యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ పనులు
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ పనులు

 డీఆర్‌సీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విశ్వరూప్‌ 


సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.విశ్వరూప్, చిత్రంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి,
ఆదిమూలపు సురేష్, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజల దాహార్తిని తీర్చడానికి వెలిగొండ ప్రాజెక్ట్ట్‌ పనులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.విశ్వరూప్‌ అన్నారు. ప్రకాశం భవన్‌లోని స్పందన భవన్‌లో బుధవారం జిల్లా సమీక్షా మండలి(డీఆర్‌సీ) సమావేశం జరిగింది. గెజిట్‌లో ప్రాజెక్ట్‌ పేరు లేదని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. కొవిడ్‌ మూడో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. అధిక ధరలతో పేదలు ఇసుక కొనలేక ఇబ్బందులు పడుతుంటే పక్కాగృహాల నిర్మాణం ఎలా ముందుకు సాగుతుందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఇసుక సరఫరా చేసే బాధ్యత ప్రైవేట్‌ సంస్థకు అప్పగిస్తే పేదలు తీసుకువెళ్లే వాహనాలపై ఎందుకు కేసులు పెడుతున్నారన్నారు. గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతంలో ఇసుక రేవులకు అనుమతి ఇచ్చే అంశంపై పరిశీలించాలని..అలాగే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆన్‌లైన్‌ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్‌ టన్నెల్‌ నిర్మాణం, ఆర్‌.ఆర్‌.కాలనీల పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే సంవత్సరం కృష్ణా జలాలు జిల్లాకు వస్తాయన్నారు. పుల్లలచెరువు మండలంలోని 11,500 ఎకరాలు సాగులోకి వచ్చేలా టి.5 కాలువను పొడిగించకుండా పనులను నిలిపివేసిన గాయత్రి కన్‌స్ట్రక్షన్స్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మిగుల జలాల ఆధారంగా చేపట్టే వెలిగొండ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. 
విమానాశ్రయానికి స్థలం..
కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ భూ సమస్యలపై అన్ని సచివాలయాల్లో అర్జీల స్వీకరణకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకుంటామన్నారు. మార్టూరు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నందున స్థలం గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో జేసీలు వెంకట మురళి, చేతన్, విశ్వనాథన్, కృష్ణవేణి, డీఆర్వో తిప్పేనాయక్‌తోపాటు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 ప్రజా ప్రతినిధులు ఏమన్నారంటే...
* అక్రమాలకు పాల్పడిన కందుకూరు, అద్దంకి ఎంఈవోలపై విచారణ జరపాలి. 
-యండవల్లి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ 
* చీరాలలో లోఓల్టేజీ సమస్య పరిష్కరించాలి. విలువైన భూముల్లో ఆక్రమణలను తొలగించాలి. 
-పోతుల సునీత, ఎమ్మెల్సీ 
* విద్యుత్తు పరివర్తకాల మరమ్మతుల షెడ్డులో రూ.70 లక్షల విలువ చేసే సామగ్రి అపహరించిన గుత్తేదారుడికే నూతన ప్రాజెక్ట్‌ ఇవ్వడం ఏమిటి? ఉలవపాడు మండలంలో రూ.19.99 లక్షల పేద మహిళల సొమ్ము కాజేసిన వెలుగు సిబ్బందిపై ఏం చర్యలు తీసుకున్నారు.
- మానుగుంట మహీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే, కందుకూరు 
* నాటుసారా తయారీని అరికట్టాలని కోరినా చర్యలు తీసుకోలేదు. ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు గృహాలతో పాటు, ఖాళీ స్థలాలకు పరిహారం అందించాలి. పంచాయతీ కార్యదర్శి రూ.32 లక్షలు కాజేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. భూముల ఆన్‌లైన్‌ అక్రమాలు అరికట్టాలి.  
- అన్నా రాంబాబు, గిద్దలూరు
* వెలిగొండ ప్రాజెక్ట్‌ కాలువల కింద ఎన్ని చెరువులు నింపడానికి అవకాశాలు ఉన్నాయో స్పష్టత ఇవ్వాలి. 
-కుందురు నాగార్జునరెడ్డి, మార్కాపురం 
* సాగర్‌ జలాలు ఆయకట్టు చివరి భూములకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. చేనేత కాలనీ విద్యుద్దీకరణకు డబ్బులు చెల్లించినా స్తంభాలు వేయడంలేదు. 
-కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల 
*  గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో అనధికారిక చేపల వేటను అరికట్టాలి. ముంపు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలి - సుధాకర్‌బాబు, సంతనూతలపాడు
* ఫ్లోరైడ్‌ సమస్య అధికంగా ఉన్న కనిగిరిలో డయాలసిస్‌ కేంద్రం సామర్ధ్యాన్ని 30 పడకలకు పెంచాలి. 50 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి. 
-బుర్రా మధుసూదన్‌యాదవ్, కనిగిరి
* దర్శి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గత కొవిడ్‌ కేంద్రాల్లో సేవలందించిన వారికి బిల్లులు చెల్లించలేదు .-మద్దిశెట్టి వేణుగోపాల్, దర్శి 


పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని