Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ప్రైవేటుకు కట్టబెడితే సహించం’

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తే సహించేంది లేదని 78వ వార్డు కార్పొరేటర్‌ బి.గంగారామ్‌ అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో చేపడుతున్న దీక్షలకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. లాభాల్లో ఉన్న పరిశ్రమలను అమ్మడం అన్యాయమన్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
ఉక్కు కర్మాగారం విస్తరణ వల్ల కార్మికులు, నిరుద్యోగులకు ఎంతో మేలు జరిగిందని పోరాట కమిటీ ఛైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం కార్మికులు శ్రమిస్తున్నారని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంస్థను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామన్నారు.
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న దీక్షలు ఆదివారం 59వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో ఎస్‌ఎంఎస్‌-1 కార్మికులు, అధికారులు కూర్చున్నారు. పోరాట కమిటీ నాయకులు కె.సత్యనారాయణ, వరసాల శ్రీనివాసరావు, బి.మురళీరాజు, జి.వెంకటరావు, జి.బోసుబాబు, వైటీ దాస్‌, ఇంటక్‌ నాయకులు సుబ్బయ్య, సిటు నాయకులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

‘ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’
సీతంపేట, న్యూస్‌టుడే: ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని దళిత సంఘాల ఐక్య వేదిక సభ్యులు ఉద్ఘాటించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో సోమవారం వీరంతా రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్‌ మాట్లాడుతూ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు పోరాటంలో దళిత సంఘాలు భాగస్వామ్యం అవుతాయన్నారు. ఈ నెల 17న దళితులు అధిక సంఖ్యలో నిరసన దీక్షలో పాల్గొంటారన్నారు. సమావేశంలో విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ బి.వెంకటరావు, అంబేడ్కర్‌ భవన్‌ గౌరవ అధ్యక్షుడు బొడ్డు కల్యాణరావు, ఏయూ ఆచార్యులు పి.ప్రేమానందం, కొత్తపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని