపాటు ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నాయి.

భారత అంతరిక్ష వ్యవసాయ భూసార శాస్త్రవేత్తలు కొన్నేళ్ల క్రితం నిర్వహించిన అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్‌ ఎడారీకరణ బారిన పడుతున్నట్లు హెచ్చరించింది. ఈ ప్రభావం జిల్లాపై కూడా కనిపిస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 17,658 చ.కి.మీ.లు కాగా, జిల్లాలో 18 శాతం అడవులు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి 33 శాతం ఉండాలి. జిల్లాలో అటవీ విస్తీర్ణం 7,86,396 ఎకరాలు ఉంది. జిల్లా వ్యాప్తంగా అడవుల విస్తీర్ణం, వృద్ధి శాతం 0.63 శాతానికే పరిమితమైంది. జిల్లాలో వృక్ష సంపద హరించుకుపోవడం, నీటి కొరత, నీళ్లు నిలిచిపోవడం ఎడారీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది. జిల్లాలోని పడమర ప్రాంతంతోపాటు ఎర్రమల కొండల పరిధిలో విపరీతంగా సాగుతున్న గనుల తవ్వకం, వంటచెరకు వినియోగించుకోవడం కూడా ఎక్కువగా ఉంది.

భూసారాన్ని చంపుతున్న ‘క్రిమిసంహారకం’

జిల్లాలో పంట పొలాలన్నీ క్రిమిసంహారక మందులు, ఎరువులు వినియోగంతోనే 90 శాతం సాగవుతుండటం విస్తుగొల్పుతోంది. గతేడాది ఖరీఫ్‌లో ఎరువుల లక్ష్యం 4,01,250 మెట్రిక్‌ టన్నులు కాగా 90 శాతం వరకు వినియోగమైంది. ఈ ఏడాది 3 శాతం ఎక్కువగానే వాడకమైంది. 20 వేల మెట్రిక్‌ టన్నుల వినియోగం తగ్గించినట్లు చెబుతుండగా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లా భూసార పరీక్షా కేంద్రాల నివేదికల ప్రకారం భూముల్లో నత్రజని 95 శాతం వరకు లోపించింది. 29 మండలాల్లో భూముల్లో ఐరన్‌ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మరో 6 మండలాల్లో కాపర్‌, మాంగనీస్‌ లోపం వెల్లడైంది. ఇక పొటాషియం 15 మండలాల్లో పూర్తిగా, 13 మండలాల్లో స్వల్ప స్థాయిలో లోపించింది. 5 మండలాల్లో సల్ఫర్‌ లోపం అధికంగా ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 65 శాతం భూముల్లో క్షారత్వం ఉంది. జిల్లాలోని అన్ని నేలల్లో సేంద్రియ కర్బన కొరత ఉండనే ఉంది.

వాహన కాలుష్యమూ ఎక్కువే... : జిల్లాలో వివిధ రకాల వాహనాలు 8 లక్షలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 6 లక్షలు ఉన్నాయి. ఆటోలు 80 వేల వరకు ఉండగా, కార్లు 80 వేలు, లారీలు 15 వేలు, పాఠశాలల బస్సులు 1000, ట్రాక్టర్లు 20 వేలు, ఆర్టీసీ బస్సులు సుమారు 1800 వరకు ఉన్నాయి. ఒక్కో వాహనం సగటున రోజుకు లీటర్‌ డీజిల్‌గాని, పెట్రోలుగాని వినియోగించినా 8 లక్షల లీటర్ల ఇంధనం వాడినట్లు లెక్క. ఈ ప్రకారం చూస్తే సుమారు 20 లక్షల లీటర్ల విష వాయువు తయారవుతుంది.

విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం

జిల్లా వ్యాప్తంగా 2016లో ప్లాస్టిక్‌ నిషేధం అమలులోకి వచ్చింది. 2019 ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 3 నుంచి ఆహారాన్ని ప్లాస్టిక్‌ కవర్లలో సరఫరా చేయడం నిషేధించినా ఎక్కడా అమలు కాలేదు. జిల్లా వ్యాప్తంగా కర్నూలు కార్పొరేషన్‌తోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ పురపాలకాలతోపాటు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, గూడూరు నగర పంచాయతీల్లో రోజుకు 52 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వినియోగమవుతుండగా మిగతా ప్రాంతాల్లో 50 మెట్రిక్‌ టన్నులు చెత్త రూపంలో సేకరణవుతోంది. నెలకు 3000 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వినియోగమవుతోంది. భూమి పొరల్లోకి చేరే ఐదు సంచుల వల్ల ఒక కిలో, రెండు సీసాల వల్ల మరో కిలో విష వాయువులు జిల్లాలో విడుదలవుతున్నాయి. అయినా ప్లాస్టిక్‌ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. పట్టణాల్లో ప్లాస్టిక్‌ నిషేధం పేరుకే పరిమితమవుతోంది. పాలకులు, అధికారులు దీనిని చిత్తశుద్ధితో అమలుచేయాల్సి ఉంది.

నేల మట్టమవుతున్న వృక్షం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని