నాగావళి తీరం... భయం భయం!
eenadu telugu news
Published : 28/09/2021 04:33 IST

నాగావళి తీరం... భయం భయం!


సంతకవిటి: నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వస్తున్న వరదనీరు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: పక్కనున్న విజయనగరం జిల్లాలో, ఎగువన ఉన్న ఒడిశాలో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో సువర్ణముఖి, వేగావతి నదుల ఉప్పొంగడంతో వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. సోమవారం సాయంత్రానికి మడ్డువలస నుంచి 51 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. అప్పటికే నదిలో ఉన్న నిలకడ ప్రవాహానికి ఈ నీరు తోడుకావడంతో దాదాపు 70 వేల క్యూసెక్కులు ప్రవహించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. నాగావళి ప్రవాహం ఆధారంగా ప్రమాదకరస్థాయిలను నిర్ణయించారు. మడ్డువలస వద్ద 30 వేల క్యూసెక్కులకు, నారాయణపురం ఆనకట్ట వద్ద 60వేలకు, శ్రీకాకుళం నగరం వద్ద 94,600 క్యూసెక్కులు ప్రవహిస్తే ఒకటో ప్రమాదకర స్థాయిగా నిర్ణయించారు.

యంత్రాంగం అప్రమత్తం: నాగావళి నదికి వరద ముంపు పొంచి ఉందన్న సమాచారంతో అధికారయ యంత్రాంగం అప్రమత్తమైంది. నదీతీరంలో ఉన్న గ్రామాల్లో సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామస్థులు నది వద్దకు వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లఠ్కర్‌ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలకు సిద్ధం చేశారు.

ముప్పు ఎక్కడెక్కడంటే

వీరఘట్టం మండలం: కడకెల్ల, చిట్టపులివలస, గెడగమ్మ, కిమ్మి, కొట్టుగుమడ, చిదిమి, పీవీఆర్‌పురం, బిటివాడ, మొట్టవెంకటాపురం, తలవరం, నీలానగరం, కుమ్మరగుంట, పనసనందివాడ

పాలకొండ: యరకరాయపురం, గొట్టమంగళాపురం, చినమంగళాపురం, గోపాలపురం, అన్నవరం, అంపిలి గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. సంతకవిటి మండలంలో జావాం, కేఆర్‌పురం, పీజేపేట, రంగరాయపురం, తమరాం, మేడమర్రి, బూరాడపేట, హొంజరాం, చిత్తారపురం, నాయుడుపేట, వాల్తేరు

రేగిడి: బొడ్డవలస, కేవీపురం, రేగిడి, పుర్లి, ఖండ్యాం గ్రామాలకు, బూర్జ మండలంలో అల్లెన, నీలాపురం, లక్కుపురం, పనుకుపర్త, ఖకండ్యాం, లంకాం, బూర్జ, మామిడివలస, నారాయణపురం, లాభాం, గుత్తావల్లి


వంశధారలో పెరుగుతున్న నీటి మట్టం

హిరమండలం, న్యూస్‌టుడే : వంశధార నదిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. ఒడిశాలో విస్తారంగా వర్షం కురుస్తుండడంతో వంశధార ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా గొట్టాబ్యారేజీ వద్ద అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడిచిపెట్టారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 27,129 క్యూసెక్కులుగా నమోదు అయిందని, రాత్రి సమయానికి 35 వేల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని డీఈఈ ఎం.ప్రభాకర్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని