అవసరం కొండంత..మంజూరు గోరంత!
eenadu telugu news
Published : 20/10/2021 05:04 IST

అవసరం కొండంత..మంజూరు గోరంత!

రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలు..
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు సూక్ష్మ సేద్య విధానంలోనే సాధ్యమవుతుంది. ఈ పద్ధతిలో బొట్టుబొట్టూ మొక్కకు చేరుతుంది. తద్వారా నీటి వృథాను అరికట్టేందుకూ వీలుంటుంది. అందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం రాయితీపై పరికరాలు అందించేందుకు లక్ష్యాలు ఎప్పుడు నిర్దేశిస్తారా అని ఎదురుచూస్తున్న రైతుల్లో ఎక్కువ మందికి నిరాశే మిగిలింది. డిమాండ్‌కు తగ్గట్టుగా మంజూరు లేని తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం...

జహీరాబాద్‌లో ఎక్కువగా...: జిల్లాలో జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌, కోహీర్‌, జహీరాబాద్‌, మొగుడంపల్లి మండలాలకు చెందిన రైతులు ఈ పద్ధతిలో ఎక్కువగా పంటలు పండిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో అంతంతమాత్రమే. నీటి వృథాను అరికట్టేందుకు అన్ని ప్రాంతాల అన్నదాతలూ ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇందుకు అనుగుణంగా రాయితీపై పరికరాల మంజూరు లేకపోవడం గమనార్హం.

రెండేళ్లతో పోల్చితే మెరుగే అయినా..

జిల్లాకు ప్రస్తుతం బిందు సేద్యంలో 480 హెక్టార్లను, తుంపర సేద్యంలో 327 హెక్టార్లను లక్ష్యంగా పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలతో పోల్చితే లక్ష్యం కొంత మెరుగ్గానే ఉన్నా డిమాండ్‌కు తగ్గట్టుగా మాత్రం లేదు. దీంతో కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరనుంది.

దరఖాస్తులు భారీగా..: ఈ విధానంలో సాగుకు అవసరమైన పరికరాల కోసం ఆసక్తి చూపుతున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. రాయితీ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్నారు. 293 మంది రైతులు 9,868 హెక్టార్లలో సేద్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బిందు, తుంపర కలిపి 807 హెక్టార్లకు మాత్రమే పరికరాలు ఇవ్వనున్నారు.

కలుపు సమస్యా తక్కువే..: ఈ విధానంలో ప్రతి నీటిబొట్టు సద్వినియోగమవుతుంది. కలుపు సమస్య తక్కువ. పొలానికి నీరు పెట్టేందుకు కూలీలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ కాలంలో అయినా పంటలు పండించుకోవచ్ఛు పురుగుల మందు ద్రావణాన్ని ప్రతి మొక్కకూ నీటితోపాటే అందించే వీలుంటుంది. ఇందువల్ల వృథాకు అడ్డుకట్ట పడుతుంది. ఇన్ని ఉపయోగాలుండటంతో రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నా, సరైన ప్రోత్సాహం లేకుండాపోయింది.

అర్హులను ఎంపిక చేస్తాం సునీత, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి

సూక్ష్మసేద్యం కోసం ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రౌడింగ్‌ ప్రక్రియను వేగవంతం చేస్తాం. లోపాలకు తావు లేకుండా అర్హులను ఎంపికచేస్తాం. రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. ముందు దరఖాస్తు చేసిన వారికి ముందు ప్రాతిపదికన పరికరాలు బిగిస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని