ఆకూతురే.. అమ్మా.. నాన్న!
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

ఆకూతురే.. అమ్మా.. నాన్న!

నేడు కూతుళ్ల దినోత్సవం

న్యూస్‌టుడే, నర్సీపట్నం గ్రామీణం

కుమార్తె ధనలక్ష్మిని ఆశీర్వదిస్తున్న తల్లిదండ్రులు

ఆమె శరీర ఎదుగుదల మూడున్నర అడుగులతోనే ఆగిపోయినా... బతుకుబాటలో ప్రయాణం ఆపలేదు. వైకల్యం అవరోధమైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కళ్లలో ఒత్తులేసుకుని పెంచిన తల్లిదండ్రుల కోసం అడ్డంకులను సహనంతో, ధైర్యంతో అధిగమించిందామె.

అందరి జీవితాలు పూలబాట కాకపోవచ్ఛు ప్రతికూలతలు ఎదురు కావొచ్ఛు గుండెధైర్యంతో అడుగేస్తే అన్నీ సానుకూల పడతాయి. ఇందుకు తానే నిదర్శనమని ధనలక్ష్మి చెబుతున్నారు.

నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన బొల్లాప్రగడ ధనలక్ష్మి (42) ప్రస్తుతం నర్సీపట్నంలో ఓ ప్రైవేట్‌ కంటి ఆసుపత్రిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. విధి తన పట్ల చిన్నచూపు చూసినా బాధపడలేదు. చదువుకుని కుటుంబానికి ఆసరాగా ఉండాలని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన చిన్నాన్న శేషు ప్రోత్సాహంతో బీఈడీ (తెలుగు పండిట్‌) పూర్తి చేశారామె.

* 2012లో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఇక్కడా విధి చిన్నచూపే చూసింది. మూడు మార్కుల తేడాతో కొలువును కోల్పోవాల్సి వచ్చింది. బీఈడీ పట్టా ఉండడంతో కొన్నేళ్లపాటు చెట్టుపల్లి, ధర్మసాగరం, గురంధరపాలెం పాఠశాలల్లో విద్యా వాలంటీరుగా పనిచేశారామె. ప్రభుత్వం విద్యా వాలంటీర్లను తీసేయడంతో పెందుర్తిలో కొన్నాళ్లు ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేశారు. ఆ తరువాత కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకోగా, అవే ఇప్పుడు కుటుంబానికి జీవనాధారమయ్యాయి.


విధి పరీక్ష పెట్టినా...


కంప్యూటర్‌పై పని చేస్తున్న ధనలక్ష్మి

తండ్రి రామం (73) గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన వ్యవసాయ పనులు చేసేవారు. ఇప్పుడు ఏ పనిచేయలేని పరిస్థితి. తల్లి వెంకటలక్ష్మి (69) గృహిణి. మెదడుకు సంబంధించిన వ్యాధితో తమ్ముడు కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. తమ్ముడూ ధనలక్ష్మిలాగే మూడున్నర అడుగుల ఎత్తే ఉండేవాడు. ప్రైవేట్‌ బస్సులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తమ్ముడు చనిపోయిన తరువాత కుటుంబ భారాన్ని ధనలక్ష్మి మోయాల్సివచ్చింది. తండ్రి రామం ఎత్తు మూడున్నర అడుగులే. చెల్లి నాగమణి ఎదుగుదల బాగానే ఉండడంతో వివాహం చేశారు. ధనలక్ష్మికి రెండు మూడు సంబంధాలొచ్చినా వివాహాన్ని నిరాకరించింది. పెళ్లి చేసుకుని తనెళ్లిపోతే తల్లిదండ్రులను చూసుకునేందుకు ఎవరూ ఉండరని భావించింది. మొదట్లో ప్రతికూలతలు ఎదుర్కొన్నా తనకిప్పుడు విద్య గౌరవాన్ని తెచ్చిందని, కుటుంబానికి దన్నుగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సాధించాలన్నది ఆశయమన్నారు. దివ్యాంగుల కోటాలో ఆమెకు, తండ్రికి ప్రభుత్వం పింఛను ఇస్తోంది. కంప్యూటర్‌ ఆపరేటర్‌గానూ కొంత జీతం వస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని