సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Updated : 26/09/2021 03:55 IST

సంక్షిప్త వార్తలు

‘వైకాపాను వీడే ప్రసక్తే లేదు’

పాడేరు, న్యూస్‌టుడే: తన కంఠంలో ప్రాణమున్నంత వరకు వైకాపాలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎంపీపీగా ఎన్నికైన రత్నకుమారి భర్త, మాజీ ఎంపీపీ రమణమూర్తి పేర్కొన్నారు. తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి పాడేరు ఎంపీపీ పదవి తమకే ఇస్తామని చెప్పి, చివరి నిమిషంలో వేరొకరికి కట్టబెట్టేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మొదటి నుంచి ఎంపీపీ పదవి తాము ఆశించామన్నారు. విధిలేని పరిస్థితుల్లో వేరే పార్టీ బలంతో తన భార్య సొనారి రత్నంను ఎంపీపీగా గెలిపించుకున్నామని చెప్పారు. వైకాపాలో తాను సీనియర్‌ కార్యకర్తగా ఉన్నట్లు వివరించారు. కొంతమంది వ్యక్తులు పనికట్టుకుని తాను పార్టీని వీడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్యెల్యే భాగ్యలక్ష్మి అడుగుజాడల్లో నడుచుకుంటామని తెలిపారు. త్వరలో తన అనుచరవర్గంతో కలిసి ఎమ్మెల్యే దంపతులను కలవనున్నట్లు పేర్కొన్నారు.

37 కొవిడ్‌ కేసులు నమోదు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 37 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు. బాధితుల సంఖ్య 1,56,954కు చేరిందన్నారు. తాజాగా 65 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 1,54,933 మంది డిశ్ఛార్జి అయ్యారన్నారు. కాపుజగ్గరాజుపేటకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1,087కు చేరిందన్నారు. ప్రస్తుతం 934 మంది కొవిడ్‌ ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారని ప్రిన్సిపల్‌ వివరించారు.


దిల్లీకి ఎయిర్‌ ఏషియా నూతన సర్వీసు

ఎన్‌ఏడీ కూడలి, న్యూస్‌టుడే: ఎయిర్‌ ఏషియాకు చెందిన నూతన విమాన సర్వీసు నవంబర్‌ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సర్వీసు దిల్లీలో సాయంత్రం 4-15 గంటలకు బయలుదేరి సాయంత్రం 6-35 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖలో రాత్రి 10-50 గంటలకు బయలుదేరి రాత్రి 1-10 గంటలకు దిల్లీ చేరుకుంటుంది. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే రాత్రి సమయంలో ్టదిల్లీ వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది.


పటిష్టంగా చట్టాల అమలు : పీఓ

పాడేరు, న్యూస్‌టుడే: గిరిజన హక్కులకు భంగం కలగకుండా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శనివారం గిరిజన హక్కులు, చట్టాల అమలుపై తహసీల్దార్లు, వీఆర్‌వోలకు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌తో కలిసి అవగాహన కల్పించారు. 1/70 చట్టం, పీసా చట్టం-1996, అటవీ హక్కుల చట్టం-2006, భూసేకరణ చట్టం-1894-2013, జాతీయ రహదారుల చట్టం-(1956-2013), జనన మరణాలు, ఏపీ భూఆక్రమణ చట్టం-1905, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-1971, సర్వే హద్దుల చట్టం-1923, మ్యూటేషన్‌, బియ్యం కార్డులు, ఐదో షెడ్యూల్‌ వంటి అంశాలపై రెవెన్యూ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలన్నారు. గిరిజన ప్రాంతంలో భూములను గిరిజనేతరులకు బదాలయింపు చేయడం నిషేధమని చెప్పారు. గ్రామసభలకు సామాజిక సంస్థలపై ఆధిపత్యం ఉంటుందని తెలిపారు. 2005, డిసెంబరు 13 నాటికి గిరిజనుల సాగులో ఉన్న భూములకు మాత్రమే హక్కు కల్పించనున్నట్లు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఏజెన్సీలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈదురుగాలులు వీచే ప్రమాదమున్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


దూర విద్య ప్రత్యేక శిక్షణ తరగతులు వాయిదా

ఎం.వి.పి.కాలనీ: ఈనెల 27 నుంచి జరగాల్సిన దూర విద్య ప్రత్యేక శిక్షణా తరగతులు వాయిదా వేసినట్లు దూర విద్య డైరెక్టర్‌ కె.విశ్వేశ్వరరావు తెలిపారు. తదుపరి శిక్షణా తరగతుల నిర్వహించే తేదీని ఏయూ వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. వివరాలకు 0891-2844164, 7702257813 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.


నాలుగో యూనిట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం

పరవాడ, న్యూస్‌టుడే: సింహాద్రి ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో శనివారం ఉదయం 6 గంటలకు సంస్థ అధికారులు విద్యుదుత్పత్తిని పున:ప్రారంభించారు. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబులకు లీకులు ఏర్పడడంతో ఈ నెల 23న సాయంత్రం 4.30 గంటలకు విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు బాయిలర్‌ ట్యూబులకు మరమ్మతులు చేసి ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం 1, 2, 3, 4 యూనిట్లలో విద్యుదుత్పత్తి యధావిధిగా జరుగుతోంది.


పెళ్లికి నిరాకరణపై ఫిర్యాదు

సింధియా, న్యూస్‌టుడే : గత మూడేళ్ల నుంచి ప్రేమించాడు. పెళ్లి చేసుకోమంటే కులాలు వేరని జారుకున్న సంఘటనపై బాధితురాలు మల్కాపురం పోలీసులను ఆశ్రయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అశోక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన యువతి, తిమిరెడ్డి జానకీరావులు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 24న యువతి తల్లిదండ్రులతో మాట్లాడి ముహూర్తం పెట్టుకుందామన్న అతడు ఆమె ఇంటికొచ్చాడు. వారు లేకపోవడంతో ‘కులాలు వేరే అవ్వడంతో మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. నాకు వేరే సంబంధం చూశారు. నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని’ తెగేసి చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడికి గురైన యువతి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైంది. తర్వాత న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా...వారు వెంటనే స్పందించి జానకీరావుని అదుపులోకి తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని