వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

బాన్సువాడ గ్రామీణం, న్యూస్‌టుడే: సోమేశ్వర్‌ గ్రామానికి చెందిన బింగి పోచయ్య(55) రోడ్డు దాటుతుండగా బాన్సువాడ నుంచి దుర్కి వైపు వెళ్తున్న వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ ఢీకొట్టారు. దీంతో పోచయ్య ఎగిరిపడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు నిందితున్ని పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.


భిక్కనూరులో...

భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు భిక్కనూరు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. శనివారం తెల్లవారుజామున జంగంపల్లి కృష్ణ మందిరం సమీపంలో 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు.


శంకర్‌

చెట్టుకు ఢీకొని ...

రామాయంపేట: భిక్కనూర్‌ మండలం భాగీర్తిపల్లికి చెందిన రాజం శంకర్‌ (38) చేపలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం భాగీర్తిపల్లిలోని కొత్త చెరువులో చేపలు పట్టేందుకు వెళ్తున్నారు ఈ క్రమంలో కోనాపూర్‌ శివారులోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టారు. దీంతో కాలువలో ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి ఆయన్ను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యుడు తేల్చిచెప్పారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


నిందితులను తహసీల్దారు ఎదుట హాజరుపర్చిన ఎక్సైజ్‌ అధికారులు

పది మంది బైండోవర్‌

భిక్కనూరు, నస్రుల్లాబాద్‌, న్యూస్‌టుడే: పాత కేసుల్లో నిందితులైన తొమ్మిది మందిని భిక్కనూరు తహసీల్దారు నర్సింలు ఎదుట శనివారం బైండోవర్‌ చేశామని దోమకొండ ఆబ్కారీ ఎస్సై పోతారెడ్డి తెలిపారు. వీరిలో సారా కేసులో నిందితులు మాలావత్‌ సక్రియా, మలోత్‌ విట్టల్‌, మలోతు పర్ష, క్లోరోహైడ్రేట్‌ కేసులో పెంటల రాజాగౌడ్‌, బాబాగౌడ్‌, మీసాల మహిపాల్‌గౌడ్‌, రమేష్‌, మీసాల ప్రవీణ్‌గౌడ్‌, రామాయంపేట తిరుపతిగౌడ్‌ ఉన్నారు. ఎస్సై రోజా, సిబ్బంది మహేష్‌బాబు, శరత్‌ పాల్గొన్నారు. నస్రుల్లాబాద్‌ మండలం బొమ్మన్‌దేవుపల్లి గ్రామానికి చెందిన సుందర్‌సింగ్‌ను బైండోవర్‌ చేసినట్లు తహసీల్దారు ధన్‌వాల్‌ తెలిపారు.


ఇసుక నిల్వల స్వాధీనం

లింగంపేట, న్యూస్‌టుడే: శెట్‌పల్లిసంగారెడ్డి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక కుప్పలను ఆర్‌ఐ బాలయ్య జప్తు చేశారు. పెద్దవాగు సమీపంలోని గ్రామానికి చెందిన ఆకుల రాజయ్య, కమ్మ రాజయ్య పంట పొలాల్లో సుమారు 40 ట్రిప్పుల ఇసుక నిల్వచేశారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయన వెంట వీఆర్‌ఏలు ఉన్నారు.


విద్యుదాఘాతంతో గేదె మృత్యువాత

కుప్రియాల్‌(సదాశివనగర్‌), న్యూస్‌టుడే : గ్రామానికి చెందిన భిక్నూరు చిన్నబాబుకు చెందిన గేదెకు శనివారం విద్యుత్తు తీగలు తాకడంతో మృత్యువాత పడింది. గేదె విలువ సుమారు రూ. 50 వేల వరకు ఉంటుందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


పిట్లంలో దొంగల హల్‌చల్‌

పిట్లం, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని వారాంతపు సంతలో దొంగలు హల్‌చల్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం నలుగురి వ్యక్తుల నుంచి చరవాణులు చోరీ చేశారు. అల్లాపూర్‌కు చెందిన మార్గం గంగవ్వ 8 మాసాల బంగారు గుండ్ల తాడును అపహరించారని, వాటి విలువ రూ.40 వేలు ఉంటుందని బాధితురాలు చెప్పారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని