సాగరమే రాజమార్గం
eenadu telugu news
Published : 28/10/2021 03:56 IST

సాగరమే రాజమార్గం


ఇటీవల రణస్థలం వద్ద సముద్ర తీరంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సారా ప్యాకెట్లు ఉన్న బస్తాలు

పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. మద్యం ధరలు పెరిగిపోవడం, తక్కువ ధరకే సారా లభ్యం కావడంతో మందుబాబులు దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోపక్క ఒడిశా నుంచి జిల్లాకు యథేచ్ఛగా దిగుమతి అయిపోతోంది. ఎస్‌ఈబీ, పోలీసు అధికారుల దాడుల్లో భారీగా నిల్వలు పట్టుబడుతున్నాయి. ఈనేపథ్యంలో అక్రమార్కులు ఇప్పుడు రూటు మార్చారు. రోడ్డు మార్గాన అయితే దొరికిపోతామనే ఉద్దేశంతో సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. ఒడిశా తీర ప్రాంతాల నుంచి పడవల ద్వారా చేరవేస్తున్నారు. చీకటి వ్యాపారాన్ని ఎవరి కన్నూ పడకుండానే సాగించేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, సోంపేట

యువతా ఇటువైపే..: ఆదాయం సులభంగా రావడంతో కొంతమంది యువత సారా అమ్మకాల వైపు ఆకర్షితులవుతున్నారు. ద్విచక్ర వాహనాల డిక్కీల్లో సారా ప్యాకెట్లను జిల్లాలోని ఆయా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఈ సమయంలో కొందరు పోలీసులకు పట్టుబడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఆదాయం వస్తుండటంతో గ్రామాల్లో నానాటికీ అమ్మకందార్ల సంఖ్య పెరుగుతోంది.

దాడులకే పరిమితం..: అబ్కారీ, పోలీసు అధికారులు దాడులు చేస్తూ పట్టుబడిన సారా, ఊట, బట్టీలను ధ్వంసం చేస్తున్నారు. మూలాల్లోకి వెళ్లకపోవడంతో మార్పు రావడం లేదు. సాంకేతికత ఆధారంగా జరుగుతున్న లావాదేవీలు, ఫోన్ల సంభాషణలు, వ్యాపారుల కదలికలపై దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒడిశా అధికారులతో సమన్వయ లోపాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి.ఒడిశాలోని ఇంద్రచ్చి సహా పలు గ్రామాలు సారాతయారీలో పేరొందాయి. వీరు పక్కనే ఉన్న సిక్కోలుపై ఆధారపడి వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా పడవల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సముద్ర మార్గాన తరలించేస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు 12 తీర మండలాలకు ఇలా చేరవేస్తున్నారు.

సరిహద్దుల్లోనూ యథేచ్ఛగా..: ఒడిశాలోని గొంగాపూర్‌లోనూ భారీ ఎత్తున తయారు చేస్తున్న సారాను ఐదు, పది లీటర్ల క్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సీతంపేట, కొత్తూరు, భామిని, పాతపట్నం, మెళియాపుట్టి తదితర మండలాలతో పాటు సరిహద్దు మండలాల్లోని పల్లెలకూ చేరవేస్తున్నారు. అక్కడ సరకుని రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. కంచిలి నుంచి మెళియాపుట్టి మండలం వరకు సరిహద్దు గ్రామాల పరిధిలో నేరుగా బట్టీలు ఏర్పాటు చేసి తయారీ, విక్రయాలు చేస్తున్నారు. మహేంద్రగిరుల సరిహద్దు ప్రాంతాలు తయారీకి కేంద్రాలుగా మారాయి.

ఎలా సాగుతోందంటే..

వ్యాపారమంతా మూడోకంటికి తెలియకుండా రాత్రివేళలో కానిచ్చేస్తున్నారు. ఒడిశాలో వేటకు వెళుతున్నట్లుగా పడవల్లో సరకు ఎక్కించేస్తున్నారు. అక్కడి నుంచి సముద్ర మార్గం మీదుగా డొంకూరు, కపాసుకుద్ది, ఇద్దివానిపాలెం, ఇసకలపాలెం, ఏడూళ్లపాలెం, గంగువాడ నిర్దేశిత గ్రామాలకు సరకు చేరవేస్తున్నారు. అక్కడున్న వ్యాపారులకు చెందిన ఏజెంట్లు సరకుని ఇసుకదిబ్బల్లో పాతిపెడుతున్నారు. అవసరం మేరకు మిగిలిన గ్రామాలకు చేరవేస్తున్నారు. ఏజెంట్లకు రూ.100కు మూడు ప్యాకెట్ల చొప్పున, చిల్లర వ్యాపారులకు రూ.100కు రెండు ఇస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితిని బట్టి ఒక ప్యాకెట్‌ రూ.వంద నుంచి రూ.120కు విక్రయిస్తున్నారు.

మూలాల్లోకి వెళ్లి అడ్డుకట్ట వేస్తున్నాం: సారా నిర్మూలనకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం. రోడ్డు మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించి ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. తీర ప్రాంత మండలాల్లోని గ్రామాలు, గిరిజన తాండాల్లో కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తయారీదారుల నుంచి సరఫరాదారులు, విక్రయదారులు ఇలా మూలాల్లోకి వెళ్లి మరీ అడ్డుకట్ట వేస్తున్నాం. చిక్కింది ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు.

- కె.శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ, సెబ్‌


తీరప్రాంతాలకు ఇలా వెళ్తుంది ఇంద్రచ్చిఒడిశా రాష్ట్రం

* సముద్ర మార్గం ద్వారా తీసుకొచ్చి మందస మండలం చినకోస్తా అటవీ ప్రాంతంలో 11 గోనె సంచుల్లో నిల్వ ఉంచిన 305 లీటర్ల సారాను ఈ నెల 4న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ●

* సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ఈ నెల 2న సారా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

* సోంపేట మండలం సిరిమామిడిలో ఓ వృద్ధుడు మరణించడంతో అంత్యక్రియల వేళ శ్మశానం వద్ద నాటుసారా తాగి దాదాపు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఏడాది కాలంలో నమోదైన కేసుల వివరాలు...

మొత్తం కేసులు: 1,265

అరెస్టు చేసింది: 1,945మందిని

స్వాధీనం చేసుకున్న సారా: 12,312 లీటర్లు

ప్యాకెట్లు: 52,899

సీజ్‌ చేసిన అన్నిరకాల వాహనాలు: 267


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని