స్వచ్ఛంగా.. మూలనపడ్డాయ్‌!
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

స్వచ్ఛంగా.. మూలనపడ్డాయ్‌!

రూ.కోట్ల నిధులతో వాహనాల కొనుగోలు

వినియోగించక దెబ్బతింటున్న వైనం

తుప్పు పట్టి..

ఈ చిత్రంలో కనిపిస్తున్న వాహనాలు డోన్‌ పురపాలకకు సంబంధించిన డంపర్‌ప్లెసర్‌, పూడిక తీసే లోడర్‌. ఇవి మరమ్మతులకు గురై ఏళ్లు గడుస్తున్నాయి. చివరికి జీడీపీ ప్లాంటులో మూలనపడేశారు. చివరికి తుప్పు పట్టి పనికిరాకుండా పోతున్నాయి. రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన డంపర్‌ప్లెసర్‌ పూర్తిగా పనికిరాకుండా పోయింది. ఒకసారి రూ.38 వేలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించినా ఒకరోజు నడిచి తిరిగి మూలకు చేరుకుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా కాల్వల్లో పూడికను తొలగించే రూ.25 లక్షల విలువైన లోడర్‌ వచ్చింది. వీధుల్లో కాల్వలు చిన్నవిగా ఉండటంతో లోడర్‌తో పూడికను తొలగించలేని స్థితి. చివరికి దానిని వృథాగా పడేశారు.

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే : డోన్‌ పురపాలక పరిధిలో పారిశుద్ధ్యం మెరుగు కోసం 2006లో సాధారణ నిధులు, 12, 13వ ఆర్థిక సంఘాల కింద రూ.90 లక్షల దాకా వెచ్చించి అధికారులు పలు వాహనాలు కొనుగోలు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కింద దాదాపు రూ.2.45 కోట్ల విలువైన కాంప్యాక్టర్లు, డంపర్లు తదితర వాహనాలు వచ్చాయి. వీటన్నింటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. కానీ వీటిపై దృష్టి సారించకపోవడంతో అవి మరమ్మతులకు గురై క్రమంగా దెబ్బతింటున్నాయి.

భారీగా ఖర్చు చేస్తున్నా..

వాహనాలకు మరమ్మతుల పేరిట రూ. లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం శూన్యమే. రెండు కాంప్యాక్టర్లు, మూడు ట్రాక్టర్లు, ఏడు మినీ ఆటోలను చోదకులు ప్రస్తుతం వినియో గిస్తున్నారు. కొన్నింటికి సంబంధించి నిర్వహణ సరిగా లేక తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వీటికి రిపేర్లు చేయాలంటే పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతుంది. అంత ఖర్చు చేయలేక కొన్నింటిని వృథాగా పడేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కింద డోన్‌కు మూడు కాంప్యాక్టర్లు కేటాయించారు. ఒక్కో వాహనాన్ని రూ.35 లక్షలతో కొనుగోలు చేశారు. వాటిల్లో ఒకటి రిపేరుకు గురవడంతో జీడీపీ (గాజులదిన్నె ప్రాజెక్టు) ప్లాంటు లో ఉంచారు. అక్కడ ఎండకు ఎండి.. వానకు తడిసి దెబ్బతింటున్నాయి.

తరచూ రిపేర్లు

ఈ చిత్రంలో కన్పిస్తున్న ట్రాక్టర్‌ పొక్లెయిన్‌ను రూ.15 లక్షలతో కొనుగోలు చేశారు. ఈ వాహనం ఇది వరకు 2019లో ఒకసారి మరమ్మతులకు గురవగా రూ.33 వేలతో మరమ్మతులు చేయించారు. కొన్నాళ్లపాటు పని చేసి తిరిగి మూలనపడింది. 15 రోజుల క్రితం కర్నూలులో మెకానిక్‌కు చూపగా పలు వస్తువులు పోయినట్లు అతను తెలిపినట్లు సమాచారం. ఇవన్నీ కావాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఈ విషయమై పురపాలక శానిటరీ అధికారి సుబ్బరాయుడు మాట్లాడుతూ పలు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయని చెప్పారు. మినీ ఆటోలు, ట్రాక్టర్లకు సంబంధించి మరమ్మతుల కోసం రూ.4.50 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. వాటికి మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని