గంజాయి కట్టడికి కార్యాచరణ
eenadu telugu news
Published : 25/10/2021 03:20 IST

గంజాయి కట్టడికి కార్యాచరణ

 తనిఖీలు ముమ్మరం, ఊరూరా అవగాహన సదస్సులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను తొలగింపజేస్తున్న పోలీసులు

గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు జిల్లా పోలీసు, ఆబ్కారీ శాఖలు సంయుక్తంగా సిద్ధమయ్యాయి. ఇప్పటీకే రెండు శాఖల అధికారులు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రత్యేక కార్యదళం (టాస్క్‌ఫోర్స్‌) బృందాలను ఏర్పాటు చేసి.. తనిఖీలను విస్తృతం చేశారు. గంజాయి సాగును గుర్తించేందుకు వ్యవసాయ క్షేత్రాల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు.. అక్రమ రవాణాను అడ్డుకునేలా నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశారు. ఈ నేపథ్యంలో కథనం.

ఇటీవల అరెస్టైన గంజాయి విక్రేతల  వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

గతంలో ఉద్ధృతం.. మళ్లీ అదే తీరు..
జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, అందోలు పరిధిలో పోలీసు సర్కిల్‌ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఆయా ఠాణాల పరిధిలో సీఐల నుంచి కానిస్టేబుళ్ల వరకు విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఆదేశాల మేరకు రెగ్యులర్‌ విధులతో పాటు గంజాయి సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. గతంలో నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో గంజాయి సాగు జోరుగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గంజాయి సాగు, గుడుంబాపై ఉక్కుపాదం మోపింది. వారికి స్వయం ఉపాధి మార్గాలను చూపింది. నాలుగైదు ఏళ్లపాటు సద్దుమణిగినా.. తాజాగా నారాయణఖేడ్‌, అందోలు, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో పత్తి, చెరకు, కంది, తదితర పంటల్లో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆబ్కారీ, సివిల్‌ పోలీసుల దాడుల్లో ఈ సాగు విషయం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు ప్రత్యేక ఆదేశాల నేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి...
జిల్లాలో ఎండు గంజాయి అక్రమ రవాణా, సాగు ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి వస్తున్నాయి. ఎండు గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి రూ.300 నుంచి రూ.500 ధరతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.లక్షల ఆదాయం వస్తోందనే ఆశతో చాలా మంది వ్యాపారులు, కొందరు రైతులు ఈ దందాపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో గంజాయి రవాణా, సాగు కేసుల్లో కీలకంగా వ్యవహరించిన వారే ఇప్పుడు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో సాగుతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ఇక్కడికి సరఫరా అవుతున్నట్టు అప్పుడప్పుడు వెలుగుచూస్తున్న ఘటనల ద్వారా అర్థమవుతోంది. ముఠాలుగా ఏర్పడి విద్యార్థులు, కార్మికులను లక్ష్యంగా చేసుకొని విక్రయాలు చేపడుతున్నారు. అంతేకాకుండా జిల్లా మీదుగా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు సరఫరా చేస్తున్నారు.
పట్టిస్తే నజరానా.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు
పోలీసులు విధి నిర్వహణలో భాగంగా గంజాయి సాగుదారులను గుర్తించి పట్టుకున్నా, అక్రమ రవాణాను అడ్డుకున్నా ప్రభుత్వం ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు అందించనుంది. అంతేకాదు.. గంజాయి రవాణాకు సహకరించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోనుంది. ప్రజలు సమాచారం ఇస్తే.. ప్రోత్సాహకం అందించడంతో పాటు.. వివరాలు గోప్యంగా ఉంచనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన శాంతిభద్రతల సమీక్షలో ఎస్పీ వెల్లడించారు.
కఠినంగా వ్యవహరిస్తాం..: ఎం.రమణకుమార్‌, ఎస్పీ
గంజాయి, గుట్కా, మట్కా, పేకాట తదితరాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రధాన మార్గాలో కాకుండా.. గంజాయి రవాణాకు అవకాశమున్న అడ్డదారుల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశాం. మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తి ఎలాంటి నేరాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అందుకే యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి సాగు చేసినా, ప్రోత్సహించినా.. జైలుకు పంపిస్తాం. ఎవరినీ ఉపేక్షించం.
దృష్టి సారించిన పోలీసు, ఆబ్కారీ శాఖలు
ః జిల్లాలో 647 గ్రామ పంచాయతీలున్నాయి. వాటి పరిధిలో వీఆర్‌ఏలు, సివిల్‌ పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది సంయుక్తంగా నిత్యం గ్రామాల్లో పర్యటించాలి. గంజాయి సాగు, ఆక్రమ రవాణా, దందాలపై వివరాలు సేకరించాలి. ః గంజాయి దందా కొనసాగుతున్న ప్రాంతాలను శిక్షణ ఎస్సైలు, ఎస్‌హెచ్‌ఓలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. కారకులను గుర్తించి తహసీల్దార్ల వద్ద బైండోవరు చేస్తారు. ః చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి.. ఆబ్కారీ, పోలీసు అధికారులు వేర్వేరుగా తనిఖీలు చేపట్టడం. ః ప్రధానమార్గాలు, కీలక దారుల్లో నిత్యం రోజంతా నిఘా. ః ప్రజలు టోల్‌ ఫ్రీ నంబర్‌ 08455-276385కు సమాచారం ఇవ్వాలని ప్రచారం. ః ఈనెల 25నుంచి ఊరూరా అవగాహన సదస్సుల నిర్వహణ. గంజాయి సాగు చేస్తే.. రైతు బంధు, బీమా వర్తించదని తెలియజేస్తారు.
ప్రజల్ని చైతన్యం చేస్తాం..
డి.గాయత్రి, ఆబ్కారీ శాఖ జిల్లా అధికారిణి

జిల్లాలో ప్రతి గ్రామంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు, ఆబ్కారీ, సివిల్‌ కానిస్టేబుళ్ల పర్యటిస్తారు. గంజాయి సాగు, రవాణా చేస్తే కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించి చైతన్యం చేస్తారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్తాం. ఈనెల 25 నుంచి అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని