Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పండగ నాడు.. గాల్లో కలిసిన పంచప్రాణాలు

మృతుడు వెంకట్రాముడు

శ్రీరామనవమి పర్వదినం నాడు జిల్లాకు చెందిన ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో నలుగురు మరణించగా, గుంటూరు జిల్లాలో మరొకరు మృతిచెందారు. రహదారులపై చిందిన రక్తపుధారలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

మల్లెపల్లిలో ఎలక్ట్రీషియన్‌...

వెల్దుర్తి, న్యూస్‌టుడే: 44వ జాతీయ రహదారి మల్లెపల్లి స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్రాముడు(43) బుధవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉలిందకొండ గ్రామానికి చెందిన వెంకట్రాముడు వెల్దుర్తిలో నివాసముంటున్నారు. ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం కర్నూలు నుంచి వెల్దుర్తికి ద్విచక్ర వాహనంపై వెళ్లే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఇతన్ని ఢీకొట్టింది. దీంతో కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఏటుకూరులో...: గ్రామీణ గుంటూరు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గ్రామీణ గుంటూరు మండలం నల్లపాడు పోలీసుస్టేషన్‌ పరిధి ఏటుకూరులో చోటుచేసుకుంది. పత్తికొండ ప్రాంతానికి చెందిన కిశోర్‌(40) ఏటుకూరు సమీపంలోని ఒక హోటల్‌లో సప్లయర్‌గా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై భారత్‌ పెట్రోల్‌ బంక్‌ను సమీపిస్తుండగా అటుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. అక్కడికక్కడే కిశోర్‌ మృతి చెందాడు.

బందార్లపల్లెలో...: కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని బందార్లపల్లె చెక్‌పోస్టు సమీపంలో బుధవారం ఆటో, ట్రాక్టర్‌ ఢీకొన్న సంఘటనలో వీరయ్య (30) మృతి చెందారు. బందార్లపల్లె గ్రామానికి చెందిన వీరయ్య, రామలక్షుమ్మలు ఆటోలో తాడిపత్రికి బయలుదేరారు. తాడిపత్రి నుంచి ట్రాక్టర్‌ బందార్లపల్లెకు వస్తోంది. చెక్‌పోస్టు సమీపంలో రెండు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న వీరయ్య అక్కడికక్కడే మృతి చెందగా, రామలక్షుమ్మకు గాయాలు కావటంతో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరయ్యకు భార్య కేశమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పంచనామా నిమిత్తం శవాన్ని తాడిపత్రి వైద్యశాలకు పంపించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరినాథరెడ్డి పేర్కొన్నారు.

కర్నూలులో...: కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు శివారులోని రేడియో స్టేషన్‌ సమీపంలో బుధవారం జరిగిన రహదారి ప్రమాదంలో సునీల్‌ కుమార్‌రెడ్డి(18) మృతిచెందారు. ట్రాక్టర్‌ డ్రైవరైన సి.బెళగల్‌ మండలం పోలకల్‌కు చెందిన తిరుపాల్‌ రెడ్డికి కుమారుడు, కుమార్తె సంతానం. సునీల్‌ కుమార్‌ రెడ్డి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఎలక్ట్రికల్‌ సామగ్రి కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై కర్నూలుకు వస్తున్నాడు. వర్షం పడుతున్న సమయంలో కర్నూలు శివారులోని రేడియో స్టేషన్‌ సమీపంలో వెనుకవైపు నుంచి నీళ్ల ట్యాంకర్‌ ట్రాక్టర్‌ వేగంగా ఇతన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు.

యువకుడి ఆత్మహత్య: కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలులోని పాతబస్తీ గడ్డ వీధికి చెందిన షేక్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌(20) ఆత్మహత్య చేసుకున్నారు. ఇతని తండ్రి ఇబ్రహీం గతంలో చనిపోయారు. తల్లి షేక్‌ మున్నీసా నగరపాలక సంస్థ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఒక సోదరుడు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. ఇర్ఫాన్‌ ఆరోగ్యం దెబ్బతినడంతో కడుపునకు శస్త్రచికిత్స చేయించారు. మంగళవారం రాత్రి క్షణికావేశంలో ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని