‘ఓడ’కుండా వ్యూహముందా!?
logo
Published : 18/06/2021 03:52 IST

‘ఓడ’కుండా వ్యూహముందా!?

‘విశాఖ పోర్టు’ ముందు సవాళ్లెన్నో...!
ఈనాడు, విశాఖపట్నం

దిగ్గజ ప్రభుత్వరంగ సంస్థ ‘విశాఖ నౌకాశ్రయం’ ముందు ఎన్నో సవాళ్లు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఎదురవనున్న పరిణామాలను తట్టుకొని నిలబడగలిగేలా వ్యూహాలకు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమయింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మితమవుతున్న పలు నౌకాశ్రయాలతో పాటు ప్రైవేటు నౌకాశ్రయాల నుంచి వచ్చే పోటీలో నిలబడితేనే దిగ్గజ సంస్థలో ఉద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఈ అంశంపై ఇప్పటికే అంతర్గత చర్చలు సాగుతున్నట్లు సమాచారం.

దేశంలోని మేజర్‌ పోర్టుల్లో ఒకటిగా పేరొంది... జాతీయస్థాయిలో మూడోస్థానంలో ఉన్న విశాఖ నౌకాశ్రయానికి వ్యాపారపరంగా పోటీపడడానికి ఎన్నో అడ్డంకులున్నాయి. ప్రైవేటు సంస్థలు వ్యాపారాన్ని పెంచుకునేందుకు వీలుగా వివిధ రకాల రుసుంలు గణనీయంగా తగ్గిస్తుంటాయి. పోటీగా ధరలను తగ్గించడానికి ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ నౌకాశ్రయానికి అవకాశం లేదు. ఇదే రాబోయే రోజుల్లో కీలకంగా మారే అవకాశం ఉందని విశాఖ నౌకాశ్రయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విశాఖ నౌకాశ్రయానికి సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా వ్యాపారం లభించటం లేదు. విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి వచ్చే వ్యాపారం కూడా తగ్గిపోయింది. సమీపంలోనే ఉన్న మరో నౌకాశ్రయంపై ఉక్కు వర్గాలు దృష్టిసారించాయి.
* నేటికీ పదేళ్ల కిందట రవాణా పరిమాణమే: విశాఖ నౌకాశ్రయం 2010-11వ ఆర్థిక సంవత్సరంలోనే 68 మిలియన్‌ టన్నుల సరకును రవాణా చేసింది. గత పదేళ్లలో ఇక్కడ రూ. వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు. నౌకాశ్రయ సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఆధునిక పరిజ్ఞానం, యంత్రపరికరాలను అందుబాటులోకి తెచ్చారు. ఇలా ఎన్ని చేసినా సరకు పరిమాణం మాత్రం ఆశించిన స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. కొత్త నౌకాశ్రయాలు అందుబాటులోకి వచ్చినా ఇక్కడి రవాణా పరిమాణం భారీగా క్షీణించకుండా మాత్రం కాపాడుకోగలిగింది.

1. విశాఖ ఓడరేవును ఇటీవలి కాలంలో పి.పి.పి. విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడి వ్యాపార లావాదేవీలను గమనించి కొన్ని ప్రైవేటు సంస్థలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టి కొన్ని జెట్టీలను నిర్వహిస్తున్నాయి. రాబోయే పోటీ రోజుల్లో విశాఖ నౌకాశ్రయం ముందుకు దూసుకు పోకపోతే తాము కూడా తీవ్రంగా నష్టపోవాల్సిన వస్తుందేమోనని మథనపడుతున్నారు.

2. విశాఖ నౌకాశ్రయ సామర్థ్యం 126 మిలియన్‌ టన్నులు. ప్రస్తుతం 72 మిలియన్‌ టన్నుల సరకును మాత్రమే రవాణా చేస్తోంది. నౌకాశ్రయ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ పలు కారణాలతో చేయలేని పరిస్థితి. వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో వ్యూహాలు ఆలోచిస్తూనే...కనీసం ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడమెలా అన్న అంశంపైనా దృష్టి కేంద్రీకరించారు.

3. నౌకాశ్రయంలో కంటైనర్‌ రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏటా 7.5లక్షల కంటైనర్ల నుంచి 14 లక్షల కంటైనర్లు రవాణా చేసే స్థాయికి సామర్థ్యాన్ని పెంచడానికి సుమారు రూ.950 కోట్లు వెచ్చించబోతున్నారు. ఈ రంగంలోనూ పోటీ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

దీర్ఘకాలంలో ఉద్యోగుల భవిష్యత్తు గందరగోళం: విశాఖ నౌకాశ్రయంలో ఒకప్పుడు 20 వేల మంది వరకు ఉండేవారు. ఆధునికీకరణ, యాంత్రీకరణ కారణంగా ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. కొత్త నియామకాలు ఆగిపోయాయి. ప్రస్తుతం 3,200 మంది ఉద్యోగులే పని చేస్తున్నారు. గత మంగళవారం నౌకాశ్రయ బోర్డు సమావేశం జరిగింది. భవిష్యత్తులో నౌకాశ్రయం ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించాం.

-బి.సి.హెచ్‌.మసేన్‌, ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం హార్బర్‌,
పోర్టు వర్కర్స్‌ యూనియన్‌, విశాఖపట్నం

రిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నాం: ప్రైవేట్‌ సంస్థల నుంచి ప్రభుత్వ సంస్థలకు ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడైనా ధరల తగ్గింపు ఉంటుంది. ఆయా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. పోటీసంస్థల నిర్ణయాలను బట్టి నౌకాశ్రయానికి నష్టం రాకుండా మేమూ తగిన నిర్ణయాలు తీసుకుంటాం.

-కె.రామమోహనరావు, ఛైర్మన్‌, విశాఖ నౌకాశ్రయం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని